యాదాద్రి : సుదర్శన రాజగోపురానికి పగుళ్లు 

Cracks to the Yadadri temple Sudharshana Rajagopuram - Sakshi

మొదటి అంతస్తులోనే గుర్తించిన అధికారులు 

వేగంగా పనులు పూర్తి చేయాలనుకోవడంతోనే? 

పగుళ్లు రావడంతో నిర్మించిన శిలల తొలగింపు 

దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్న స్థపతులు 

సాక్షి, యాదాద్రి: దసరానాటికి స్వయంభువుల నిజదర్శనం కల్పించాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలతో పనులు వేగంగా చేసే క్రమంలో శిల్పిపనుల్లో అపశ్రుతి దొర్లింది. యాదాద్రి లక్ష్మీనారసింహస్వామి గర్భాలయంపై నిర్మిస్తున్న మూడంతస్తుల సుదర్శన రాజగోపురం మొదటి అంతస్తు రాతిశిలల్లో పగుళ్లు వచ్చాయి. ఒకవైపు వంగిపోయినట్లు అధికారు లు గుర్తించారు. దీంతో పనులను వెంటనే ఆపడంతోపాటు, ఇప్పటివరకు నిర్మించిన మొదటి అంతస్తు రాతి కట్టడాలను తొలగిస్తున్నారు. 

నాణ్యతను గాలికొదిలేయడంతో.. 
యాదాద్రి లక్ష్మీనారసింహస్వామి ఆలయాన్ని అద్భుత శిల్ప కళా నైపుణ్యంతో నిర్మిస్తున్నారు. ఆలయానికి అపురూపమైన శోభను తెచ్చే కృష్ణ శిలలతో ప్రధానాలయ నిర్మాణం చేపట్టారు. కాగా, దసరాకు ఆలయాన్ని భక్తులకు అందించాలన్న తొందరలో రాజగోపురాల పనులను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో గర్భాలయంపై నిర్మిస్తున్న సుదర్శన రాజగోపురంపై పేర్చే రాతి వరుసలో పగుళ్లు ఏర్పడ్డాయి. పనులను వేగంగా చేయాలన్న తొందరలో నాణ్యతపై అశ్రద్ధ చూపడంతో ఈ పగుళ్లు ఏర్పడ్డాయని అక్కడి కూలీలు చెబుతున్నారు. శిలలను ఒక వరుసలో పేర్చాలంటే కనీసం 20 నుంచి 30 రోజులు పడుతుంది. కానీ, తక్కువ సమయంలోనే చేయాలని వేగం పెంచారు. కేవలం ఐదు నుంచి 10రోజుల్లో ఒక వరుస పనులను పూర్తి చేశారు. దీనివల్ల రాళ్ల మధ్య వేసే డంగు సున్నం తడి ఆరి పట్టు బిగించకముందే రాళ్లను పేర్చడంతో క్రమంగా వాటి మధ్యలో పగుళ్లు వచ్చాయి.  

తొలగిస్తున్న సుదర్శన గోపురం.. 
తొలి వరుసలో ఏర్పాటు చేసిన సుదర్శన గోపురంలో పగుళ్లు రావడంతో వాటిని తొలగిస్తున్నారు. నాణ్యతా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా వాటిని తొలగించి తిరిగి నిర్మించనున్నారు. మూడంతస్తుల సుదర్శన గోపురంలో ప్రస్తుతం ఒక అంతస్తు నిర్మాణం మాత్రమే పూర్తయి రెండో అంతస్తు పనులు ప్రారంభించేలోగా పగుళ్లు బయటపడ్డాయి.
 
ఈ పనులు జరుగుతున్నాయి: యాదాద్రి ప్రధానాలయం పనుల్లో భాగంగా గర్భాలయం, ప్రధానాలయం శ్లాబు కాంక్రీట్‌ పనులు పూర్తయ్యాయి. అలాగే శిల్పి పనుల్లో భాగంగా ఆలయంలో అళ్వార్‌ విగ్రహాలు, కాకతీయ స్తంభాలను ఏర్పాటు చేశారు. తూర్పు, ఉత్తరం వైపు ఐదంతస్తుల రాజగోపురాలు పూర్తికావొచ్చాయి. ఏడంతస్తుల రాజగోపురం ప్రగతిలో ఉంది. ప్రాకారం పనులు ప్రారంభం అయ్యాయి. ప్రాకారాలకు అష్టభుజి స్తంభాలను అమరుస్తున్నారు. రిటైనింగ్‌ వాల్‌ పనుల జాప్యంతో దక్షిణ, పడమర రాజగోపురాల పనులు ఆలస్యంగా సాగుతున్నాయి.  

అలంకారాల కోసమే 
అదనపు అలంకారాల కోసమే నిర్మిం చిన మొదటి అంతస్తు తొలగిస్తున్నాం. వందల ఏళ్ల పాటు మన్నికగా ఉండే గుడి నిర్మాణంలో సుదర్శన రాజగోపురం కీలకమైంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాతి శిల్పాలకు మరిన్ని అలంకారాలు చేయనున్నాం. ఇందుకోసం నిర్మించిన మొదటి అంతస్తు శిలలను తొలగించాం. మిగతా శిల్పాల పనులు వేగంగా జరుగుతున్నాయి.        
–వేలు, స్థపతి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top