ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం

fire accident in hospital - Sakshi

ఇద్దరు మృతి, మరొకరు విషమం

ఆపరేషన్‌ థియేటర్లో షార్ట్‌ సర్క్యూట్, మంటలు

ఆక్సిజన్‌ సిలిండర్‌ పేలి ఆస్పత్రి నిండా పొగ

భయంతో వైద్యులు, సిబ్బంది పరుగులు

రోగులు ఉక్కిరిబిక్కిరి, హుటాహుటిన తరలింపు

 ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 193 మంది రోగులు, 200 మంది వరకు సిబ్బంది

హన్మకొండలోని రోహిణి ఆస్పత్రిలో దుర్ఘటన

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: అదో ఆస్పత్రిలోని ఆపరేషన్‌ థియేటర్‌.. ఓ వ్యక్తి కాలుకు ఆపరేషన్‌ జరుగుతోంది.. ఇంతలో ఒక్కసారిగా షార్ట్‌సర్క్యూట్‌.. చుట్టూ మంటలు.. అవి అంటుకుని ఆక్సిజన్‌ సిలిండర్‌ పేలిపోయింది.. రోగిని బెడ్‌పైనే వదిలేసి వైద్యులు, సిబ్బంది ప్రాణభయంతో పరుగులు తీశారు.. మంటల ధాటికి వెలువడిన పొగతో ఆస్పత్రి నిండిపోయింది.. ఊపిరి కూడా ఆడని పరిస్థితి.. ఏం జరుగుతోందో తెలియని భయాందోళన.. రోగులు, వారి బంధువులు, సిబ్బంది బయటికి పరుగులు తీశారు.. కదలలేని రోగులను వీల్‌చైర్లపై, స్ట్రెచర్లపై తరలించారు.. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రంలోని రోహిణి ఆస్పత్రిలో సోమవారం సాయంత్రం జరిగిన ప్రమాద దృశ్యమిది. ఈ ఘటనలో ఆపరేషన్‌ బెడ్‌పై ఉన్న రోగి అక్కడే మృతిచెందగా.. మరొకరు ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. 

ఆపరేషన్‌ చేస్తుండగా షార్ట్‌ సర్క్యూట్‌ 
వరంగల్‌ నగరంలోని సుబేదారి ప్రాంతంలో ఉన్న రోహిణి ఆస్పత్రిలో 250 పడకల సామర్థ్యం ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో 193 మంది రోగులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో రెండు వందల మంది వరకు సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఆస్పత్రి రెండో అంతస్తులో ఆపరేషన్‌ థియేటర్లు, ఐసీయూ వార్డు ఉన్నాయి. సాయంత్రం 5:10 గంటల సమయంలో ఆర్థో, న్యూరో విభాగాల ఆపరేషన్‌ థియేటర్లలో ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఇందులో ఆర్థో విభాగం ఆపరేషన్‌ థియేటర్‌లో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు చెందిన జెట్టి కుమారస్వామి కాలుకు ఆపరేషన్‌ జరుగుతుండగా.. షార్ట్‌సర్క్యూట్‌ జరిగి, మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న ఆక్సిజన్‌ సిలిండర్‌కు మంటలు అంటుకుని పేలిపోయింది. దాంతో కుమారస్వామిని లోపలే వదిలేసి బయటికి పరుగులు తీశారు.

పక్కనే ఉన్న న్యూరో ఆపరేషన్‌ థియేటర్‌లో రోగికి వైద్యమందిస్తున్న డాక్టర్‌ సంజయ్‌.. ఆ రోగిని భుజంపై వేసుకుని బయటకు తీసుకువచ్చారు. ఆపరేషన్‌న్‌థియేటర్ల తలుపులు ఓపెన్‌ చేయడంతో.. ఐసీయూ వార్డు నిండా దట్టంగా నల్లని పొగలు కమ్ముకున్నాయి. దీంతో అంతా భయాందోళనకు గురయ్యారు. రోగుల బంధువులు, ఆస్పత్రి సిబ్బంది హుటాహుటిన మెట్లు, ర్యాంపు మార్గంలో రోగులను ఆస్పత్రి బయటికి తరలించారు. 

మూడు అంతస్తులను కమ్మేసిన పొగలు 
రోహిణి ఆస్పత్రి కింది అంతస్తు (గ్రౌండ్‌ ఫ్లోర్‌)లో మెడికల్‌ షాపు, ల్యాబ్‌లు, ఓపీ విభాగాలు ఉండగా... ఒకటి, రెండు, మూడో అంతస్తుల్లో రోగుల వార్డులు ఉన్నాయి. ఇందులో రెండో అంతస్తులో చెలరేగిన మంటలతో... క్రమంగా ఒకటి, మూడో అంతస్తులు పొగతో నిండిపోయాయి. మరోవైపు ప్రమాదం జరిగిన వెంటనే ఆస్పత్రిలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఏం జరుగుతోందో అర్థంగాక రోగులు, వారి బంధువులు భయాందోళనకు గురయ్యారు. దట్టంగా పొగలు కమ్మేయడంతో ఎక్కడిక్కడ ఆస్పత్రి అద్దాలు పగలగొట్టారు. రోగులను వీల్‌ చైర్లు, స్ట్రెచర్లు, చేతులపై.. కొందరిని బెడ్లతో సహా ఆస్పత్రి ఆవరణలోని పార్కింగ్‌ స్థలానికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎన్‌సీసీ వలంటీర్లు, సామాన్యులు రోగులకు సాయం అందించారు. అత్యవసర వైద్యసేవలు అవసరమైన రోగులను ఎంజీఎం, ఇతర ఆస్పత్రులకు తరలించారు. అంబులెన్సులు అందుబాటులో లేకపోవడంతో అక్కడే ఉన్న పోలీసు రక్షక్‌ వాహనాలను వినియోగించారు. మొత్తంగా రాత్రి 8 గంటల వరకు భయానక పరిస్థితి నెలకొంది. 

అంతా భయం.. భయం.. 
అగ్ని ప్రమాదం జరిగిన పదిహేను నిమిషాల వ్యవధిలోనే అగ్నిమాపక సిబ్బంది ఆస్పత్రి వద్దకు చేరుకుని.. మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఆస్పత్రి లోపల పొగలు దట్టంగా కమ్ముకోవడంతో ఉత్కంఠ నెలకొంది. మంటలు చెలరేగిన తర్వాత ఎవరికి వారుగా బయటకు పరుగులు తీయడంతో.. లోపల ఎంత మంది ఉన్నారు, ఎక్కడున్నారనేది తెలియకుండా పోయింది. పొగలు ఎక్కువగా ఉండడంతో అగ్నిమాపక సిబ్బంది ఎవరినీ లోపలికి వెళ్లనివ్వలేదు. ఓ వైపు సహాయ చర్యలు కొనసాగుతుండగా.. కొందరు నర్సులు ఊపిరాడక ఇబ్బంది పడుతూ ఆస్పత్రిలోంచి బయటకు వచ్చారు. దీంతో ఐసీయూ విభాగంలో రోగులు, ఆస్పత్రి సిబ్బంది చిక్కుకుపోయారని, పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగిందనే సందేహాలు వ్యక్తమయ్యాయి. తమ వాళ్లు మంటల్లో చిక్కుక్కున్నారంటూ రోగుల బంధువులు ఆర్తనాదాలతో ఆస్పత్రి ప్రాంగణం దద్దరిల్లింది. 

ఆపరేషన్‌ బెడ్‌పైనే.. 
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన జెట్టి కుమారస్వామి ఆపరేషన్‌ థియేటర్‌లో బెడ్‌పైనే మృతి చెందాడు. ఆపరేషన్‌ థియేటర్‌లో ఆయన కాలుకు ఆపరేషన్‌ జరుగుతుండగా మంటలు రేగాయి. ఒక్కసారిగా పొగలు కమ్ముకోవడంతో వైద్యులు, సిబ్బంది అంతా బయటికి పరుగులు తీశారు. దాంతో కుమారస్వామి ఆపరేషన్‌ థియేటర్‌లోనే ఉండిపోయాడు. దాదాపు గంట తర్వాత అగ్నిమాపక సిబ్బంది ఆ ఆపరేషన్‌ థియేటర్‌లోకి వెళ్లగలిగారు. అప్పటికే కుమారస్వామి మరణించినట్లుగా తెలుస్తోంది. 

వైరల్‌ జ్వరంతో వచ్చి.. 
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దేవరాంపల్లికి చెందిన పట్నం మల్లమ్మ వైరల్‌ జ్వరంతో రోహిణి ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతున్న ఆమెను అగ్ని ప్రమాదం జరగడంతో ఆస్పత్రి నుంచి బయటికి తీసుకువచ్చారు. రెండు, మూడు గంటలకుపైగా వైద్యం అందకపోవడంతో ఆమె పరిస్థితి విషమించింది. దాంతో ఆమెను ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా.. అక్కడ కొద్దిసేపటికి కన్నుమూసింది. 

ఒకరి పరిస్థితి విషమం 
రోహిణి ఆస్పత్రిలో ప్రమాద సమయంలో అందులో చికిత్స పొందుతున్న కె.సమ్మయ్యకు తగిన వైద్య సహాయం అందలేదు. ఆయనను ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కానీ ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సమ్మయ్య కూడా భూపాలపల్లి జిల్లాలోని తాడిచెర్లకు చెందినవారే. 

వైద్యం అందక అవస్థలు 
ప్రమాదం జరిగిన వెంటనే రోగులను ఆస్పత్రి ఆవరణలోని పార్కింగ్‌ స్థలానికి తరలించారు. కొన్ని బెడ్లను బయటికి తీసుకువచ్చి.. రోగులను వాటిపై ఉంచారు. రోగుల బంధువులు సెలైన్‌ బాటిళ్లతో వారి పక్కన ఉన్నారు. అయితే ప్రమాదంతో భయాందోళనకు గురైన రోగులు, వారి బంధువులు.. ఆస్పత్రి యాజమాన్యంపై, వైద్యులు, సిబ్బందిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో భయపడిన వైద్యులు చికిత్స అందించేందుకు ముందుకు రాకపోవడంతో.. వైద్యసేవలు అందక రోగులు ఇబ్బందులు పడ్డారు. ఇతర ఆస్పత్రులకు వెళదామనుకున్నా చేతిలో డబ్బులు లేక అవస్థలు పడ్డారు. దీంతో కొందరు వరంగల్‌ ప్రైవేటు ఆస్పత్రుల అసోసియేషన్‌తో సంప్రదింపులు జరిపి.. రోహిణి ఆస్పత్రి నుంచి వచ్చే రోగులను వెంటనే చేర్చుకోవాలని కోరారు. దీనిపై ప్రైవేట్‌ ఆస్పత్రుల నెట్‌వర్క్‌ సానుకూలంగా స్పందించడంతో.. ఆస్పత్రులు రోగులను చేర్చుకున్నాయి. 

విచారణ జరిపిస్తాం: కడియం 
అగ్ని ప్రమాదం జరిగిన రోహిణి ఆస్పత్రిని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ జి.సుధీర్‌బాబు, కలెక్టర్‌ ఆమ్రపాలి పరిశీలించారు. ఘటన జరిగిన తీరుపై విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కడియం శ్రీహరి తెలిపారు. డీసీపీ వేణుగోపాల్, ఏసీపీ మురళీధర్, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్, ఫైర్‌ ఆఫీసర్‌ కేశవులుతో విచారణ కమిటీని నియమిస్తున్నట్లు సీపీ సుధీర్‌బాబు ప్రకటించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top