అంగన్‌వాడీలపై అదనపు భారం!

Extra burden on Anganwadi Teachers - Sakshi

     బీఎల్‌వో బాధ్యతలతో సతమతం

     కనీస వేతనం అందని పరిస్థితి

సాక్షి, హైదరాబాద్‌: అంగన్‌వాడీ టీచర్లు అదనపు పనిభారంతో సతమతమవుతున్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్‌ కమిషన్‌ వారిపై అదనపు భారం మోపింది. ఓటర్ల నమోదును వేగవంతం చేయడానికి బూత్‌ లెవల్‌ ఆఫీసర్‌(బీఎల్‌వో) బాధ్యతలు అప్పగించింది. వీటికితోడు గతేడాది నిర్వహించిన ట్యాబ్‌ వర్క్‌లో తప్పిదాలు, డోర్‌ టూ సర్వేలు అంగన్‌వాడీ లకు తలకు మించిన భారమవుతున్నాయి. మం డల కేంద్రాలకు దూరంగా పోలింగ్‌బూత్‌లు ఉం డడంతో వారి రవాణా ఖర్చులు పెరిగిపోతున్నాయి. శాఖాపరమైన విధులు పక్కన పెట్టి, బీఎల్‌ వో పనులు చేయాలని జిల్లా ఉన్నతాధి కారులు ఒత్తిడి చేస్తున్నారు.  ఈసీ మాన్యువల్‌ అప్లికేషన్స్‌ డిజిటలైజ్‌ కాకపోవడం, సర్వర్‌ బిజీగా ఉండడంతో వారు ఒత్తిడికి గురవుతున్నారు. 

రాత్రి పది గంటల వరకూ విధులు ...
గత నెల 25 లోపు ఓటర్ల నమోదును వేగవంతం చేయాలన్న కలెక్టర్లు, జిల్లా అధికారుల ఒత్తిడితో బీఎల్‌వోలు రాత్రి 10 వరకూ కొన్ని జిల్లాల్లో పని చేశారు. దీంతో వారు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. కొన్ని చోట్ల టాయిలెట్లు, నీటి సౌకర్యం లేక బీఎల్వోలు ఇబ్బంది పడ్డారు. కనీస వేతనం అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై ఈసీ నాగిరెడ్డిని పలు ఉద్యోగ సంఘాలు వినతిపత్రాలు సమర్పించినా పట్టించుకోలేదు. 

సాంకేతిక లోపాలు:గతేడాది చేపట్టిన ట్యాబ్‌ వర్క్‌లో తప్పులు దొర్లడంతో మళ్లీ మొదటి నుంచి పనులు చేయాల్సి వచ్చింది. ఇది బీఎల్వోలు, రెవెన్యూ సిబ్బందికి భారంగా మారింది. విధులు సరిగా నిర్వర్తించడం లేదని నల్లగొండ జిల్లాలో ఆరుగురు బీఎల్‌వో సిబ్బందిని కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. ఓటర్ల జాబితా సిద్ధమయ్యాక అందులో తమ పేరు లేదని పలువురు బీఎల్‌వోలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బీఎల్‌వో విధులు: వెయ్యి మంది ఓటర్లతో ఒక పోలింగ్‌ బూత్‌ ఉండగా, దానికి ఒక బీఎల్‌వో ఉంటారు. డోర్‌ టూ సర్వేతో 18 ఏళ్లు నిండిన వారి వివరాలు సేకరించి ఓటరుగా నమోదు చేయాలి. పెళ్లయి వేరే చోటికి వెళ్లినా, వలస వెళ్లి నా, మరణించిన వారిని గుర్తించి ఓట్లు తొలగించాలి. 

మా సమస్యల్ని పరిష్కరించాలి 
గతేడాది బతుకమ్మ కూడా ఆడకుండా ట్యాబ్‌ వర్క్‌ చేశాం. ఆ డబ్బులు ఇప్పటి వరకు రాలేదు. రాత్రి వరకు పనిచేస్తున్నాం. బీఎల్‌వోగా పనిచేసే మహిళ లకు పనిచేసే చోట కనీస సదుపాయాలు లేవు. మా పరిస్థితులను అధికారులు అర్థం చేసుకుని సమస్యలు పరిష్కరించాలి. 
– సుజాత, అంగన్‌వాడీ టీచర్‌ (బీఎల్‌వో), వరంగల్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top