కన్నతండ్రి కర్కశత్వం

Father Attacked On His Three Kids and two died - Sakshi

ముగ్గురు పిల్లలపై కత్తితో దాడి 

ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి 

తప్పించుకున్న పెద్ద కూతురు 

భార్య మీద అనుమానమే ఘాతుకానికి కారణం! 

రామచంద్రాపురం (పటాన్‌చెరు): ముద్దు మురిపాలు పంచాల్సిన కన్నతండ్రి తమ పాలిట యముడు అవుతాడని తెలియదు ఆ చిన్నారులకు. నాన్నే తమను చంపుతాడని ఆ పసివాళ్లు ఊహించలేదు. భార్యపై అనుమానం పెనుభూతమై.. రాక్షసుడిగా మారిన ఓ వ్యక్తి తన ముగ్గురు పిల్లలపై కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో ముగ్గురిలో ఒకరిని మెడపై నరికి చంపగా..మరొకర్ని గొంతు నులిమి చంపేశాడు. మరో బాలిక తప్పించుకుంది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలో బుధవారం తెల్లవారుజామున ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం రామచంద్రాపురం పట్టణం ఇక్రిశాట్‌ ఫెన్సింగ్‌ కాలనీలో నివాసముండే కుమార్‌ కూలి చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సుమారు 12 ఏళ్ల క్రితం పటాన్‌చెరు మండలానికి చెందిన శిరీషతో అతనికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. వీరికి మల్లేశ్వరి (10), అఖిల్‌ (6), శరణ్య (4) అనే పిల్లలు ఉన్నారు. కాగా పెళ్లైన నాలుగేళ్ల నుంచి కుమార్‌ తన భార్య శిరీషపై అనుమానం పెంచుకుని మానసికంగా హింసించసాగాడు.

నిత్యం మద్యం సేవించి ఇంటికి వచ్చి శిరీషను చితకబాదే వాడు. పిల్లలు తన పిల్లలు కాదని అంటూ శిరీషను హింసించేవాడు. ఈ క్రమంలో నెల రోజుల క్రితం కుమార్‌ ఎప్పటిలాగే మద్యం తాగి వచ్చి శిరీషను చితకబాదగా ఆమె పిల్లలను తీసుకొని తన తల్లి ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో చిన్నారులను కుమార్‌ బలవంతంగా తనతోపాటు తీసుకుని వచ్చాడు. రెండు రోజుల క్రితం కుమార్, శిరీష తల్లికి ఫోన్‌ చేసి గొడవ పడ్డాడు. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున నిద్రమత్తులో ఉన్న అఖిల్‌ (6)ను మొదట కత్తితో మెడ కోసి దారుణంగా హత్య చేశాడు.

చిన్న కుమార్తె శరణ్య (4)ను మొదట కత్తితో నరికేందుకు ప్రయత్నించి.. చివరకు గొంతు నులిమి చంపేశాడు. పెద్ద కుమార్తె మల్లేశ్వరిని కత్తితో గొంతు కోసేందుకు ప్రయత్నించగా..అప్పటికే మేల్కొన్న బాలిక విషయం అర్థమై గది నుంచి పరుగులు తీసి పక్కనే ఉన్న తన నానమ్మ ఇంటికి వెళ్లి విషయం చెప్పేసింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చిన్నారుల తల్లి శిరీష ఫిర్యాదు మేరకు రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అభం శుభం తెలియని చిన్నారులను కన్నతండ్రే దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా ప్రజలను కలచివేసింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top