దేశంలోనే మొదటిది

Cycling park first time in the country - Sakshi

కొత్తగూడలోని పాలపిట్ట సైక్లింగ్‌ పార్క్‌ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేకంగా సైక్లింగ్‌ పార్క్‌ను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అని రాష్ట్ర మున్సిపల్, ఐటీ మంత్రి కె.తారక రామారావు అన్నారు. సోమవారం హైదరాబాద్‌ కొత్తగూడలోని బొటానికల్‌ గార్డెన్‌లో పాలపిట్ట సైక్లింగ్‌ పార్క్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ... సైకిల్‌ ట్రాక్‌లున్నా ఎక్కడా ప్రత్యేకంగా సైక్లింగ్‌ కోసం కేటాయించలేదన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో హైదరాబాద్‌కు మరొక మణిహారం పాలపిట్ట సైక్లింగ్‌ పార్క్‌ అని అన్నారు. వెస్ట్‌ జోన్‌ కాంక్రీట్‌ జంగల్‌గా మారడంతో భవిష్యత్‌ తరాల మనుగడకు బొటానికల్‌ గార్డెన్‌ ఎంతో అవసరమన్నారు. బర్డ్స్‌ పార్క్‌లో ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎఫ్‌డీసీ) జూలైలో 7,100 మొక్కలు నాటి వంద శాతం మొక్కలను రక్షించిందన్నారు.

బొటానికల్‌ గార్డెన్‌లోనూ యోగా కేంద్రం, జిమ్, చిల్డ్రన్స్‌ ప్లే ఏరియా, బోటింగ్‌ సౌకర్యాలు ఏర్పాటు చేశారని తెలిపారు. తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్‌ బండా నరేందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం కోసం పాలపిట్ట సైక్లింగ్‌ పార్క్‌ను నెలకొల్పామని చెప్పారు. సైక్లింగ్‌ చేయడం వల్ల గుండె, కిడ్నీ సంబంధ వ్యాధులు దరిచేరవని ఎఫ్‌డీసీ ఎండీ చందన్‌ మిత్ర చెప్పారు. ప్రతి ఒక్కరు సైక్లింగ్‌ చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, వెస్ట్‌ జోనల్‌ కమిషనర్‌ హరిచందన, ఉప కమిషనర్‌ మమత, రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్‌పర్సన్‌ సుజాత నాగేందర్, కార్పొరేటర్లు హమీద్‌ పటేల్, రాగం నాగేందర్‌ యాదవ్, ఎఫ్‌డీసీ ఏడీ రవీందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top