రూ. 20 లక్షల పరిహారం.. ఒకరికి ఉద్యోగం

Deceased Mounika Relatives Fires On L And T Officials Over Ex Gratia - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మెట్రో పిల్లర్‌ కారణంగా దుర్మరణం పాలైన మౌనిక కుటుంబ సభ్యులు ఎల్ అండ్‌ టీ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా తమకు రూ. 50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు మాత్రం ఇంతవరకు ఎక్స్‌గ్రేషియా ప్రకటనపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే మెట్రో ఘటనలో ప్రమాదవశాత్తు మరణిస్తే వచ్చే ఇన్సూరెన్స్‌ డబ్బు మాత్రమే ఇస్తామని అధి​కారులు చెబుతున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా ఈ ప్రమాదానికి ఇన్సూరెన్స్‌ వర్తిస్తుందా లేదా అన్న విషయంపై కూడా స్పష్టతనివ్వకపోవడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే విషయంలోనూ ఎటూ తేల్చకపోవడంతో వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీంతో దిగొచ్చిన అధికారులు మౌనిక కుటుంబ సభ్యులకు రూ. 20 లక్షల పరిహారంతో పాటుగా..  మెట్రో ప్రమాదంలో చనిపోయిన వారికి ఇచ్చే ఇన్సూరెన్స్ వర్తింపునకు అంగీకరించినట్లు తాజా సమాచారం. అదే విధంగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు కూడా సుముఖత వ్యక్తం చేశారు. (చదవండి : మెట్రో పిల్లర్‌ కాదు.. కిల్లర్‌)

కాగా అధికారులు పరిహారం విషయంలో భరోసా ఇవ్వడంతో మౌనిక మృతదేహానికి పోస్ట్‌మార్టం చేసేందుకు ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించారు. దీంతో గాంధీ మార్చురీలో ఉన్న మౌనిక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి కాగానే.. వైద్యులు ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ క్రమంలో మౌనిక మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మౌనిక మృతిపై ఎల్‌ అండ్‌ టీ సంస్థపై 304 సెక్షన్‌ కింద ఎస్సార్‌ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి హరికాంత్‌ రెడ్డి భార్య మౌనిక అమీర్‌పేట మెట్రోస్టేషన్‌ కింద పిల్లర్‌ పెచ్చులు ఊడిపడటంతో మరణించిన విషయం విదితమే. తన సమీప బంధువు మున్నీకి అమీర్‌పేట్‌లో హాస్టల్‌ వసతి చూసేందుకు ఆదివారం మధ్యాహ్నం అమీర్‌పేట్‌లో మెట్రోరైలు దిగారు. ఈ క్రమంలో మున్నీతో పాటు సారథి స్టూడియో వైపు మెట్రో స్టేషన్‌ మెట్లు దిగి.. మెట్రోస్టేషన్‌ మెట్ల మార్గం పిల్లర్‌ కింద నిరీక్షిస్తున్న సమయంలో పిల్లర్‌ పెచ్చులు మౌనిక మీద పడ్డాయి. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలైన ఆమె అక్కడిక్కడే కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మౌనిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top