ఉత్తమ గ్రామాలను దత్తత తీసుకుంటా

Errabelli Dayakar Rao Said That Best Villages Will Be Aadopt - Sakshi

పల్లెలు ప్రగతిపథంలో పయనించాలి

గ్రామపంచాయతీలకు రూ.48 కోట్లు విడుదల

రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

సాక్షి, వరంగల్‌: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశయాలను నెరవేర్చాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. ‘దేశానికి పట్టుకొమ్మల్లాంటి గ్రామాల్లో అన్ని వసతులు కల్పిస్తాం.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రణాళిక అమలు కోసం అందరూ టీమ్‌ వర్క్‌గా పనిచేయాల్సిన అవసరం ఉంది.. ఈ ప్రణాళికలను నూరు శాతం అమలు చేసిన ఉత్తమ గ్రామపంచాయతీలను దత్తత తీసుకుంటా’ అని మంత్రి పేర్కొన్నారు. ప్రతీ గ్రామాన్ని గంగదేవిపల్లికి ధీటుగా తీర్చిదిద్దాలని.. అభివృద్ధిలో అన్ని గ్రామాల వారు పోటీ పడాలని సూచించారు. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుపై వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్‌ జిల్లాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, గ్రామ ప్రత్యేక అధికారులు, మండల స్పెషల్‌ ఆఫీసర్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలకు వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జె.పాటిల్‌ అధ్యక్షతన హన్మకొండలోని ఓ ఫంక ్షన్‌ హాల్‌లో గురువారం అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఈ సదస్సులో  ముఖ్యఅతిథి గా మంత్రి దయాకర్‌రావు మాట్లాడారు.

సర్పంచ్‌లకు అరుదైన అవకాశం
పల్లెలో గుణాత్మక మార్చు తీసుకువచ్చే బృహత్తరమైన, అరుదైన అవకాశం ప్రస్తుత సర్పంచ్‌లకు దక్కిందని మంత్రి దయాకర్‌రావు అన్నారు. విస్తృత స్థాయిలో ప్రజాప్రతిని«ధులు, ప్రజలందరినీ భాగస్వాములు చేసి ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగితే గ్రామాల అభివృద్ధి సులభతరం అవుతుందని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అందరి సహకారం తీసుకోవాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి, నీరందించిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు. పంచాయతీరాజ్‌ వ్యవస్థను బలోపేతం చేసేందుకు నూతన చట్టాలు చేశామని చెప్పిన మంత్రి.. అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధుల కొరత లేదని వెల్లడించారు.

సర్పంచ్‌లకు అనేక అధికారాలు కల్పించామని, వీటిని సద్వినియోగం చేసుకుంటూ పల్లెలను మెరిసేలా చేయాలని అన్నారు. హరితహారం ద్వారా పంచాయతీల వారీగా ఎన్ని మొక్కలు నాటాలో గ్రామసభ ద్వారా తీర్మానం చేసి ఆ లక్ష్యాల సాధనకు కృషి చేయాలన్నారు. గ్రామాల్లో ప్రముఖుల నుంచి విరాళాలు సేకరించి పనులు చేపట్టాలని.. అలాంటి వారి ఫొటోలను గ్రామపంచాయతీలలో పెట్టాలని సూచించారు. గ్రామాల్లో చెత్తాచెదారం తొలగింపునకు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకునే వెసలుబాటు కల్పించామని తెలిపారు. ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్లను సర్పంచ్‌ల ఆజమాయిషీలోకి పరిధిలోకి తీసుకురానుండగా.. ప్రాథమిక పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలను సర్పంచ్‌లకు అప్పగించినట్లు మంత్రి వివరించారు.

ముందుచూపుతో వ్యవహరిస్తున్న కేసీఆర్‌ 
రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో అలోచనలు చేసి మేధావులను సంప్రదించి పంచాయతీరాజ్‌ చట్టాన్ని పునర్‌ వ్యవస్థీకరించారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రత్యేకత ఉన్నదని అన్నారు. నమ్మకం, విశ్వాసంతో ముందుకు సాగితే అభివృద్ధిలో అందరూ గంగదేవిపల్లిని మించిపోవచ్చని తెలిపారు. వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌ మాట్లాడుతూ తరతరాలు చెప్పుకునేలా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని అన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే గంగదేవిపల్లి రాష్ట్రానికి అదర్శంగా నిలిచిందని అన్నారు. 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుకు ఏదైనా ఒక పేరు పేరు పెడితే బాగుంటుందని సూచించారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ప్రజలు భాగస్వామ్యం తప్పనిసరి అని చెప్పారు. ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ జెడ్పీటీసీ, ఎంపీటీసీలు సర్పంచ్‌లకు ధీటుగా పనిచేయాలని కోరారు. తెలంగాణ ఏర్పడ్డాక అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతోందని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు.

పచ్చదనం.. పరిశుభ్రత
సదస్సుకు వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జె.పాటిల్‌ అధ్యక్షత వహించి స్వాగతోపన్యాసం చేశారు. గ్రీన్‌ యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించుకుని ప్రతీ గ్రామపంచాయతీ పరిధిలో ఐదు 5 వేల మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. పచ్చదనం, డంపింగ్‌ యార్డులు, పరిశుభ్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పంచాయతీ అర్థిక పరమైన నిధులు సేకరణ, పవర్‌ వీక్‌ సంబంధిత చేపట్టాల్సిన పనుల తీరుతెన్నులను వివరించారు. సర్పంచ్‌లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, నోడల్‌ అధికారులు, ఎంపీడీఓలు సమన్వయంతో వ్యవహరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. జెడ్పీ చైర్‌ పర్సన్లు డాక్టర్‌ ఎం.సుధీర్‌కుమార్, గండ్ర జ్యోతి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌ రెడ్డి, ఆగ్రోస్‌ చైర్మన్‌ కిషన్‌ రావు, వరంగల్‌ రూరల్‌ కలెక్టర్‌ హరిత తదితరులు పాల్గొన్నారు.

నేడు మూడు గ్రామాల్లో ప్రారంభం
గ్రామాల సమగ్ర వికాసమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూపొందించిన ’30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక’ శుక్రవారం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి, అర్‌డబ్ల్యూఎస్‌ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు శుక్రవారం మూడు గ్రామాల్లో ప్రారంభిస్తారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా గట్ల నర్సింగాపూర్‌లో శుక్రవారం ఉదయం 8 గంటలకు, వరంగల్‌ రూరల్‌ జిల్లా సంగెం మండలం కాపులకనపర్తిలో ఉదయం 10 గంటలకు, వరంగల్‌ రూర ల్‌ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేటలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించి గ్రామసభల్లో మంత్రి పాల్గొననున్నారు.

గట్ల నర్సింగాపూర్‌లో ఏర్పాట్ల పరిశీలన
భీమదేవరపల్లి: గ్రామాల సమగ్ర వికాసం లక్ష్యంగా అమలుచేయనున్న 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమాన్ని మండలంలోని గట్లనర్సింగపూర్‌లో రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పంచాయతీరాజ్‌ కమీషనర్‌ రఘునందన్‌రావు ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను ఎంపీడీఓ భాస్కర్, ఎంపీపీ జక్కుల అనిత, జెడ్పీటీసీ వంగ రవి, మిషన్‌ భగీరథ డీఈఈ బాలరాజు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ రాజమల్లారెడ్డి, సర్పంచ్‌ చంద్రకళ గురువారం సాయంత్రం పరిశీలించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top