ఎనిమిది పద్దులకు ఓకే

ఎనిమిది పద్దులకు ఓకే


శాసనసభలో సుదీర్ఘ చర్చ అనంతరం ఏకగ్రీవం

త్వరలో సమగ్ర మార్కెటింగ్‌ చట్టం తెస్తాం: హరీశ్‌రావు

పన్నుల వసూళ్లకు పటిష్ట చర్యలు: కడియం

రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను అరికడతాం: ఈటల
సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ సోమవారం 8 పద్దులను ఆమోదించింది. వ్యవసాయం, రెవెన్యూ, పశు సంవర్థక, రహదారులు– భవనాలు, హోం, వాణిజ్యపన్నులు, ఎక్సైజ్, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖలకు సంబంధించి సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఆయా అంశాల్లో మంత్రుల సమాధానం అనంతరం సభ వాటిని ఏకగ్రీవంగా ఆమోదించినట్లు డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి ప్రకటించారు.మార్కెటింగ్‌ చట్టంపై తుది కసరత్తు..

రాష్ట్రంలో సమగ్ర మార్కెటింగ్‌ చట్టం ఏర్పాటు కసరత్తు తుది దశకు చేరుకుందని హరీశ్‌రావు తెలిపారు. పళ్లు, కూరగాయల పంటలను రైతులు ఎక్కడైనా విక్రయించుకునే వెసులు బాటు కల్పించబోతున్నామని ప్రకటించారు. మార్కెటింగ్‌ పద్దుపై చర్చ అనంతరం ఆయన మాట్లాడారు. ఈ చట్టానికి సంబంధించి నల్సార్‌ వర్సిటీ సహకారంతో ముసాయిదా ను సిద్ధం చేసినట్టు చెప్పారు. ఈ–నామ్‌ మార్కెటింగ్‌లో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని, దీన్ని మరింత విస్తరించనున్నామని వెల్లడించారు.వసూళ్లలో మనమే నంబర్‌వన్‌

ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యల వల్ల రెండేళ్లుగా వాణిజ్య పన్నుల వసూళ్లలో తెలం గాణ గణనీయ వృద్ధి సాధించిందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. 2015 ఏప్రిల్‌ నుంచి మార్చి 2016 నాటికి 12.85 శాతం, ఏప్రిల్‌ 2016 నుంచి ఫిబ్రవరి 2017 నాటికి 15.35 శాతం వృద్ధి సాధించామన్నారు. వాణిజ్య పన్నుల పద్దుపై ఆయన సీఎం పక్షాన సమాధానమిచ్చారు.పౌర సరఫరాలను ప్రక్షాళన చేస్తున్నాం

ఎంత ప్రయత్నించినా సబ్సిడీ బియ్యం అక్రమ రవాణాను అరికట్టలేకపోతున్నామని మంత్రి ఈటల పేర్కొన్నారు. కానీ పీడీ యాక్టు నమోదు వంటి కఠిన చర్యలతో దానిని చాలావరకు తగ్గించామని తెలిపారు. ఆ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు చర్యలు ప్రారంభించామన్నారు. ఆహార భద్ర త కార్డులు తగ్గించుకుని భారం వదిలించు కునే యత్నమేదీ చేయటం లేదన్నారు.నీరా ప్రవేశపెట్టే ప్రతిపాదన ఉంది

తాటి, ఈత నీరాను తిరిగి అందుబాటులోకి తెచ్చే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి పద్మారావు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న మద్యం దుకాణాలు, బెల్టు షాపుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. గతేడాది బెల్టు షాపులకు సంబంధించి 2,663 కేసులు నమోదు చేశామన్నారు.ఎన్నికల కోడ్‌ వల్లే..

ఆర్టీసీ అప్పు తెచ్చిన నిధులతో కొన్న దాదాపు 300 బస్సులను ప్రారంభించకపోవడంపై మంత్రి మహేందర్‌రెడ్డి వివరణ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటం వల్లే ఆ బస్సులను పార్కింగ్‌ యార్డుకు పరిమితం చేయాల్సి వచ్చిందన్నారు. ఇక ఆర్టీసీ స్థలాల్లో సినిమా థియేటర్లు, పెట్రోలు బంకులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.నియోజకవర్గానికో ఫైర్‌స్టేషన్‌

రాష్ట్రంలో నియోజకవర్గానికో ఫైర్‌ స్టేషన్‌ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నాయిని వెల్లడించారు. ఇటీవల పలువురు ఎస్సైలు ఆత్మహత్య చేసుకోవటం కలవరపె డుతోందని, దానికి కారణాలను విశ్లేషించేం దుకు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.కొత్తగా వెటర్నరీ అంబులెన్సులు

రాష్ట్రంలో పెద్ద ఎత్తున గొర్రె పిల్లల పంపిణీ పథకం ప్రారంభిస్తుండటంతోపాటు ఉన్న పశువుల వైద్యం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామని మంత్రి తలసాని తెలిపారు. మే నెల నుంచి వంద వెటర్నరీ అంబులెన్సులు ప్రారంభించనున్నామని చెప్పారు.రైతే ధర నిర్ధారించే రోజు రావాలి

ఏ వస్తువుకైనా ఉత్పత్తిదారుడే ధర నిర్ణయిస్తాడని, కానీ ఆరుగాలం కష్టించి పం డించిన పంటకు రైతు ధర నిర్ణయించలేక పోవటం దారుణమని మంత్రి పోచారం ఆవేదన వ్యక్తం చేశారు. పంటకు రైతే ధర నిర్ధారించే రోజు రావాలని, స్వామినాథన్‌ సిఫార్సులు అమల్లోకి రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. వ్యవసాయానికి తక్కువ నిధులు కేటాయించారన్న విమర్శ సరికాదని.. పర్‌ డ్రాప్‌ మోర్‌ క్రాప్‌లో భాగంగా నాబార్డు నుంచి తెచ్చిన రూ. వేయి కోట్లు వంటి నిధులను బడ్జెట్‌లో చూపలేదని చెప్పారు.

Back to Top