2 లేదా 3 స్థానాల్లో పోటీ

CPI contest for Telangana, AP 2 or 3 seats - Sakshi

తెలంగాణ, ఏపీల్లో 2 లేదా 3 సీట్ల చొప్పున సీపీఐ పోటీ

రెండు రాష్ట్రాల్లోనూ సీపీఎం, జనసేనతో కలసి బరిలోకి

జాతీయ కార్యవర్గ భేటీలో సీపీఐ నిర్ణయం  

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో 2 లేదా 3 సీట్ల చొప్పున పోటీ చేయాలని సీపీఐ జాతీయ నాయకత్వం నిర్ణయించింది. తెలంగాణలోని భువనగిరి, మహబూబాబాద్, ఖమ్మం నియోజకవర్గాల్లో, ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, అనంతపురం, గుంటూరు స్థానాల్లో ఏవైనా రెండు లేదా మూడు స్థానాల్లో పోటీ చేయాలని తీర్మానించింది. తెలంగాణ, ఏపీలో సీపీఐ, సీపీఎం, జనసేన కలసి బరిలో దిగాలని బుధ, గురువారాల్లో ఢిల్లీలో జరిగిన జాతీయ కార్యవర్గ భేటీలో నిర్ణయించినట్టు సమాచారం. కేరళ లో సీపీఎంతో, తమిళనాడులో డీఎంకేతో, ఒడిశాలో కాంగ్రెస్‌తో పొత్తులకు సీపీఐ నాయక త్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. గుజరాత్, మహారాష్ట్ర రాజస్తాన్, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో ఒంటరిగా పోటీచేయాలని తీర్మానించింది.  

బీజేపీ ఓటమే ధ్యేయంగా... 
వచ్చే ఎన్నికల్లో అధికార బీజేపీ ఓటమే ధ్యేయం గా పనిచేయాలని, ఆ దిశగా వివిధ రాష్ట్రాల్లో కలసి వచ్చే పార్టీలతో పొత్తులు పెట్టుకుని పోటీ చేయాలన్న ప్రతిపాదనలకు ఈ భేటీలో ఆమోదం లభించింది. తెలంగాణలో రెండు దఫాలుగా సీపీఎంతో జరిపిన చర్చల సారాంశాన్ని జాతీయ నాయకత్వానికి రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తెలియజేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఎల్‌ఎఫ్‌ ఎజెండాను సీపీఎం కొనసాగించడంపై తమకున్న అభ్యంతరాలు వెల్లడించినట్టు తెలిసింది. టీఆర్‌ఎస్‌ వ్యతిరేక వైఖరిని సీపీఎం తీసుకోకపోవడం, రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లకు పోటీచేయాలనే తలంపుతో ఆ పార్టీ ఉండటం తదితర అంశాల గురించి ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఏపీలో సీపీఐ, సీపీఎం, జనసేనల మధ్య అవగాహన కుదిరిన విధంగానే, తెలంగాణలోనూ ఈ మూడు పార్టీలు సీట్లు సర్దుబాటు చేసుకునేలా చూడాలని జాతీయ నాయకత్వం సూచించినట్టు సమాచారం. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top