నాడు నామినేషన్‌కు డబ్బులు కూడా లేవు..

సభ ఏదైనా..

చిట్యాలవాసుల ప్రాతినిధ్యం తప్పనిసరి  

చిట్యాల(నకిరేకల్‌) :  చట్టసభలకు ఆ నియోజకవర్గానికి చెందిన స్థానికులు ప్రాతినిధ్యం వహిం చడం సాధారణం. కానీ చిట్యాల మండలానికి చెందిన పలువురు నాయకులు లోక్‌సభ, శాసనసభ, శాసన మండలి సభలకు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. 1967 నుంచి నేటి(20 18) వరకు మధ్యలో ఓ ఐదేళ్లు (1994–99) మినహిస్తే మిగిలిన కాలంలో ఎవరో ఒకరు ఏదో ఒక చట్టసభలకు చిట్యాల మండలంలోని నాయకులు ఎన్నికై ప్రాతినిధ్యం వహిçస్తూ చిట్యాల మండల ప్రత్యేకత నిలుపుతున్నారు. 

చట్టసభల్లో ప్రాతినిధ్యం ఇలా..
2009 వరకు నకిరేకల్‌ శాసనసభ నియోజకవర్గ పరిధిలో చిట్యాల మండలం లేనప్పటికీ చిట్యాల మండలంలోని వట్టిమర్తి గ్రామానికి చెందిన సీపీఎం నేత నర్రా రాఘవరెడ్డి పలుమార్లు నకిరేకల్‌ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. 1967 నుంచి 1994 వరకు ఆరు పర్యాయాలు ఆయన నకిరేకల్‌ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా ఆయన నీతికి నిజాయితీకి మారుపేరుగా నిలిచి పలువురు నాయకులకు ఆదర్శవంతమైన నేతగా రాఘవరెడ్డి గుర్తింపు పొందారు.

ఇక మండలంలోని ఉరుమడ్ల గ్రామానికి చెందిన గుత్తా మోహన్‌రెడ్డి 1978లో కాంగ్రెస్‌(ఐ) అభ్యర్థిగా, 1983లో ఇండిపెండెంట్‌ శాసనసభ్యుడిగా నల్లగొండ శాసనసభ నియోజకవర్గం(అప్పట్లో చిట్యాల మండలం నల్లగొండ శాసనసభ పరిధిలో ఉండేది) నుంచి రెండుమార్లు ఎన్నికయ్యారు. మండలంలోని నేరడ గ్రామానికి చెందిన సీపీఎం నేత చెరుపల్లి సీతారాములు 2007 నుంచి 2013 వరకు శాసనమండలి సభ్యులుగా ఉన్నారు. మండలంలోని ఉరుమడ్ల గ్రామానికి చెందిన గుత్తా సుఖేందర్‌రెడ్డి నల్లగొండ పార్లమెంటు సభ్యుడిగా 1999, 2009, 2014 లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా మూడు పర్యాయాలు పార్లమెంటు సభ్యులుగా ఎన్నికై ప్రస్తుతం కూడా పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతున్నాడు.

ఆర్‌ఎస్‌ఎస్‌ రాష్ట్ర చైర్మన్‌గా గుత్తా..
నల్లగొండ ఎంపీగా మూడు పర్యాయాలు ఎన్ని కై ప్రస్తుతం పదవిలో కొనసాగుతున్నా గుత్తా సుఖేందర్‌రెడ్డి రాష్ట్ర సమన్వయ సమితి చైర్మన్‌గా నియామకై కేబినేట్‌ హోదాలో ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఆయన గతంలో 1992 నుంచి 1999 వరకు నార్మాక్స్‌ చైర్మన్‌ పనిచేశారు. ఆయన 1998 నుంచి 1999 వరకు రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు చైర్మన్‌గా పనిచేశారు. 1998లో జాతీయ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సభ్యుడిగా పనిచేశారు. 

ఆత్మకూరు(ఎం)(ఆలేరు): అప్పటి ఎన్నికలు వేరు.. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు వేరు. అప్పటికి, ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది.  అప్పుడు నామినేషన్‌ వేయడానికి చేతిలో డబ్బులు కూడా ఉండేవి కావు. నేను 1978లో కొమ్ము పాపయ్య (కాంగ్రెస్‌)మీ ద, 1985లో తుమ్మల సురేందర్‌రెడ్డి(ఇండి)మీద, 1989లో ఉప్పనూతల పురుషోత్తంరెడ్డి(కాంగ్రెస్‌)మీద, 1994లో ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి(ఇండి)మీద సీపీఐ పోటీచేశాను. ఒక సారి ఓటమి, మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందాను. అయితే అప్పట్లో నామినేషన్‌ వేయడానికి నా వద్ద డబ్బులు కూడా లేవు. 1978లో పోటీ చేసినప్పుడు కేఆర్‌ గారు నాకు రూ. 500లు ఇచ్చారు. నాలుగు సార్లు నాకు అయిన ప్రచార ఖర్చులు కేవలం రూ. 95వేలు మాత్రమే. ఇప్పటి ఎన్నికలు.. ఇప్పటి అభ్యర్థుల ఖర్చులు చూస్తుంటే నాకు పార్టీ అవకాశం ఇచ్చినా నిలబడలేమోనని అనిపిస్తోంది.  
  – గుర్రం యాదగిరిరెడ్డి, రామన్నపేట మాజీ ఎమ్మెల్యే

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top