ప్రజలు సమాచారమిస్తే నియంత్రణ సులువవుతుంది.. 

Etela Rajender Responding To The Debate In The Council Over Coronavirus - Sakshi

కౌన్సిల్‌లో చర్చకు సమాధానమిచ్చిన వైద్యశాఖ మంత్రి ఈటల 

సాక్షి,హైదరాబాద్‌: కోవిడ్‌ వైరస్‌ లక్షణాల అనుమానాలతో పాటు, సంబంధిత లక్షణాలతో ఉన్న వారికి సంబంధించి ప్రజలు ఎప్పటికప్పుడు సమాచారమిస్తే దాని నియంత్రణ సులువవుతుందని వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. రాష్ట్రంలో ఇంతవరకు ఎవరికీ కోవిడ్‌ వైరస్‌ సోకలేదని, అందువల్ల ప్రజలు భయాందోళనలకు గురికావొద్దని పుకార్లను నమ్మొద్దని కోరారు. ఒకవేళ వైరస్‌ ఎవరికైనా సోకినా ఎదుర్కునేందుకు ప్రభుత్వం సర్వసిద్ధంగా ఉందన్నారు. ప్రజలు కూడా తమకు తాముగా ఆరోగ్యశాఖ చేసిన సూచనలను తుచ తప్పకుండా పాటించాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చే వారు ప్రభుత్వానికి, వైద్యశాఖకు సహకరించాలన్నారు.

తమ వంతుగా కౌన్సిల్‌సభ్యులు ప్రజల్లో అవగాహన, చైతన్యం కలిగించే దిశలో చర్యలు తీసుకోవాలని చెప్పారు. శనివారం శాసనమండలిలో కోవిడ్‌ వైరస్‌పై జరిగిన స్వల్పకాలిక చర్చకు ఈటల సమాధానమిస్తూ విదేశాల నుంచి వచ్చేవారు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తిచేశారు.ఇటలీ నుంచి వచ్చిన ఇక్కడి యువతికి పాజిటివ్‌ రావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించినట్టు, మరో ఇద్దరికి సోకినట్టు అనుమానాలున్నా పుణే నుంచి నివేదిక వచ్చాకే స్పష్టతవస్తుందని చెప్పారు. ఆశావర్కర్లు మొదలుకొని డాక్టర్ల వరకు అందరూ సంసిద్ధమై ఉన్నారని, వ్యాధి లక్షణాలు, వ్యాప్తికి అవకాశాలపై నిఘాను కొనసాగిస్తున్నట్టు తెలిపారు. ఈ అంశంపై చర్చను ప్రారంభించిన ఎంఐఎం సభ్యుడు సయ్యద్‌ అమీనుల్‌ జాఫ్రీ మాట్లాడుతూ ప్రజలను చైతన్యపరిచే చర్యలు చేపట్టాలని కోరారు.

పబ్బులు, బార్లు బంద్‌చేయాలి: రామచంద్రరావు సూచన 
ఈ వైరస్‌ను తేలికగా తీసుకోవద్దని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్‌.రామచంద్రరావు హితవుపలికారు.పబ్బులు, బార్‌లు వెంటనే మూసేయాలని సూచించారు. భారత ఫార్మారంగానికి వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి ఉందని తెర చిన్నపరెడ్డి అన్నారు. ప్రజలను చైతన్యపరిచేలా 30 రోజుల కార్యక్రమం చేపట్టాలని ఉల్లోళ్ల గంగాధరగౌడ్‌ సూచించారు. ఈ చర్చలో అలుగుబెల్లి నర్సిరెడ్డి, రఘోత్తమ్‌రెడ్డి, నవీన్‌రావు ఎగ్గె మల్లేశం, ఆకుల లలిత, ఫారుఖ్‌హుస్సేన్, ఎమ్మెస్‌ ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top