ప్రయాణం..పర్యావరణ హితం

Electric Bus Services Soon In Hyderabad - Sakshi

ఎలక్రిక్‌ బస్సులతో నగరంలో కాలుష్యరహిత ప్రయాణం

జెఎన్‌టీయూ, జేబీఎస్‌ల నుంచి ఎయిర్‌పోర్టుకు కూల్‌ జర్నీ

రెండు రూట్లలో త్వరలో 5 బస్సుల ఏర్పాటు

నెలాఖరుకు మరో 35 ఎలక్ట్రిక్‌ బస్సులు

సాక్షి, సిటీబ్యూరో: నగరవాసులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న  కాలుష్య రహిత  ఎలక్ట్రిక్‌ బస్సులను మరో వారంలో రోడ్డెక్కించేందుకు గ్రేటర్‌ ఆర్టీసీ కార్యాచరణ చేపట్టింది. అత్యాధునిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానంతో  రూపొందించిన  5 ఎలక్ట్రిక్‌ బస్సులను చైనాకు చెందిన  ఒలెక్ట్రా బీవైడీ  సంస్థ  బుధవారం ప్రభుత్వానికి అందజేసిన  విషయం తెలిసిందే. ఈ బస్సులను ప్రభుత్వం  త్వరలో ఆర్టీసీకి అప్పగించనుంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రయాణికుల కు ఈ బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు  చర్యలు చేపట్టారు. అత్యధిక ఆదాయం వస్తున్న ఎయిర్‌పోర్టు  రూట్లలో ప్రస్తుత  5 బస్సులతో పాటు, త్వరలో మరో  35 బస్సులను కూడా నడుపనున్నట్లు  ఆర్టీసీ  అధికారులు  తెలిపారు. వారం రోజుల్లో  ఈ బస్సులు రోడ్డెక్కనున్నాయి.  

ఎయిర్‌పోర్టు  రూటే ఏకైక మార్గం...
ప్రస్తుతం నగరంలో  80  మెట్రో లగ్జరీ  ఓల్వో బస్సులు ఉన్నాయి.  హైటెక్‌సిటీ, ఐటీ కారిడార్‌లు, కొండాపూర్, మాదాపూర్, కూకట్‌పల్లి, జేఎన్‌టీయూ, ఈసీఐఎల్, ఉప్పల్, మెహదీపట్నం, తదితర ప్రాంతాలకు సుమారు  50 ఏసీ బస్సులను నడుపుతుండగా మరో  30 బస్సులను  సికింద్రాబాద్, పర్యాటక భవన్, జేఎన్‌టీయూ, జూబ్లీబస్‌స్టేషన్‌ల నుంచి  శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు నడుపుతున్నారు. సిటీలోని  అన్ని రూట్లలో ఏసీ బస్సులపైన  నష్టం వస్తుండగా  ఒక్క ఎయిర్‌పోర్టు  మార్గంలో మాత్రం ఎలాంటి లాభ నష్టాలు లేకుండా నడుస్తున్నాయి. ఆక్యుపెన్సీ  సైతం  55 శాతం నుంచి  60 శాతం వరకు నమోదవుతోంది. మొదటి మూడేళ్ల పాటు గణనీయమైన నష్టాలను చవిచూడటంతో ఈ బస్సులు తెల్ల ఏనుగులను తలపించాయి. అయితే క్రమంగా ఎయిర్‌పోర్టు రూట్లో  మెట్రో లగ్జరీ ఏసీ బస్సులకు ప్రయాణికుల నుంచి ఆదరణ పెరిగింది. సిటీలోని మిగతా రూట్లలో ఈ బస్సులు నష్టాల్లో  నడుస్తున్నా ఎయిర్‌పోర్టు రూట్లో మాత్రం కొద్దిగా ఊరటనిస్తున్నాయి. దీంతో ఈ మార్గంలోనే కొత్త బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు  ఆర్టీసీ  గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎగ్జిక్యూటివ్‌  డైరెక్టర్‌ వినోద్‌కుమార్‌  తెలిపారు. కొత్త ఎలక్ట్రిక్‌ బస్సులను త్వరలోనే మియాపూర్, కంటోన్మెంట్‌ డిపోల నుంచి నడుపనున్నామన్నారు. కాగా ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సులను అద్దె ప్రాతిపదికన నడుపుతోంది. ఇందుకు గాను కిలోమీటర్‌కు రూ.36 చొప్పున ఒలెక్ట్రా సంస్థకు చెల్లించనున్నారు.  

బస్సుల నిర్వహణ ఇలా....
జూబ్లీబస్‌స్టేషన్‌ నుంచి తార్నాక, ఉప్పల్, ఎల్‌బీనగర్, చాంద్రాయణగుట్ట రూట్లో  కొన్ని సర్వీసులను నడుపుతారు.  
బేగంపేట్‌  పర్యాటక భవన్‌ నుంచి మెహదీపట్నం, పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవే, ఆరాంఘర్‌ చౌరస్తా మీదుగా మరికొన్ని సర్వీసులు నడుస్తాయి.
కూకట్‌పల్లి జేఎన్‌టీయూ నుంచి గచ్చిబౌలీ ఔటర్‌ రింగ్‌రోడ్డు మీదుగా మరి కొన్ని సర్వీసులను నడుపుతారు.
ప్రస్తుతం అందుబాటులోకి వచ్చి 5 ఎలక్ట్రిక్‌ బస్సులను మొదట  జేఎన్‌టీయూ, జేబీఎస్‌ రూట్లలో ప్రారంభించి ఆ తరువాత దశలవారీగా విస్తరిస్తారు.  

జీపీఎస్‌తో అనుసంధానం....
పూర్తి ఏసీ సదుపాయంతో 12 మీటర్ల పొడవు ఉన్న ఈ బస్సుల్లో మొత్తం 37 సీట్లు ఉంటాయి.  
బస్సులకు ముందుభాగంలో లగేజీ కోసం కొంత స్పేస్‌ను వదిలారు.
ముందు, వెనుక ఎల్‌ఈడీ బోర్డులను ఏర్పాటు చేశారు.  
ఈ బస్సులు జీపీఎస్‌తో అనుసంధానమై ఉంటాయి.పటిష్టమైన  వెహికల్‌ ట్రాకింగ్‌  వ్యవస్థ మరో ప్రత్యేకత. దీంతో  ఈ బస్సుల నిర్వహణ పారదర్శకంగా ఉంటుంది.  
ఎలాంటి వాయు, శబ్ధ కాలుష్యం ఉండదు.
ప్రస్తుతం మియాపూర్, కంటోన్మెంట్‌ డిపోల్లో  ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో ఆయా డిపోల నుంచే రాకపోకలు సాగిస్తాయి.
ప్రతి  రోజు రాత్రి 11 గంటల నుంచి తెల్లవారు జామున 4 గంటల వరకు చార్జింగ్‌ చేస్తారు. 5 గంటల పాటు చార్జింగ్‌ చేస్తే 300 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి,
ప్రతి రోజు ఉదయం 4.30 నుంచి  రాత్రి 10.30 వరకు నడుపుతారు.  
సిటీ నుంచి ఎయిర్‌పోర్టు వరకు చార్జీలు  రూ.200 నుంచి రూ.250 వరకు ఉంటాయి.  
ఆకుపచ్చ, తెలుపు రంగులో ఉన్న  ఈ బస్సుల్లో ప్రయాణికులకు వినోదాన్ని కూడా  అందించనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top