ప్రజా భాగస్వామ్యంతోనే అభివృద్ధి

Developed with public participation - Sakshi

‘మన నగరం’ వినూత్న కార్యక్రమంలో కేటీఆర్‌

రాజకీయాల్లేవు.. చిత్తశుద్ధితోనే ఈ కార్యక్రమం  

‘మనం మారుదాం.. నగరాన్ని మారుద్దాం’ అనే స్ఫూర్తి కలగాలి  

జీహెచ్‌ఎంసీ సర్కిళ్లను 50కి పెంచుతామన్న మంత్రి

సాక్షి, హైదరాబాద్‌: ఎవరో వచ్చి బాగు చేస్తారని ఎదురు చూడకుండా ఎవరి ప్రాంతాన్ని వారే అభివృద్ధి చేసుకోవాలని మునిసిపల్‌ మంత్రి కె.తారకరామారావు పిలుపునిచ్చారు. జీహెచ్‌ఎంసీయే వచ్చి చెత్తను తొలగించాలని అనుకోవద్దని, అసలు చెత్త వేయకుండా ఉంటే సమస్యే ఉండదన్నారు. మన నగరం (అప్నా షహర్‌) కార్యక్రమానికి శనివారం కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ నుంచి మంత్రి శ్రీకారం చుట్టారు. ప్రజల సమస్యలను వారి ద్వారానే తెలుసుకొని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం రాజకీయ లబ్ధికోసం కాదన్నారు. గత పాలకులను నిందించబోమన్నారు.

జీహెచ్‌ఎంసీలో ప్రస్తుతమున్న 30 సర్కిళ్లను కూడా భవిష్యత్‌లో 50 సర్కిళ్లు చేస్తామన్నారు. అధికార వికేంద్రీకరణ, ప్రజల భాగస్వామ్యం, చేయబోయే పనులు చెప్పడం, నిర్ణీత వ్యవధుల్లో పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. నగర జనాభా ఇప్పటికే కోటి ఉండగా, రాబోయే 15–20 ఏళ్లలో రెట్టింపయ్యే అవకాశం ఉందని, శరవేగంగా పెరుగుతున్న నగరాల్లో హైదరాబాద్‌ ఉందంటూ ఆ మేరకు ప్రజలకు సదుపాయాలు కల్పించాల్సి ఉందన్నారు. ఒక్కో మనిషి నుంచి సగటున రోజుకు 600 గ్రాముల చెత్త వెలువడుతోందని, కోటి మంది చెత్తను 22వేల మంది పారిశుధ్య కార్మికులు శుభ్రం చేయాలనుకోవడం తగదంటూ, ఎవరికి వారుగా స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. మోడల్‌ మార్కెట్లు, కాలనీలు ప్రభుత్వం కట్టించినా నిర్వహణ మీదేనన్నారు.  

మనం మారుదాం.. నగరాన్ని మారుద్దాం
మనం మారుదాం.. మన నగరాన్ని మారుద్దాం అనే స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో కలిగించేందుకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. గ్రేటర్‌లో ఇటీవల నియమితులైన 13,800 మంది వార్డు, ఏరియా కమిటీ సభ్యులు, ప్రజల భాగస్వామ్యంతో హైదరాబాద్‌ను స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు కలసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను విడిగా స్వచ్ఛ ఆటోలకు అందించే విధానాన్ని మిషన్‌ మోడ్‌తో చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లారెడ్డి, మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, నగర మేయర్‌ రామ్మోహన్, కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి, జలమండలి ఎండీ దానకిషోర్, మేడ్చల్‌ కలెక్టర్‌ ఎం.వి.రెడ్డి, జోనల్‌ కమిషనర్‌ శంకరయ్య, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

చల్నేదో.. చల్తాహై.. వద్దు
ఏం చేసినా నడుస్తుందనే అభిప్రాయంతో పరసరాలను అపరిశుభ్రంగా మారుస్తున్నారని, మెట్రో రైల్లోనూ అప్పుడే పాన్‌తో ఉమ్మివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్యాంక్‌బండ్‌పై పెట్టిన ‘లవ్‌ హైదరాబాద్‌’ను 2 నెలల్లోనే గలీజు చేయడంతో నెక్లెస్‌ రోడ్‌కు తరలించాల్సి వచ్చిందన్నారు. నగరవాసుల్లో ఈ తీరు మారాలన్నారు.

స్వచ్ఛ నమస్కారంతో..
♦  కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌ మోడరేటర్‌గా వ్యవహరించారు. తొలుత స్థానిక నియోజకవర్గ అభివృద్ధిపై లఘుచిత్రం ప్రదర్శించారు.  
స్వచ్ఛ నమస్కారం.. స్వచ్ఛమైన, అచ్చమైన తెలుగు నమస్కారం అంటూ కేటీఆర్‌ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.  
తాగునీరు, విద్యుత్, జీహెచ్‌ఎంసీ, శాంతిభద్రతలు, రెవెన్యూ, పరిశ్రమలు–కాలుష్యం అంశాలవారీగా సమస్యలు ప్రస్తావించాలన్నారు.  
కార్యక్రమంలో తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, రోడ్లు వంటి çసమస్యలకు ప్రాధాన్యతనిచ్చి, రెవెన్యూ సమస్యల్ని పట్టించుకోలేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కుత్బుల్లాపూర్‌ ప్రాంతంలో అధిక సంఖ్యలో ఉన్న స్లమ్స్‌ నుంచి 58, 59జీవోల కింద చాలా మంది దరఖాస్తులు చేసుకున్నారు. వాటి విషయమై ప్రస్తావించకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు.  
సమావేశంలో 23 సమస్యలపై ప్రజలు ప్రస్తావించగా, వాటిల్లో ఏడింటిని వెంటనే పరిష్కరించేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా సమావేశం ముగియగానే సంబంధిత అధికారులు నాలుగైదు ప్రాంతాల్లో క్షేత్రస్థాయికి వెళ్లారు. మిగతావాటిని నిర్ణీత కాలవ్యవధుల్లో పరిష్కరిస్తామన్నారు.  
కార్యక్రమంలో కాలనీసంఘాలు, ఎన్జీవోలు, మేధావులు తదితరులు దాదాపు 500 మంది పాల్గొన్నారు.  
కార్యక్రమానికి హాజరైన స్వచ్ఛంద సంస్థలు, బస్తీ, ఏరియా కమిటీ సభ్యులు, స్వచ్ఛ సీఆర్‌పీలు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో ఆయా పథకాల అమలుపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఉత్తమ కాలనీలకు ప్రత్యేక పురస్కారాలు అందజేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top