ఐటీ కారిడార్‌పై డ్రోన్ల నిఘా!

Drones intelligence on IT corridor! - Sakshi

ఎమర్జెన్సీ కాల్‌ చేస్తే  క్షణాల్లో బాధితుల చెంతకు..  

డ్రోన్లను ఆపరేట్‌ చేయనున్న పోలీస్‌ స్టేషన్లు

వచ్చే ఏడాదిలోగా అమల్లోకి..  

‘జెన్‌క్యూ’ కార్యాలయ ప్రారంభోత్సవంలో జయేశ్‌ రంజన్‌  

సాక్షి, హైదరాబాద్‌: రాజధానిలోని ఐటీ కారిడార్‌లో పని చేస్తున్న మహిళా ఐటీ ఉద్యోగుల భద్రత కోసం డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేసే అంశంపై పరిశీలన జరుపుతున్నామని పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌  తెలిపారు. సైబరాబాద్‌ ప్రాంతంలోని పోలీస్‌ స్టేషన్లు ఈ డ్రోన్లను నిర్వహిస్తాయని వెల్లడించారు. అత్యవసర సహాయం కోరుతూ ఎవరైనా కాల్‌ చేస్తే తక్షణమే డ్రోన్లు రంగంలో దిగి పరిసర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసేందుకు సైరన్‌ మోగిస్తూ బాధితుల వద్దకు చేరుకుంటాయని చెప్పారు.

ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్న ఈ ఆలోచనను వచ్చే ఏడాది లోగా కార్యరూపంలోకి తెస్తామన్నారు. మాదాపూర్‌లో ఏర్పాటు చేసిన జెన్‌క్యూ ఐటీ కంపెనీ ప్రధాన కార్యాలయ భవనాన్ని గురువారం  ప్రారంభించారు.  ఐటీ కారిడార్‌కు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు దుర్గం చెరువుపై సస్పెన్షన్‌ బ్రిడ్జీని నిర్మిస్తున్నామన్నారు. ఇనార్బిట్‌ మాల్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రైలు మార్గాన్ని పొడిగిస్తున్నామని, దీంతో 30 నిమిషాల వ్యవధిలో ఇక్కడి నుంచి ఎయిర్‌పోర్టుకు చేరుకోవచ్చని అన్నారు. కొత్త ఐటీ పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నగరంలో వాహనాల కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించనున్నామన్నారు.  

రూ.100 కోట్ల టర్నోవర్‌ లక్ష్యం: జెన్‌క్యూ 
జెన్‌క్యూ కంపెనీ సీఈవో మురళి బొల్లు మాట్లాడుతూ తమ సం స్థలో 400 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని, వచ్చే మూడేళ్లలో ఈ సంఖ్యకు 1,000కి పెంచనున్నట్లు చెప్పారు. గతేడాది రూ.42 కోట్ల వార్షిక టర్నోవర్‌ సాధించామని, మూడేళ్లలో రూ.100 కోట్ల టర్నోవర్‌ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సంస్థలో పని చేస్తున్న వారిలో 46.5 శాతం మంది మహిళలే అన్నారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top