పోలీస్‌స్టేషన్లకు డిజిటల్‌ అడ్రస్‌

Digital Address Was Arranging To Police Stations In Telangana - Sakshi

సాక్షి, మంచిర్యాల : రోడ్డుపై నడుచుకుంటు వెళ్తున్న వ్యక్తి చేతిలోని  బ్యాగును దుండగులు లాక్కెళ్లిపోవడం, రోడ్డుపై వెళ్తున్న ఒంటరి మహిళల మెడలోని చైన్‌స్నాచింగ్‌ పాల్పడి పారిపోవడం, వెంటనే అక్కడి పరిధిలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి బాధితులు వెళితే సిబ్బంది అంత విన్న తర్వాత ఆ ప్రాంతం మా పరిధిలోకి రాదని, వేరే పోలీస్‌స్టేషన్‌ చిరునామా చెప్పి పంపిస్తుంటారు. అప్పటికే దుండగులు పోలీసులకు దొరకనంత దూరం పారిపోతారు.

ఈ పరిస్థితి బాధితులకు కొంత అసంతృప్తికి, అసౌకర్యానికి గురి చేసింది. ఇలాంటి కొన్ని ఫిర్యాదులు రాష్ట్ర పోలీస్‌ బాస్‌ డీజీపీ మహేందర్‌రెడ్డి దృష్టికి వచ్చాయి. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు మళ్లి పునరావృత్తం కాకుండా ఉండేందుకు రాష్ట్రంలోని పోలీస్‌స్టేషన్లకు డిజిటల్‌ అడ్రాస్‌ ఇవ్వడానికి పోలీస్‌ శాఖ కసరత్తు మొదలుపెట్టింది. త్వరలో పోలీస్‌ స్టేషన్లన్ని డిజిటల్‌ అడ్రాస్‌లోకి రానున్నాయి.

స్మార్ట్‌ఫోన్‌లో పోలీస్‌ స్టేషన్లు....
పోలీస్‌స్టేషన్ల చిరునామా ఇక నుంచి స్మార్ట్‌ ఫోన్‌లో తెలుసుకునే విధంగా పోలీస్‌ శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్రంలోని పోలీస్‌ స్టేషన్లన్నింటికీ  జియో పెన్సింగ్‌ ఏర్పాటు చేయడంతో పాటు వాటిని డైరెక్షన్స్‌తో సహా పోలీస్‌ అధికారిక యాప్‌ ‘హాక్‌–ఐ’తో అనుసంధానం చేయనున్నారు. దీని ఫలితంగా స్మార్ట్‌ఫోన్‌ ఉన్న ఎవరైనా తాము ఉన్న ప్రాంతం ఏ పోలీస్‌ పరిధిలోకి వస్తుందో క్షణాల్లో తెలుసుకునే అవకాశం ఉంది. అంతే కాకుండా పోలీస్‌ స్టేషన్‌కు ఎలా  చేరుకోవాలో కూడా యాప్‌ రూట్‌ చూపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సౌకర్యాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని డీజీపీ యోచిస్తున్నారు.

అనేక చోట్ల పరేషాన్‌...
ఏదైనా ఓ ఉదంతం జరిగినప్పుడు కేసు నమోదు చేయాలన్నా, తదుపరి చర్యలు తీసుకోవాలన్నా జూరిస్‌ డిక్షన్‌గా పిలిచే పరిధి అత్యంత కీలకమైన అంశం. తమ పరిధిలోకి రాని కేసు విషయంలో ఓ పోలీస్‌స్టేషన్‌ అధికారులు కలుగజేసుకుంటే చట్టపరంగానే కాకుండా ఇతర అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ నేపథ్యంలో బాధితులు ఎవరైనా సరే నేరం చోటుచేసుకున్న పరిధిలోని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిందే. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఈ పోలీస్‌ స్టేషన్ల పరిధులు అనేవి పరేషాన్‌ చేస్తుంటాయి. మంచిర్యాల పోలీస్‌ స్టేషన్‌ పరిధి మూడు వైపులుగా ఉంది.

ఇటు శ్రీనివాస్‌ గార్డెన్, తోళ్లవాగు, వేంపల్లి వరకు విస్తరించి ఉంటుంది. ఈ ఏరియా మొత్తం మంచిర్యాల పోలీస్‌ స్టేషన్‌ కిందికి వస్తుంది. ఈ  ప్రాంతాలు దాటుతే ఒక పవైపు రామకృష్ణపూర్, మరో వైపు సీసీసీపోలీస్‌ స్టేషన్, ఇంకో వైపు హాజిపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోకి వస్తాయి. కానీ ఈ ప్రాంతాలకు మంచిర్యాల పోలీస్‌స్టేషన్‌ దగ్గరలో ఉంటాయి. ఇక్కడ ఏమైన సంఘటనలు జరిగితే సమీప పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు సర్వసాధారణంగా సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వస్తారు. ఈ నేపథ్యంలో అనేక సందర్భాల్లో అటు బాధితులే కాదు కొన్ని సార్లు పోలీసులు సైతం తికమక పడ్డ సందర్భాలు సైతం ఉన్నాయి.

గూగుల్‌ మ్యాప్‌లో ఉన్నప్పటికీ..
ఓ ప్రాంతంలో ఉన్న వ్యక్తి తన సమీపంలో ఉన్న హోటల్స్, రెస్టారెంట్స్, బార్స్‌తో పాటు పోలీస్‌ స్టేషన్లను తెలుసుకునే అవకాశం గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా ఉంది. అయితే ఇది కేవలం సమీపంలోని వాటిని మాత్రమే చూపించగలుగుతోంది. దానికే మార్గాన్ని నావిగేట్‌ చేస్తుంది. వేంపల్లి వద్ద జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసేందుకు  ఇక్కడ ఉన్న ఓ వ్యక్తి ‘పోలీస్‌ స్టేషన్‌ నియర్‌ బై మీ’ అని గూగుల్‌ మ్యాప్‌లో టైప్‌ చేస్తే అది సమీపంలోని మంచిర్యాల పోలీస్‌ స్టేషన్‌ చూపించే అవకాశం ఉంది. అయితే వాస్తవానికి ఈ ప్రాంతం హాజిపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోనికి వస్తుంది. పరిధులు అన్నవి గూగుల్‌ మ్యాప్స్‌లో అనుసందానించి లేక పోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే పోలీస్‌ స్టేషన్ల పరిధులు, వాటి ఆడ్రస్‌లు ప్రజలకు అందుబాటులో ఉంచాలని రాష్ట్ర పోలీస్‌ బాస్‌ డీజీపీ మహేందర్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.

హక్‌–ఐలో లింకు రూపంలో....
దీనికోసం పోలీస్‌ అధికారిక యాప్‌ హాక్‌–ఐలో ప్రత్యేక లింకు ఏర్పాటు చేయనుంది. రాష్ట్రం లోని అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధుల్నీ జియో ఫెన్సింగ్‌ చేస్తూ నావిగేషన్స్‌తో సహా ఇందులో నిక్షిప్తం చేస్తుంది. స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న ఏ వ్యక్తి అయినా ఓ ప్రాంతంలో నిల్చుని ఆ ప్రాంతం ఏ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోకి వస్తుందో తెలుసుకో వాలంటే ఈ లింకు ఓపేన్‌ చేస్తే చాలు. ఈ వ్యక్తి ఉన్న ప్రాంతాన్ని జీపీఎస్‌ ఆధారంగా గుర్తించే యాప్‌ ఏ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోకి వస్తుందో వెంటనే చెబుతోంది. దీంతో కొన్న సార్లు నావిగేషన్, పోలీస్‌ స్టేషన్‌ పరిధుల్ని యాప్‌ తప్పుగా చూపించే అస్కారం సైతం ఉంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top