కమ్యూనిస్టుల పొత్తు ఖరారు

CPI And CPM forge understanding to fight 4 LS seats in Telangana - Sakshi

చెరో రెండు సీట్లలో పోటీకి సై  

మహబూబాబాద్,భువనగిరి నుంచి సీపీఐ 

నల్లగొండ, ఖమ్మం నుంచి సీపీఎం 

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి సీపీఐ,సీపీఎంల మధ్య పొత్తు ఖరారైంది. భువనగిరి, మహబూబాబాద్‌ (ఎస్టీ) స్థానాల నుంచి సీపీఐ, నల్లగొం డ, ఖమ్మం నియోజకవర్గాల నుంచి సీపీఎం పోటీ చేయనున్నాయి. మిగిలిన 13 లోక్‌సభ స్థానాల్లో ఆయా పార్టీల ఆలోచనలకు అనుగుణంగా ఇతర పార్టీల అభ్యర్థులకు మద్దతునిచ్చేలా నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాయి. మఖ్దూంభవన్‌లో మంగళవారం చాడవెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు (సీపీఐ), తమ్మినేని వీరభద్రం, చెరుపల్లి సీతారాములు, డీజీ నరసింహారావు (సీపీఎం) పాల్గొన్న ఇరుపార్టీల సమన్వయ కమిటీ సమావేశం లో ఈ మేరకు అంగీకారం కుదిరింది.  

టీఆర్‌ఎస్‌ ఓటమే లక్ష్యంగా... 
ఎన్నికల్లో టీఆర్‌ఎస్, బీజేపీల ఓటమి లక్ష్యంగా పనిచేయాలని సీపీఐ పట్టుబట్టగా సీపీఎం అంగీకరించింది. బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌) ప్రసక్తి తీసు కొస్తే పొత్తు కుదరదని సీపీఐ చెప్పడంతో సీపీఎం ఆ అంశాన్ని పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. సీపీఎం జాతీయ నాయకత్వం సూచనల మేరకే ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సోమవారం జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో నాయకత్వ సూచనలను సీనియర్‌ నేత బీవీ రాఘవులు రాష్ట్ర నేతలకు వెల్లడించినట్టు తెలుస్తోంది.  

పోటీకి తమ్మినేని, జూలకంటి విముఖత 
ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి పార్టీ కార్యదర్శి తమ్మి నేని వీరభద్రంని పోటీ చేయించాలని సమావేశంలో పలువురు ప్రతిపాదించినట్టు సమాచారం. అయితే ఆయన ఆసక్తి చూపకపోవడంతో పోతినేని సుదర్శన్, నున్నా నాగేశ్వరరావు పేర్లను పార్టీ పరిశీలించింది. చివరకు సుదర్శన్‌ను పోటీ చేయించడంపై మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. నల్లగొండ నుంచి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి æపేరును సీపీఎం నాయకత్వం పరిగణనలోకి తీసుకున్నప్పటికీ ఇటీవ లి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఉన్నందున లోక్‌సభ కు పోటీ విషయంలో ఆయన విముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీంతో తెలంగాణ సాయుధపోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కోడలు, ఐద్వా నాయకురా లు మల్లు లక్ష్మితో పాటు జిల్లా కార్యదర్శి సుధాకరరెడ్డి పేర్లను పరిశీలించి చివరికి లక్ష్మిపేరు ఖరారు చేసింది. భువనగిరి నియోజకవర్గం నుంచి పార్టీ సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, మహబూబాబాద్‌ (ఎస్టీ) స్థానం నుంచి కుంజా శ్రీనివాసరావుల ను పోటీ చేయించాలని సీపీఐ నిర్ణయించింది. 

పొత్తును స్వాగతిస్తున్నాం: బీఎల్‌ఎఫ్‌ 
తెలంగాణలో వామపక్షాల మధ్య ఐక్యత ఏర్పడటం శుభపరిణామమని, ఆ రెండు పార్టీల మధ్య పొత్తును స్వాగతిస్తున్నట్టు బీఎల్‌ఎఫ్‌ ప్రకటించింది. ఖమ్మం, నల్లగొండ, మహబూబాబాద్, భువనగిరి లోక్‌సభ స్థానాల్లో సీపీఐ, సీపీఎంలకు మద్దతు తెలుపుతున్న ట్టు పేర్కొంది. ఈ 4 సీట్లలో మినహా మిగతా అన్నిస్థానాల్లోనూ తమ అభ్యర్థులను ప్రకటించనున్నట్టు బీఎల్‌ఎఫ్‌ చైర్మన్‌ నల్లా సూర్యప్రకాష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్‌ఎస్, కాం గ్రెస్‌ల ఓటమికి కలిసొచ్చే అన్ని రాజకీయ, సామాజికశక్తులతో కలసి ఎన్నికల్లో పాల్గొంటామన్నారు. దేశంలో సామాజిక, ఆర్థిక దోపిడీ రాజకీయాలను దూరం చేసి ప్రజలకు ప్రజాస్వామిక పాలన అందించేందుకు వామపక్షాలు, ఇతర సామాజిక శక్తులు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top