వాంటెడ్‌ ఇంజినీర్‌

Engineer Shortage in Double Bedroom Housing Scheme - Sakshi

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాలకు పర్యవేక్షకుల కొరత

20 మంది ఉండాల్సిన చోట..ఇద్దరు ముగ్గురితోనే పనులు

మరోవైపు నిధుల కొరత.. పలు చోట్ల నత్తనడకన పనులు

అడపాదడపా ప్రమాదాలు.. గాల్లో కలుస్తున్న ప్రాణాలు

సాక్షి, సిటీబ్యూరో : జీహెచ్‌ఎంసీకి ఇంజినీర్ల కొరత వేధిస్తోంది. వివిధ విభాగాలతోపాటు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకూ ఈ కొరత తీవ్రం కావడంతో పనులు మందగించాయి. మరోవైపు తగినంత మంది పర్యవేక్షకులు లేకపోవడంతో నిర్మాణ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలు తదితరమైన వాటి గురించి పట్టించుకుంటున్నవారు లేరు. ఇటీవల రాంపల్లి వద్ద పైఅంతస్తుల్లో పనులు చేస్తుండగా ప్లాట్‌ఫామ్‌ కూలడంతో కార్మికులు మృతి చెందడం తెలిసిందే. ఇంకో వైపు నిధుల కొరత వెంటాడుతోంది. దీంతో గ్రేటర్‌లో ‘డబుల్‌’ ఇళ్లు ట్రబుల్స్‌లో పడ్డాయి. ఉదాహరణకు రాంపల్లి దగ్గరి పరిస్థితినే పరిశీలిస్తే.. దాదాపు ఆరువేల ఇళ్ల నిర్మాణం జరుగుతున్న అక్కడ నిబంధనల మేరకు పనులను పర్యవేక్షించేందుకు ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్, ఇద్దరు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లతోపాటు ఆరుగురు అసిస్టెంట్‌ ఇంజినీర్లు, 12 మంది వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు ఉండాలి. కానీ.. అక్కడ ఉన్నది కేవలం ఒక అసిస్టెంట్‌ ఇంజినీర్‌ మాత్రమే. మరో ఇద్దరు వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు ఔట్‌సోర్సింగ్‌పై పనిచేస్తున్నారు. పదంతస్తుల్లో  నిర్మాణం జరిగేచోట ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సి ఉండగా, తగినంత మంది ఇంజినీర్లు లేకపోవడంతో ఉన్నవారే అన్ని బ్లాకుల వద్ద పరిస్థితుల్ని పరిశీలించలేకపోతున్నారు.

సంబంధిత ఎగ్జిక్యూటివ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు వివిధ ప్రాంతాల్లో పనులు పర్యవేక్షించాల్సి ఉండటంతో పనుల ప్రాంతాల్లో భద్రత ఏర్పాట్లే కాక, నాణ్యతలోనూ తగిన తనిఖీలు సాధ్యం కావడం లేవు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పనులు చూస్తున్న ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు ఒక్కొక్కరు దాదాపు 25 సైట్లలో పనులు పర్యవేక్షించాల్సి ఉంది. అలాగే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు 10 సైట్లలో పనులు తనిఖీ చేయాల్సి ఉంది. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పనులు పర్యవేక్షిస్తున్న సూపరింటెండింగ్‌ ఇంజినీర్లు ఇద్దరు త్వరలోనే పదవీ విరమణ చేయనున్నారు.  ఇవి పనుల పర్యవేక్షణ ఇబ్బందులు కాగా, సకాలంలో నిధులందకపోవడంతో పనులు పెండింగ్‌లో పడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు వేగంగా జరిగిన పనులు , ఆ తర్వాత కుంటుపడ్డాయి. ఈ ఇళ్లకు ప్రధానమంత్రి ఆవాస్‌యోజన(పీఎంఏవై) ద్వారా అందాల్సిన దాదాపు రూ. 1500 కోట్ల నిధుల్లో ఇప్పటికే రూ. 600 కోట్లు వచ్చాయి. మిగతావి రావాలంటే పనుల పురోగతేకాక లబ్ధిదారుల వివరాలు తదితరమైనవి పంపించాల్సి ఉంది. ఆ వివరాలను పంపడంలో జాప్యంతో మలిదశ నిధులకూ బ్రేక్‌ పడింది. చేసిన పనులకు ఎప్పటికప్పుడు నిధులందక కాంట్రాక్టర్లు పనులపై శ్రద్ధ చూపడం లేరు. దీంతో పనులు కుంటుతున్నాయి. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలోగా కల్పించాల్సిన   వివిధ సదుపాయాలకు మరో రూ. 450 కోట్లు కావాల్సి ఉంది. 

మొత్తం లక్ష డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లను ఈ సంవత్సరం మార్చినాటికే పూర్తిచేస్తామని ప్రకటించారు. ఎన్నికల వల్ల మూడు నాలుగు నెలలు జాప్యం జరిగిందనుకున్నా ఆగస్టునాటికి పూర్తి కావాలి. కానీ.. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే  ఈ సంవత్సరాంతానికి కూడా పూర్తయ్యేలా లేదు. దాదాపు 40వేల ఇళ్ల మేర పనులు కొనసాగుతున్నాయి.  మొత్తం 109  ప్రాంతాలకుగాను ఆరు ప్రాంతాల్లో మాత్రం ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తయింది. 

అన్ని విభాగాల్లో అదే తీరు..
డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకే కాక జీహెచ్‌ఎంసీలోని పలు విభాగాల్లో ఇదే తీరు. ఇద్దరు  ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు  సూపరింటెండింగ్‌ ఇంజినీర్లుగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒక్కో ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ రెండు మూడు సర్కిళ్లలో అదనపు బాధ్యతలతో పనులు చేస్తున్నారు. ఒక్క సూపరింటెండింగ్‌  ఇంజినీరే మూడు జోన్లతోపాటు మెయింటనెన్స్‌ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారంటే పర్యవేక్షణ స్థాయిలోని ఇంజినీర్ల కొరతను అంచనా వేసుకోవచ్చు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top