పొత్తులు... కత్తులు

CPI Will Contest In 9 Seats Says Chada Venkat Reddy - Sakshi

సీపీఐ ప్లాన్‌–బిలో బెల్లంపల్లి, మంచిర్యాల

టీజేఎస్‌ పోటీ చేస్తామన్న పదిలో చెన్నూరు, ఆసిఫాబాద్‌ 

ఈనెల 9న కూటమి సీట్ల ప్రకటన డౌటే!

ఒక్క బెల్లంపల్లిపైనే కాంగ్రెస్‌ సుముఖత

మిత్రపక్షాలు కోరుతున్న నాలుగింట బలంగా కాంగ్రెస్‌

ఆందోళనలో కాంగ్రెస్‌ ఆశావహులు

సీపీఐ, టీజేఎస్‌ నేతలకు కొత్త ఊపిరి

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌: ‘పోటీ చేసేది మేమే... జాబితా ప్రకటించడమే తరువాయి...’ అని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రచారం సాగిస్తున్న కాంగ్రెస్‌ నాయకులకు మహాకూటమి నేతలు షాక్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌ పొత్తు అంశం తేల్చకపోతే ‘ప్లాన్‌ బి’ కింద తొమ్మిది సీట్లలో పోటీ చేయనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రకటించారు. ఆయన ప్రకటించిన తొమ్మిదిలో రెండు సీట్లు ఉమ్మడి జిల్లాలోని బెల్లంపల్లి, మంచిర్యాల కావడం గమనార్హం. మరోవైపు టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ మహాకూటమి నుంచే తమ పార్టీ కనీసం పది సీట్లలో పోటీ చేయనుందని తేల్చిచెప్పారు. కోదండరామ్‌ చెప్పిన పది సీట్లలో ఉమ్మడి జిల్లాలోని చెన్నూరు, ఆసిఫాబాద్‌ ఉన్నాయి.

 పొత్తుల అంశం త్వరగా తేలిస్తే రెండు పార్టీలు ఒక్కో సీటులో పోటీ చేసే అవకాశం ఉందని, పొత్తు విచ్ఛిన్నమైతే సీపీఐ, టీజేఎస్‌ కనీసం రెండేసి సీట్లలో పోటీ చేయడం ఖాయమని స్పష్టమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఆయా సీట్లలో ఇప్పటికే టికెట్లు ఖాయమని భావిస్తున్న నాయకులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా ఈనెల 9వ తేదీ తరువాత సీట్లను ప్రకటించనున్నట్లు చెప్పడంతో నాయకుల్లో టెన్షన్‌ పెరుగుతోంది. అదే సమయంలో సీపీఐ, టీజేఎస్‌ ఆశావహుల్లో కొత్త ఊపిరి వచ్చినట్లయింది. 

తొలినుంచి సీపీఐ రెండు సీట్లపై కన్ను
బెల్లంపల్లితో పాటు సింగరేణి కార్మిక కుటుంబాల ఓట్లు అధికంగా ఉన్న మంచిర్యాల నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సీపీఐ తొలి నుంచీ భావిస్తోంది. నాలుగు సీట్లకు పరిమితమైతే బెల్లంపల్లి లేదా మంచిర్యాలలో ఒక దగ్గరి నుంచి పోటీ చేయాలని ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే సీపీఐ, టీజేఎస్‌ రెండింటికి కలిపి 10 సీట్లు మాత్రమే దక్కుతాయని పీసీసీ అధ్యక్షుడు స్పష్టం చేయడంతో రెండు పార్టీల నేతల తలలు గిర్రున తిరుగాయి. టీడీపీకి 14 సీట్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్‌ ఈ రెండు పార్టీలను పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తుండడంతో చాడ వెంకటరెడ్డి సోమవారం ‘ప్లాన్‌–బి’ అంశాన్ని తెరపైకి తెచ్చారు. తాము అడిగినన్ని సీట్లు ఇవ్వకపోతే తొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు.

 అందులో  మంచిర్యా ల, బెల్లంపల్లి ఉన్నట్లు స్పష్టం చేశారు. మంచిర్యాలలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, గడ్డం అరవింద్‌రెడ్డి టికెట్ల వేటలో ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. ప్రేంసాగర్‌రావుకు సీటు ఖరారైనట్లు ప్రచారం కూడా జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఈ సీటును కాంగ్రెస్‌ వదులుకొనే అవకాశమే లేదు. ఇక బెల్లంపల్లి సీటు విషయంలో కాంగ్రెస్‌ కూడా సానుకూలంగానే ఉంది. ఇక్కడ కాంగ్రెస్‌ నుంచి సీటు ఆశిస్తున్న నాయకుల సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ, పొత్తు ధర్మంలో వదులుకునేందుకు సిద్ధపడింది. అయితే ఇతర చోట్ల సీపీఐ అడుగుతున్న సీట్ల విషయంలో ఏకాభిప్రాయం లేక ప్లాన్‌–బి సీన్‌లోకి వచ్చింది. 

రెండు సీట్లపై టీజేఎస్‌ నజర్‌..చెన్నూరుపై పట్టు
టీజేఎస్‌ ఉమ్మడి ఆదిలాబాద్‌లోని చెన్నూరు, ఆసిఫాబాద్, ముథోల్‌ సీట్లను తొలుత తన జాబితాలో చేర్చింది. పొత్తుల చర్చల్లో చివరికి చెన్నూరు, ఆసిఫాబాద్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు సమాచారం. కాంగ్రెస్‌ నుంచి ఆసిఫాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు సీటు ఖాయం కాగా, చెన్నూరు నుంచి బోర్లకుంట వెంకటేష్‌ నేత, మాజీ మంత్రి బోడ జనార్ధన్‌ పోటీ పడ్డారు. వీరిలో వెంకటేష్‌ నేత పేరు దాదాపు ఖరారైనట్లు పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. వెంకటేష్‌ సైతం టీఆర్‌ఎస్‌ అసంతృప్త నేతలను కాంగ్రెస్‌లోకి చేర్పించుకోవడం, బస్తీలు, గ్రామాల్లో కుల సంఘాలు, పెద్ద మనుషులతో భేటీ కావడం వంటి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో చెన్నూరుపై కోదండరామ్‌ పట్టుపట్టడం కాంగ్రెస్‌ వర్గాలను ఆందోళనకు గురిచేసింది. తాజాగా కోదండరామ్‌ కూటమి నుంచే పది సీట్లలో పోటీ చేస్తామని, అవసరమైతే మరో రెండు అదనంగా కోరుతామని చెప్పడం కాంగ్రెస్‌ నాయకులకు మింగుడు పడడంలేదు. పొత్తులో ఆయా పార్టీలు పోటీ చేసినా, కాంగ్రెస్‌ నుంచి రెబల్‌ కచ్చితంగా బరిలో నిలిచే అవకాశం చెన్నూరులో ఉంది. 

పొత్తు విచ్ఛిన్నమైతే....
కూటమిలో సీట్ల సర్ధుబాటు కొలిక్కిరాక పొత్తు విచ్ఛిన్నమైతే కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ వేర్వేరుగానే పోటీ చేసే అవకాశం ఉంది. అప్పుడు సీపీఐ మంచిర్యాల, బెల్లంపల్లిలో బరిలో నిలుస్తుంది. టీజేఎస్‌ చెన్నూరు, ఆసిఫాబాద్, ముథోల్‌లో పోటీ చేసే అవకాశం ఉంది. ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌   బలంగా ఉన్న నేపథ్యంలో సీపీఐ, టీజేఎస్‌ ఏమాత్రం పోటీ ఇస్తాయనేది చర్చనీయాంశంగా మారింది. పొత్తు విచ్ఛిన్నమై విడివిడిగా పోటీ చేస్తే కాంగ్రెస్‌కు కూడా నష్టమే. ఈ నేపథ్యంలో దీపావళి తరువాత ఏం జరుగుతుందోనని ఉమ్మడి జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. 9వ తారీఖులోగా పొత్తులు కుదరకపోతే మాత్రం పరిస్థితి వేరేలా ఉంటుందని ఆయా పార్టీల నాయకులు భావిస్తున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top