నాస్టా.. దావత్‌.. అరే బై.. లెక్క దియ్‌!

EC Notification On Assembly Elections Charges - Sakshi

లెక్కల పేరు చెబితే సాలు నాకు కండ్లు బైర్లు కమ్ముతయ్‌! ఈ దునియాలో దుష్మన్‌ ఎవరైనా ఉండ్రంటే.. సిన్నప్పటి మా లెక్కల సారే! లెక్కల్‌ సరిగా చేయకుంటే జుత్తు పట్టుకుని వీపు వంచి దాఢ్‌...దాఢ్‌ అని కొట్టేటోడు. స్కూల్‌ మొత్తం రీసౌండు వినిపించాలె! అందుకే గప్పట్నుంచి లెక్కలంటే నాకు యాస్టకొచ్చేది.. పెద్దయినంక గూడా ఆ పీలింగు పోలే! అయినా కర్చు చేసుడుకు పికర్‌ లేదుగానీ లెక్కదియ్‌ అంటే సాలు.. నాకింక గత్తిరి బిత్తిరే! అయినా ప్యాంటు జేబిలో చీటీలు దాచుకొని.. అయిందానికి కానిదానికి ఈ లెక్కల్‌ రాసుడేంది బై మరీ చాదస్తం గాకుంటె. ఏదో పంక్షన్లు గట్టయితే లెక్క రాస్తె ఓ రకంగుంటది. పొద్దునే లెవగానె ఎన్నిసార్లు తుమ్మినం.. ఎన్నిసార్లు దగ్గినం అంటూ లెక్కబెట్టేకి మాకింకో పనిలేద ఏంది? లెక్కబెట్టుడే పరేసాన్‌ అంటుంటే.. గట్ట చేసేటోల్లే దునియాలో మంచిగుంటరని హంబగ్‌ మాట చెప్పేటోల్లకేం తక్కువలేదులె!

మా ఇండ్లల్ల పూర్తిగ రివర్సు! మా నాయినంత గాదుగాని.. మా దాదా ప్రతిదాన్కి లెక్కేసుడే! మిద్దె యిరిగి మీద పడ్తుందంటె.. జర ఆగు బిడ్డా మట్టెంత బడిందో లెక్కబెట్టుకొస్త అనే రకం! గాయన పైకి పోయినంక.. కొడుకులు ఆస్తుల్ని పంచుకుంటుంటె.. ఓ అల్మర్‌ల నిండా ఉన్న చిన్న పుస్తకాలు బైటపడినయ్‌! గిదేందిరా గిట్లున్నయ్‌.. ఈ ముసలాయన దాచుకున్న ఆస్తులెక్కలు రాసిండా ఏంది  అని తెర్సి చూస్తే.. ఆయన బతికినన్నాల్లూ చేసిన కర్చుల లెక్కలు రాస్కునిండు. అంతేకాదు గదేదో బుక్‌ల నా పేరు రాసి.. కమ్మరకట్ట కొనిపించిన.. అయిదు పైసల్‌ అని రాసుకునిండు. గది చూసి నాకు ఒక్కసారిగ మెంటలెక్కిందనుకో! మా కాక ఒకాయిన ‘బిడ్డా నువ్‌ నీల్లల్లో పైసలెయ్‌ పర్వాలే.. గానీ ఎంతేసినవ్‌ గది లెక్కబెట్టుకోవాలె’ అనేటోడు. ఇలా ఉంటుంది లెక్కల్‌ లెక్కల్‌ అనేటోల్ల కతలు.

కర్చు చేసేదే తల్నొప్పి అంటే.. ఈ రాసుడు.. చూసుడు గదింకా పెద్ద రాద్దాంతం గాదె! మనకత వదిలెయ్‌.. పాపం ఈ ఎలచ్చన్ల కాండేట్లకి గిదో పరేషాన్‌! ప్రచారానికి రోడ్డెక్కినంక మైకులు.. జండాలు.. డప్పులు.. జనాలు హంగూ ఆర్బాటం ఉండి తీరాలె! గట్లా లేకుండా ఏక్‌ నిరంజన్‌ లెక్క ఇండ్ల కాడికెల్లి.. ‘అమ్మా తల్లీ ఓటెయ్‌’ అంటారా ఏంది? జనాల్ని పిలుసుకున్నంక ఆల్లకి నాస్టా దావత్‌ పెట్టించాలె. ఇది కనా కనిస్టం కర్చు! దీనిక్కూడ లెక్కల్‌ రాయాలె.. మాకు చూపాలె అంటుండ్రు ఈ ఎలచ్చన్ల ఆపీసర్లు. నువ్‌ బండ్లు పెట్టిన.. మైకు పెట్టిన.. బండ్లకి జెండాలు కట్టిన.. జనాలకి నాస్టా.. దావత్‌లు పెట్టించినా.. అన్నింటికి లెక్కలు చెప్పాలె అంటుండ్రు.

అసలు ఈ లెక్కలు చూస్కొనీకి ఆపీసర్లకు ఏకంగ డ్యూటీలే ఏసిండ్రు. గంతే కాదు ఇడ్లీ.. ఏక్‌ సౌ, పూరి.. దో సౌ అని ఎట్లపడితె గట్ల రాస్కోనేకి లేదు. గివన్నీ గల్తీ లెక్కల్‌! మాకు తెల్వదా ఏంది? అంటుండ్రంట. ఆల్లే  ఓ లిస్టు తయారు చేసిండ్రంట. ఇడ్లీకింత.. దోసెకింత.. బిర్యానీకింత అంటూ రేట్లు గట్టిండ్రు. గీ లెక్క మాదిరే  కర్చు సెయ్యలె. వెయ్యి మంది వచ్చిండ్రు నాస్టా పెట్టించిన.. దావత్‌ పెట్టించిన అని దుబారా లెక్కలు చెప్తే.. గిట్ల కాదుగానీ తమ్మీలు మా రేట్ల లెక్కన లిస్టులెయ్యండని  హుకుం వేస్తరంట! పాపం ఈ కాండేట్లు జేబులో పైసల్‌ పోతున్నయని బాదపడాలా.. ఈ లెక్కలెట్ల చేసేదిర బై అని ఆలోచించాలా. ప్రచారంలో అయిన కర్చులు రాసుకునేకి కూడా పనోల్లని పెట్టుకోవాలె! ఇనుకొంటున్న నాకే బుర్ర కరాబ్‌ అవుతున్నాది. ఆ.. ఏందీ మీక్కూడానా.. అయితే ఇయ్యాల ఇక్కడితో బంద్‌ చేస్త.. మల్లీ రేపు వస్త!!    – రామదుర్గం మధుసూదనరావు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top