2 ఎంపీ సీట్లలో పోటీ 

The CPI state executive meeting was held in Makhdoom Bhavan - Sakshi

సీపీఐ నిర్ణయం

 సీపీఎంతో కలసి పోటీచేసేందుకు సంసిద్ధత 

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం/మహబూబాబాద్, నల్లగొండ/భువనగిరి నియోజకవర్గాల్లో ఏవైనా రెండింటిలో పోటీచేయాలని సీపీఐ నిర్ణయించింది. సోమ వారమిక్కడి మఖ్దూంభవన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. అసెంబ్లీ ఎన్నిక ల అనంతరం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని ప్రజాఫ్రంట్‌ ప్రశ్నార్థకంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో వామపక్షాల ఐక్యతపై దృష్టిపెట్టాలని నిర్ణయించింది.

ఇందులో భాగంగా సీపీఎంతో కలిసి పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అయి తే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌) పేరిట తీసుకొచ్చిన ప్రయోగాన్ని పక్కనపెడితేనే సీపీఎంతో కలిసి పోటీ చేయాలని యోచిస్తోంది. సీపీఎం కలిసొస్తే తా ము ఎంపిక చేసిన నాలుగు సీట్లలో చెరో రెండింటితో పోటీ చేయొచ్చనే సంకేతాలిచ్చింది. బీజేపీ విషయంలో జనసేన పార్టీ కూడా స్పష్టమైన వ్యతిరేక వైఖరి తీసుకుంటేనే ఏపీతో పాటు తెలంగాణలోనూ ఆ పార్టీతో అవగాహన కుదుర్చుకోవాలని నిర్ణయం తీసుకుంది. 

మోదీవి జిమ్మిక్కులు: సురవరం 
లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి భయంతోనే నరేంద్ర మోదీ ప్రభుత్వం వివిధవర్గాలకు రాయితీలు, ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు తదితరాలతో ఎన్నికల జిమ్మిక్కులు చేస్తోందని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు లౌకిక, ప్రజాతంత్ర, వామపక్ష శక్తులతో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ఎన్‌.జ్యోతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సురవరం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈబీసీ బిల్లుకు తాము వ్యతిరేకం కాకపోయినా ప్రవేశపెట్టిన తీరు సరిగ్గా లేదన్నారు. అసంఘటితరంగానికి ఇచ్చిన హామీలు, రైతులకిచ్చే ధనసహాయం, ఐటీ వెసులుబాటు వంటి వాటిలో ఎన్నో మెలికలున్నాయని.. వీటి వల్ల ప్రజలకు పెద్దగా ప్రయోజనంఉండదన్నారు.

కేబినెట్‌ లేకుండా పాలనా?: చాడ 
పూర్తిస్థాయి కేబినెట్‌ విస్తరణ లేకుండానే రాష్ట్రం లో పాలన ఎలా సాగుతోందని సీపీఐ కార్యద ర్శి చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర చరిత్రలోనే ‘ఒకేఒక్కడు’అన్న చందంగా సాగుతున్న ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదన్నారు. యాగా లు–యజ్ఞాలు చేస్తూ గుళ్లు, గోపురాలు కట్టిస్తూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టుల కోసం కొత్తగా రూ.75వేల కోట్లు అప్పులు చేస్తున్నారన్నారు. కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి వచ్చాక మరింత మొండిగా వ్యవహరిస్తూ, ప్రజలకోసం పనిచేసే అధికారులను బదిలీ చేస్తున్నారని ఆరోపించారు. పంచా యతీ ఎన్నికల్లో రూ.వేలకోట్ల మేర ధనప్రవాహం జరిగిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నూ సీపీఐ సొంతంగా 75 సర్పంచ్‌ పదవులను గెలుచుకుందన్నారు. సమావేశంలో పార్టీ నేతలు అజీజ్‌ పాషా, వెంకటరెడ్డి పాల్గొన్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top