కన్నతల్లిని గెంటేసిన కూతురు

Daughter Who Ignored Her Mother - Sakshi

బలవంతంగా రైలెక్కించ్చిన వైనం

స్పందించిన రామకృష్ణాపూర్‌ వాసి

మంచిర్యాల వృద్ధాశ్రమంలో అప్పగింత

రామకృష్ణాపూర్‌(చెన్నూర్‌) : తనకు అన్నం పెట్టడం లేదని ప్రముఖ కవి గూడ అంజన్న తల్లి జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించిన ఘటన మరువక ముందే మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. సాక్షాత్తూ కన్న కూతురే తల్లిని వదిలించుకునే ఎత్తుడగ వేసింది. ఏకంగా రైలెక్కించి పలాయనం చిత్తగించింది. పట్టణ వాసి సహకారంతో బాధిత వృద్ధురాలు క్షేమంగా ఓ వృద్ధాశ్రమంలో చేరింది. వివరాలు ఇలా ఉన్నాయి. 

బాధితురాలి పేరు గోవిందుల లక్ష్మి(85). ఖమ్మం జిల్లాలోని పాండురంగపురం గ్రామం. భర్త రాములు చనిపోయాడు. ఒక కుమారుడు బాపు, కూతురు శారద వీరి సంతానం. వీరిలో కొడుకు బాపు సైతం మరణించాడు. భర్త చనిపోవడంతో కోడలు పుట్టింటికీ వెళ్లిపోయింది. ఈ పరిస్థితుల్లో కూతురు వివాహ బాధ్యతల్ని తన నెత్తిపై వేసుకుంది ఆ తల్లి.

ఇల్లు అమ్మి కూతురు శారదకు పెళ్లి చేసింది. కొన్నేళ్ల పాటు సవ్యంగానే చూసుకున్న శారద మదిలో ఏ ఆలోచన మెదిలిందో ఏమోగాని మంగళవారం తల్లిని తన భర్త రాంబాబుతో కలిసి ఖమ్మం రైల్వేస్టేషన్‌కు తీసుకొచ్చింది. స్టేషన్‌లో నిలిచి ఉన్న లక్నో ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కించి ఇద్దరూ అక్కడి నుంచి జారుకోవడం గమనార్హం. 

పట్టణవాసి స్పందనతో సుఖాంతం 

రైల్లో బిక్కుబిక్కుమంటూ కూర్చున్న ఆ తల్లిని రా మకృష్ణాపూర్‌ వాసి దివ్యాంగుల చైతన్య వేదిక అధ్యక్షుడు మెడపట్ల సతీశ్‌ గమనించాడు. డోర్నకల్‌ స్టేషన్‌కు రాగానే పూర్తి వివరాలు అడగగా ఆ అవ్వ అంతా చెప్పింది. దీనికి చలించిపోయిన సతీశ్‌ వెంటనే తన మిత్రులైన ఎల్కటూరి ధని, కుష్నపల్లి సత్తికి ఫోన్‌ చేశాడు.

మంచిర్యాల సమీపంలోని తిమ్మాపూర్‌ వద్ద ఉన్న షేడ్‌ అనే వృద్ధాశ్రమానికి వెళ్లి సమాచారం తెలపాలని కోరాడు. మిత్రులు సైతం సకాలంలో స్పందించారు. లక్నో ఎక్స్‌ప్రెస్‌ మంచిర్యాలకు చేరుకోగానే బాధిత వృద్ధురా లు లక్ష్మిని రైల్లోంచి దించారు. రాత్రి స్టేషన్‌లోని విశ్రాంతి గదిలోనే ఉంచి మరుసటి రోజు బుధవా రం ఉదయం షెడ్‌ వృద్ధాశ్రమంలో చేర్పించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top