ఎన్నికల వేళ.. పార్టీల గోల..! 

Elections Congress And TDP Alliance Telangana - Sakshi

ముందస్తు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల తర్వాత ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో రాజకీయ సందడి జోరందుకుంది. రాజకీయ సమీకరణలు, పార్టీ ఫిరాయింపులు, పొత్తుల కోలాహలం, సీట్ల సర్దుబాట్లు, అభ్యర్థుల ఖరారు, ప్రకటించిన అభ్యర్థుల ప్రచారంతో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. టీఆర్‌ఎస్‌ పార్టీ ఉమ్మడి కరీంనగర్‌లోని 13 నియోజకవర్గాలకు 12 చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. చొప్పదండిలో సైతం నేడో రేపో ప్రకటించేందుకు రంగం సిద్ధమైంది. 13 స్థానాలకు కాంగ్రెస్‌ పార్టీకి భారీగానే దరఖాస్తులు అందినప్పటికీ, కూటమిలో భాగంగా అభ్యర్థుల ప్రకటనపై తాత్సారం జరుగుతోంది. పది రోజుల క్రితం ముగ్గురు అభ్యర్థులను ప్రకటించిన బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌) శుక్రవారం మరో నాలుగు స్థానాలకు ఖరారు చేసింది.

అమిత్‌ షా పర్యటనకు ముందు మూడు రోజులపాటు దరఖాస్తులపై హైదరాబాద్‌లో సమావేశం జరిపిన బీజేపీ అధిష్టానం అభ్యర్థుల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చింది. వైఎస్‌ఆర్‌ సీపీతో పాటు కూటమి భాగస్వామ్య పార్టీలు టీజేఎస్, టీడీపీ, సీపీఐల ఆశావహులు ప్రచారం చేస్తున్నారు. ఓ వైపు టిక్కెట్లు ఖరారైన అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నం కాగా, పొత్తులు, సీట్ల సర్దుబాటు కోసం కొందరు రాజధాని చుట్టూ చక్కర్లు కొడుతుండగా, ప్రస్తుతం జిల్లాలో రాజకీయ పార్టీల్లో ఎవరి గోల వారిదే అన్న చందంగా మారింది. 

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: మహాకూటమిగా జతకట్టే పార్టీల్లో సర్దుబాటు విషయంలో ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ కేడర్‌లో తర్జనభర్జన నానాటికీ పెరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 13 స్థానాల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చినా.. పొత్తుల విషయంలో స్పష్టత లేని కారణంగా పీటముడి వీడటం లేదు. ఆయా స్థానాల్లో బరిలో నిలిచే నాయకులెవరనేది ఇంకా తేలక అయోమయ పరిస్థితి నెలకొంది. హైదరాబాద్‌లో ఆ నాలుగు పార్టీల అగ్రనేతల భేటీలు.. ఓ రోజు కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తున్నా, ఆ మరుసటి రోజే జఠిలంగా కనిపిస్తోంది. దీంతో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీల ఆశావహులు ఆయా నియోజకవర్గాల్లో తమ ఉనికిని చాటుకునేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాగా.. మొత్తం 13 స్థానాల్లో ఎనిమిది, తొమ్మిది స్థానాలు కూటమి సర్దుబాటులో భాగంగా కాంగ్రెస్‌కు దక్కే వీలుంది.

అయినప్పటికీ అన్ని స్థానాలకుగాను 72 మంది ఆశావహులు టికెట్‌ ఇవ్వాలని దరఖాస్తు పెట్టుకున్నారు. జగిత్యాల, మంథని మినహా అన్ని స్థానాల్లో మానకొండూరులో ముగ్గురు, చొప్పదండిలో 14, కరీంనగర్‌లో 10, ధర్మపురిలో 10, రామగుండంలో 5, పెద్దపల్లిలో 7.. ఇలా అన్ని నియోజకవర్గాల్లో ముగ్గురి నుంచి 14 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులపై మూడు రోజుల క్రితం ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ సమావేశం కూడా నిర్వహించింది. రెండు, మూడు శాసన సభస్థానాలు మినహాయిస్తే దాదాపుగా అన్ని చోట్ల కాంగ్రెస్‌ అభ్యర్థులెవరనేది పరోక్షంగా తెలిసిపోయింది. అయితే.. పొత్తుల్లో భాగంగా వదిలేసే మూడు, నాలుగు స్థానాలు తేలితే అభ్యర్థుల ప్రకటన వెలువడే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.

ఏమీ తేల్చుకోలేని పరిస్థితిలో ‘కూటమి’ పార్టీలు..
తెలుగుదేశం పార్టీ పొత్తుల్లో భాగంగా కనీసం రెం డు స్థానాలన్నా ఇవ్వాలంటున్నట్లు ప్రచారం. ఇదే సమయంలో తెలంగాణ జన సమితి సైతం మరో మూడు స్థానాలపై గురి పెట్టింది. సీపీఐ మాత్రం హుస్నాబాద్‌ సీటు తప్పనిసరి అంటుండటంతో జిల్లాలో రెండో సీటు ప్రస్తావన లేనట్లే. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కరీంనగర్‌లో హుజూరాబాద్, కోరుట్ల తెదేపా స్థానాలను అడుగుతోంది. హుజూరాబాద్‌ నుంచి పోటీకి మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనాసక్తితో ఉండటంతో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి పేరు తెరమీదకు వచ్చింది. పోటీ చేసే స్థానాలపై సందిగ్ధత ఇంకా అలాగే కొనసాగుతోంది. మరోవైపు కోరుట్ల నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ పేరు వినిపించగా, ఆ సీటు కోసం ఇతర పార్టీలు పట్టుబడుతుండటం ఆసక్తికరంగా మారింది. ఇదిలా వుంటే అమరవీరుల ఆశయాల కోసం పుట్టిన పార్టీగా తెలంగాణ జనసమితి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో జోరైన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

పా ర్టీ రాష్ట్రస్థాయి నాయకులు ప్రొఫెసర్‌ కోదండరా మ్‌ సహా పలువురు ఇక్కడి నియోజకవర్గాలపైనే ప్రధాన దృష్టిని కేంద్రీకరించారు. ఉమ్మడి జిల్లాలో హుజూరాబాద్, కరీంనగర్, రామగుండం స్థానాల ను ఈ పార్టీ కోరుతోంది. రాజకీయ కంచుకోటైన ఉమ్మడి కరీంనగర్‌లోని ఒక్క స్థానం నుంచైనా బరిలో నిలవాలనే ప్రయత్నాల్ని సీపీఐ చేపడుతోంది. పట్టున్న స్థానం కోసం కూటమి ముంగిట ప్రతిపాదనల్ని పెట్టినట్లు సమాచారం. ఈ పార్టీలోనూ రాష్ట్రస్థాయి నాయకుడు పూర్వ కరీంనగర్‌లోని కీలక స్థానమైన హుస్నాబాద్‌ నుంచి పోటీ చేసేందుకు సై అంటుండగా, కాంగ్రెస్‌ పార్టీ సైతం ఈ స్థానాన్ని వదులుకోబోమంటుండటం చర్చగా మారింది. వీటన్నింటి నేపథ్యంలో పొత్తులు అంశం తేలక కూటమి భాగస్వామ్య పార్టీలో ఏమీ తేల్చుకోలేని స్థితిలో ఉన్నాయి.

ప్రచారంలో వైఎఎస్‌ఆర్‌సీపీ తదితర పార్టీలు.. బీఎల్‌ఎఫ్‌ రెండో జాబితా     విడుదల..
దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆశయాల సాధన, బడుగ పేద బలహీన వర్గాల సంక్షేమం లక్ష్యంగా ఆవిర్భవించిన వైఎస్‌ఆర్‌ సీపీ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో రోజురోజుకూ బలోపేతం అవుతోంది. వచ్చే ముందస్తు ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఆరు స్థానాల నుంచి అభ్యర్థులను బరిలోకి దింపాలని అధిష్టానం యోచిస్తోంది. కరీంనగర్, చొప్పదండి, మానకొండూరుతోపాటు మరో మూడు స్థానాల నుంచి పోటీ చేసే ఉద్దేశంతో ప్రజాక్షేత్రంలో ప్రచారంలో ఉన్నారు.

సీపీఎం అలయెన్స్‌తో బహుజన వామపక్ష కూటమి (బీఎల్‌ఎఫ్‌) ఇరవై రోజుల క్రితమే తొలి విడతగా ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది. కరీంనగర్‌కు వసీం అహ్మద్, మానకొండూరుకు మర్రి వెంకటస్వామి, చొప్పదండికి కనకం వంశీ కిరణ్‌లను ఖరారు చేసింది. శుక్రవారం పెద్దపల్లి, వేములవాడ, మంథని, రామగుండం నియోజకవర్గాలకు గుంటపల్లి సమ్మయ్య (బీఎల్‌ఎఫ్‌), శ్రీరాముల వెంకటేశ్వర్లు (బీఎల్‌ఎఫ్‌), పిల్లి చంద్రశేఖర్‌ (జర్నలిస్టు) (బీఎల్‌ఎఫ్‌), బుర్ర తిరుపతి (సీపీఐఎం)లను అభ్యర్థులుగా ప్రకటించారు. బీఎస్‌పీ, ఫార్వర్డ్‌బ్లాక్‌ తదితర పార్టీలు కూడా ఆయా పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. మొత్తంగా ఎన్నికల్‌ షెడ్యూల్‌ తర్వాత ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో రాజకీయాలు జోరందుకున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top