రోజూ 32 కిలో మీటర్లు సైకిల్‌పైనే..

Every Day 32km Riding Bycycle A Old Man In Khammam District - Sakshi

ఎటు వెళ్లాలన్నా సైకిల్‌పైనే..  

70 ఏళ్లుగా దానిపైనే సవారీ  

90 ఏళ్లు వచ్చినా తగ్గని సత్తువ  

ఇప్పుడు 18 ఏళ్లు నిండని వారు కూడా కాలు కదిపితే మోటార్‌ సైకిల్‌ కావాల్సిందే. విద్యార్థులు తమ కళాశాలలకు వెళ్లాలన్నా.. చిరు వ్యాపారస్తులు వీధి వీధి తిరిగి తమ వస్తువులు విక్రయించాలన్నా.. ఇంటి అవసరాలకు సామగ్రి తీసుకురావాలన్నా.. అందరూ మోటార్‌ సైకిళ్లనే వాడుతున్నారు. ప్రస్తుతం మోటార్‌ సైకిళ్ల హవానే నడుస్తోంది. అయితే ఓ తొంభై సంవత్సరాల వృద్ధుడు.. తను ఎటు వెళ్లాలన్నా.. ఏ పని చేసుకుని రావాలన్నా.. సైకిల్‌నే వినియోగిస్తున్నాడంటే ఆశ్చర్యం కలగక మానదు. అతడు 70 ఏళ్లుగా సైకిల్‌పైనే సవారీ చేస్తున్నాడంటే ఎవరైనా ముక్కున వేలేసుకోవడం ఖాయం. అతడే ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గైగొల్లపల్లి  గ్రామానికి చెందిన పాపాయ్య.  

సాక్షి, కూసుమంచి(ఖమ్మం) : ఈ రోజుల్లో పక్క ఊరు వెళ్లాలంటే ఆటోలు, కార్లు, బస్సులు, మోటారు సైకిళ్లు ఉన్నాయి. వాటితో సుఖమైన ప్రయాణం. కానీ, పాపయ్య మాత్రం సైకిల్‌పైనే కిలో మీటర్ల దూరం ప్రయాణం చేస్తుంటాడు. అతని వయస్సు తక్కువేమి కాదు 90 సంవత్సరాలు పైనే. సైకిల్‌తోనే ఎంతో అనుబంధం పెనవేసుకుందని, దానిపైనే ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణం చేశానని చెబుతున్నాడు. మండలంలోని గైగొల్లపల్లి గ్రామానికి చెందిన సీపీఎం సీనియర్‌ నాయకుడు, పార్టీ మాజీ మండల కార్యదర్శి కొరట్ల పాపయ్య మధ్య తరగతి వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తి. తన యుక్త వయస్సు అంటే 20 సంవత్సరాల వయస్సులో సైకిల్‌ కొనుక్కున్నాడు. నాటి నుంచి నేటి వరకు ఈ సైకిలే అతని ప్రయాణ సాధనం. తాను ఏ ఊరు వెళ్లాలన్నా సైకిల్‌పైనే వెళ్తుంటాడు. తనకు సైకిలే నేస్తం. ఇప్పటికీ తన ఊరు నుంచి మండల కేంద్రమైన కూసుమంచికి (సుమారు 16 కిలోమీటర్లు) రోజూ సైకిల్‌పైనే వçస్తుంటాడు. సైకిల్‌ తొక్కడంలో అతడికి అలుపు, సొలుపు ఉండదూ. 

వయస్సు మీరినా హుషారుగా సైకిల్‌ తొక్కడం పాపయ్య ప్రత్యేకత. అంతే కాకుండా మండలంలో ఏ ఊరు వెళ్లాలన్నా తన సైకిల్‌పైనే అతని ప్రయాణం. రోజూ 32 కిలోమీటర్లు కచ్చితంగా సైకిల్‌ తొక్కుతాడు. అంటే కూసుమంచి వచ్చిపోతూ ఉంటాడు. సరదాగా వచ్చి టీ తాగి వెళ్తుంటాడు. ఈ వయస్సులో కూడా పాపాయ్య తన సైకిల్‌ ను ఎంతో ఇష్టంగా చూసుకుంటాడు. సైకిల్‌ను నాటి నుంచి ఇప్పటి వరకు మార్చనూ లేదు. సైకిల్‌తో పాపయ్య సవారీని పలువురు ఆసక్తిగా చూస్తుంటారు.  

ఇది నా బంధం.. 
నా అనుబంధం ఇంతే అంటూ తన అనుభవాలను పాపయ్య ‘సాక్షి’తో పంచుకున్నాడు. చిన్న తనంలో తన సైకిల్‌కు పంక్చర్‌ అయితే కూసుమంచిలో పంక్చర్‌ వేసేవాళ్లు లేక సైకిల్‌ను లారీలో వేసుకుని తల్లంపాడు, అవసరమైతే ఖమ్మం వెళ్లి వేయించుకునేవాడినని చెప్పారు. చివరకు ఆ బాధలు పడలేక తానే పంక్చర్‌ వేయడం నేర్చుకున్నానని పాపయ్య తెలిపారు. తనకు సైకిల్‌ తొక్కడం వలన ఇంత వరకు ఏ నొప్పులు, రోగాలు లేవని, దేవుడి దయ వల్ల ఆరోగ్యంగానే ఉన్నానని, అదిచాలని అంటున్నాడు. ఇక పోతే పాపయ్య పార్టీకి వీరాభిమాని. కమ్యూనిస్టు సిద్ధాంతాలు పాటిస్తాడు. చివరకు ఇతను వాడే పెన్ను ఎరుపు రంగులోనే ఉండటం విశేషం. పార్టీలో సేవ చేసినా పార్టీ కోసం అంకితభావంతో చేస్తున్నాను తప్ప స్వలాభం కోసం కాదని పాపయ్య అంటున్నాడు. దుమ్ముగూడెం నుంచి పాలేరు వరకు గతంలో సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రలో కూడా పాపయ్య అలుపు లేకుండా సాగారు. 

సైకిల్‌ తొక్కటం ఇష్టం 
నాకు 90 ఏళ్లు వచ్చినా సైకిల్‌ తొక్కడం కష్టంగా లేదు. రోజూ కూసుమంచి సైకిల్‌పైనే వస్తా. నాకు కాళ్ల నొప్పులు కూడా లేవు. నాకు సైకిల్‌ ఉంటే చాలు ఎక్కడికైనా సరదాగా పోయివస్తుంటా. నేను సైకిల్‌ తొక్కుతుంటే కొందరు తాతా ఈ వయసులోనూ భలేగా తొక్కుతున్నావు సైకిల్‌ అంటుంటారు. అలా అంటే ఇంకా సైకిల్‌ తొక్కాలనే ఉత్సాహం వస్తుంది. నాలో సత్తువ ఉన్నన్ని రోజులు సైకిల్‌ తొక్కుతూనే ఉంటాను. 
కొరట్ల పాపయ్య, గైగొల్లపల్లి  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top