మార్కెట్‌ గిడ్డంగిలో అగ్ని ప్రమాదం

 The fire in the market warehouse - Sakshi

దాదాపు రూ.కోటిపైనే ఆస్తి నష్టం

ఆహుతైన రూ.కోటిన్నర విలువచేసే మార్కెట్‌ గిడ్డంగి

పక్కనే ఉన్న ధాన్యం బస్తాలను తొలగించడంతో తప్పిన పెను ప్రమాదం

ఘటనాస్థలిని పరిశీలించిన కలెక్టర్‌ అనితారామచంద్రన్‌

మంటలు అదుపుచేసిన అగ్నిమాపక సిబ్బంది

సాక్షి, రాజాపేట (ఆలేరు) : రాజాపేట మండల కేంద్రంలోని మార్కెట్‌ గిడ్డంగిలో శనివారం బారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదంలో గిడ్డంగిలో నిల్వచేసిన టన్నుల కొద్దీ వేపగింజలు, వేప పిండి పూర్తిగా దగ్ధమై దాదాపు రూ.కోటిపైగా నష్టం వాటిల్లింది. అక్కడ పక్కనే నిల్వ చేసిన ధాన్యం బస్తాలు తొలగించడంతో.. నష్టం కొంతమేర తగ్గింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపుచేశారు.

వివరాల ప్రకారం.. ఆలేరు మార్కెట్‌ కమిటీ పరిధిలో ఇటీవల రూ.3 కోట్ల విలువగల రెండు మార్కెట్‌ గిడ్డంగులు నిర్మించారు. కాగా ఒక్కో గిడ్డంగి 25వేల టన్నుల సామర్ధ్యం కలిగి ఉంది. ఈ మార్కెట్‌ గిడ్డంగిలో రాయగిరికు చెందిన ఫార్చూమ్‌ బైట్‌ ప్రైవేట్‌ కంపెనీవారు ఆరు నెలల క్రితం సుమారు 780 టన్నుల వేపగింజలు, 205 టన్నుల వేప పిండిని నిల్వ చేశారు. మరో గిడ్డంగి వద్ద రేణికుంట పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేస్తున్నారు.

కాగా శుక్రవారం ఎన్నికలు ఉండటంతో మార్కెట్‌ సమీపంలోకి ఎవరూ రాలేదు. శనివారం ఉదయం ఎప్పటిలాగే వాచ్‌మన్‌ వెంకటేష్‌ వచ్చి గోదాముల షటర్లు తెరిచి చూశాడు. 11.30 గంటల సమయంలో వాసనతోపాటు పొగరావడం గమనించి మంటలు ఆర్పే ప్రయత్నం చేశాడు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల గ్రామస్తులు గమనించి అగ్నిమాపక సిబ్బంది, అధికారులకు సమాచారం అందించారు.

విషయం తెలిసిన గ్రామస్తులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గిడ్డంగి పక్కనే నిల్వ చేసిన ధాన్యం బస్తాలకు నిప్పు అంటుకోకుండా గ్రామస్తులు వాటిని పక్కకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి మంటలు గిడ్డంగి మొత్తం దావాహనంలా వ్యాపించాయి. భువనగిరి, మోత్కురు, జనగామకు చెందిన అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

అధికారులను నిలదీసిన రైతులు, గ్రామస్తులు
మార్కెట్‌ గిడ్డంగిలో కనీసం నీటి సౌకర్యం లేకుండా ఏర్పాటు చేడయంతోనే ఈ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుందని రైతులు ఆరోపించారు. మార్కెట్‌ గిడ్డంగి దగ్ధం విషయం తెలుసుకుని ఆలేరు మార్కెట్‌ అధికారులు, చైర్మన్‌ పడాల శ్రీనివాస్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ నష్టానికి గల కారణాలు తెలపాలని గ్రామస్తులు, రైతులు వారిని నిలదీశారు. ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలిని డిమాండ్‌ చేశారు.

విషయమై చైర్మన్‌ పడాల శ్రీనివాస్‌ మాట్లాడుతూ అధికారులను విచారించి గిడ్డంగిని అద్దెకు ఇచ్చామని.. గిడ్డంగితో పాటు, నిల్వ చేసిన సరుకుకు బీమా ఉందని తెలిపారు. ఇక ముందు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 

ఘటనా స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్‌
విషయం తెలిసిన వెంటనే తహసీల్దార్‌ పద్మావతి, యాదాద్రి భువనగిరి జిల్లా ఏసీపీ మనో హర్, యాదగిరిగుట్ట సీఐ ఆంజనేయులు, ఎస్‌ ఐలు నాగిరెడ్డి, వెంకటయ్య సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిం చారు. అగ్నిమాపక సిబ్బందికి సహకరించడం, సంబంధిత అధికారులకు సమాచారం అందిం చి పరిస్థితిని చక్కదిద్దారు.

రాత్రి 8 గంటల ప్రాంతంలో కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మంటలు పూర్తిగా చల్లారేవరకు అధికారులు అక్కడే ఉండాలని ఆదేశించారు. పక్కనే ఉన్న ధాన్యం నిల్వకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని కోరారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ పద్మావతి, ఏసీపీ మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ నిప్పు అంటుకున్న విషయాన్ని వాచ్‌మన్‌ ఆలస్యంగా చెప్పడంతో ఇంత ప్రమాదం జరిగిందని తెలిపారు. సమాచారం అందిన వెంటనే అప్రమత్తం చేసి నష్టాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ధాన్యం బస్తాలను తరలించడంలో సహాయపడిన గ్రామ యువకులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. రాత్రి వరకు కూడా తహసీల్దార్‌ పద్మావతి, ఎస్‌ఐ నాగిరెడ్డి, పీఏసీఎస్‌ కార్యదర్శి శేఖర్‌ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top