డిజిటల్‌ వైపు తపాలా అడుగులు

Digital Postal Services In Karimnagar - Sakshi

బీఓలకు ఐపీపీబీ యాప్‌తో సెల్‌ఫోన్లు

ఇళ్ల వద్దకే డోర్‌స్టెప్‌ బ్యాంకింగ్‌ సేవలు

డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్స్‌తో ఈజీఎస్, రైతుబంధు చెల్లింపులు

సాక్షి, బోయినపల్లి: సంపూర్ణ డిజిటల్‌ గ్రామాల దిశలో తపాలా శాఖ అడుగులు వేస్తోంది. ప్రాజెక్టు అభిమాన్‌లో భాగంగా కరీంనగర్‌ డివిజన్‌లో ఇండియన్‌ పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంకు (ఐపీపీబీ) ఆధ్వర్యంలో ఐదు డిజిటల్‌ గ్రామాలుగా ఎంపికయ్యాయి. ఈ గ్రామాల్లోని ప్రజలంతా ఐపీపీబీ ఖాతాలు కలిగి ఉన్నట్లు ధ్రువీకరించామని ఐపీపీబీ కరీంనగర్‌ డివిజన్‌ సీనియర్‌ మేనేజర్‌ చంద్రకాంత్‌ తెలిపారు. ఐపీపీబీ ఖాతాలతో ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలు సైతం పొందే అవకాశముంది. రూ.100 బ్యాలెన్స్‌తో ఐపీపీబీ ఖాతా ప్రారంభించవచ్చు. వినియోగదారుడు తన మొబైల్‌లో ఐపీపీబీ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. యాప్‌తో పోస్టల్‌ శాఖలో ఉన్న ఎస్‌ఎస్‌ఏ, పీపీఎఫ్, ఆర్డీ ఖాతాల డిపాజిట్‌ ఉన్న చోటి నుంచే ఆపరేట్‌ చేయొచ్చు.

కరీంనగర్‌ డివిజన్‌ పోస్టల్‌ సమాచారం
డివిజన్‌ కేంద్రం: కరీంనగర్‌
హెచ్‌ఓలు: 2, కరీంనగర్, జగిత్యాల
సబ్‌ డివిజన్లు: 5, కరీంనగర్‌నార్త్, సౌత్, జగిత్యాల ఈస్ట్, వెస్ట్, రాజన్నసిరిసిల్ల
సబ్‌ పోస్టాఫీసులు: 43
బ్రాంచ్‌ పోస్టాఫీసులు: 310
ఐపీపీబీ ఖాతాలు: 50,000 

ఐదు సంపూర్ణ డిజిటల్‌ గ్రామాలు
కరీంనగర్‌ పోస్టల్‌ డివిజన్‌లో 310 బ్రాంచి పోస్టాఫీసులు, 43 సబ్‌ పోస్టాఫీసులు, కరీంనగర్, జగిత్యాల కేంద్రాలుగా 2 హెడ్‌ పోస్టాఫీసులు ఉన్నాయి. వీటి పరిధిలో 50వేల మందికి ఐపీపీబీ ఖాతాలు ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఐపీపీబీలో సాక్షమ్‌ గ్రామ్‌ (డిజిటల్‌ గ్రామాలు)గా ఐదు గ్రామాలు ఎంపికైనట్లు సంబందిత శాఖ అధికారి చంద్రకాంత్‌ తెలిపారు. కరీంనగర్‌ డివిజన్‌లో ఉన్న సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గునుకుల కొండాపూర్, కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేట, జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూర్, గంగిరెడ్డిపల్లి, రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ గ్రామాలు డిజిటల్‌ గ్రామాలుగా ఎంపికయ్యాయి. ఈ గ్రామాల్లో ఖాతాదారులు తమ మొబైల్‌ ఫోన్‌తో ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ చేసే అవకాశం ఉంది.

డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్స్‌..
ఆధార్‌ అనుసంధానంతో ఐపీపీబీ ఖాతాదారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల డబ్బులు డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్స్‌ (డీబీటీ) ద్వారా తమ ఖాతాల్లో జమ అయ్యే అవకాశముంది. ఇదులో ఉపాధిహామీ చెల్లింపులు, గ్యాస్‌ సబ్సిడీ, పీఎం కిసాన్‌ నిధి, రైతుబంధు, కేసీఆర్‌ కిట్‌ తదితర పథకాల డబ్బులు నేరుగా ఐపీపీబీ ఖాతాలో జమ చేసుకుని లబ్ధి పొందవచ్చు.

గ్రామాల్లో డోర్‌ స్టెప్‌ బ్యాంకింగ్‌..
ఇంటి వద్దకే బ్యాంకు సేవలు కాన్సెప్ట్‌తో.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ఇళ్లలోకి బీపీఎంలు వెళ్లి డోర్‌స్టెప్‌ బ్యాంకింగ్‌ కింద ఐపీపీబీ ఖాతాలు తెరుస్తున్నారు. ఇందుకోసం బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌ (బీపీఎం)లకు పోస్టల్‌ శాఖ ఐపీపీబీ యాప్‌ ఉన్న ప్రత్యేక సెల్‌ ఫోన్, బయోమెట్రిక్‌ డివైస్‌ అందించారు. ఖాతా ఇంటి వద్దే తెరిచి డీవైసీలో వేలిముద్ర తీసుకుని ఆన్‌లైన్‌ చేస్తారు. డిపాజిట్‌ సొమ్ము విత్‌డ్రా చేసుకోవాలనుకున్నా ఇంటి వద్దనే విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది.

ప్రజలతో సన్నిహిత సంబంధాలు
బోయినపల్లి ఎస్‌ఓ పరిధిలో ఉన్న తడగొండ గ్రామంలో ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పరచుకున్నా. ఐపీపీబీ ఖాతాలతో కలిగే ప్రమోజనాలు ప్రజలకు వివరించా. దీంతో గ్రామంలో ఐదు వందలకు పైగా ఖాతాలు తెరిచా. తడగొండ డిజిటల్‌ గ్రామంగా ఎంపికయ్యాంది.
– కిరణ్, బీపీఎం, తడగొండ, బోయినపల్లి

పథకాల డబ్బులు జమ మంచిదే..
డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్స్‌ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే గ్యాస్‌ సబ్సిడీ, ఉపాధిహామీ, రైతుబంధు తదితర సంక్షేమ పథకాల డబ్బులు నేరుగా ఖాతాలో జమ చేయడం మంచి పరిణామం. దీంతో వినియోగదారులకు చాలా సౌకర్యంగా ఉంటుంది. 
– బుర్ర రాజు, తడగొండ, బోయినపల్లి

ఇంటి వద్దే సేవలు..
ఐపీపీబీ కింద ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఐదు గ్రామాలను సంపూర్ణ డిజిటల్‌ గ్రామాలుగా ప్రకటించడం జరిగింది. ఈ గ్రామాల్లో ప్రజలందరికీ ఐపీపీబీ ఖాతాలు ఉన్నాయి. ఫోన్‌లో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని ఇంట్లోంచే బ్యాంకు సేవలు పొందే అవకాశం ఉంది.
– చంద్రకాంత్, ఐపీపీబీ సీనియర్‌ మేనేజర్, కరీంనగర్‌ డివిజన్

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top