కరోనా ఫియర్‌.. షహర్‌ ఢమాల్‌

COVID 19 Effects on Hyderabad Hotels And Malls Cinema Halls - Sakshi

నగర మార్కెట్లను తాకిన కోవిడ్‌ భయం

జనం లేక వెలవెలబోతున్న మాల్స్‌

భారీగా తగ్గిన వ్యాపార లావాదేవీలు  

పక్షం రోజులుగా సుమారు రూ.100 కోట్ల సేల్స్‌ తగ్గిన వైనం

హోటళ్లు, సినిమా థియేటర్లు, పార్కులదీ అదే పరిస్థితి

రోజురోజుకు పెరుగుతున్న తీవ్రత

కొంతమేర పెరిగిన ఆన్‌లైన్‌ సేల్స్‌

ప్రపంచాన్ని వణికిస్తున్న ‘కోవిడ్‌’ భయం గ్రేటర్‌నూ తాకింది. కొద్దిరోజులుగా కరోనా వైరస్‌భయంతో అన్ని రకాల వ్యాపారాలుపడిపోయాయి. షాపింగ్‌ మాల్స్, సినిమా హాళ్లు, వినోదం పంచే పార్కులు, హోటళ్లు
వెలవెలబోతున్నాయి.  గ్రేటర్‌లోని శరత్‌ క్యాపిటల్, సిటీ సెంటర్, జీవీకే ఒన్, సెంట్రల్, సుజనా ఫోరం, మెట్రో మాల్స్, ఐమాక్స్, థియేటర్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఎప్పుడూ కళకళలాడేఐటీ జోన్‌ పలచబడుతోంది. పక్షం రోజుల్లోహైదరాబాద్‌ నగరంలో దాదాపు రూ.100 కోట్ల వ్యాపారం తగ్గినట్లుగా అంచనా వేస్తున్నారు. రహదారులపై రద్దీ సైతం తగ్గింది. వైరస్‌భయంతో బయటకు రావాలంటేనే జనంజంకుతున్నారు. ఈ నేపథ్యంలో కొంతమేర ఆన్‌లైన్‌ బిజినెస్‌ పెరిగినట్లుగా తెలుస్తోంది. కరోనా ఎఫెక్ట్‌పై సాక్షి నిర్వహించిన పరిశీలనలో పలు అంశాలువెల్లడయ్యాయి. 

సాక్షి, సిటీబ్యూరో/హిమాయత్‌నగర్‌/ గచ్చిబౌలి/లక్డికాపూల్‌: కోవిడ్‌ ఎఫెక్ట్‌ నేపథ్యంలో రాజధాని గ్రేటర్‌ నగరంలో మాల్స్‌.. సినిమా హాళ్లు, ఫుడ్‌కోర్టులకు గిరాకీఅమాంతం పడిపోయింది. అగ్గిపుల్ల.. సబ్బు
బిల్ల.. దుస్తులు.. షూజ్‌.. నిత్యావసరాలు ఇలా ఏదైనా వస్తువు కొనుగోలుకు సూపర్‌మార్కెట్స్, మాల్స్‌ను ఆశ్రయించే గ్రేటర్‌ సిటీజన్లు జనసంచారం అధికంగా ఉండేప్రాంతాలకు జట్టుగా వెళ్లేందుకు
జంకుతున్నారు. దీంతో ఆన్‌లైన్‌ సేల్స్‌ ఊపందుకున్నాయి. మరోవైపు చైనా నుంచి దిగుమతి అయ్యే పలు ప్లాస్టిక్‌ తదితర వస్తువులను విక్రయించే చైనీస్‌ స్టోర్లకు వెళ్లే వారు సైతంగణనీయంగా తగ్గడం గమనార్హం. కాగా రాజధాని గ్రేటర్‌ నగరంలో పక్షం రోజులుగా సుమారు రూ.100 కోట్ల మేర మాల్స్‌ వ్యాపారం తగ్గినట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు మాల్స్, హోటళ్లు, సినిమా థియేటర్లకు గిరాకీ అమాంతం పడిపోయింది. ఈ పరిస్థితిపై శుక్రవారం ‘సాక్షి’ బృందం నగరంలోక్షేత్రస్థాయిలో పరిశీలించి తాజాపరిస్థితిని అక్షర నిక్షిప్తం చేసింది.

మాల్స్‌వైపు వెళ్లాలంటే భయం
ప్రతీ చిన్న వస్తువు కొనుగోలుకు మాల్‌ను ఆశ్రయించే గ్రేటర్‌ సిటీజన్లు ఇప్పుడు కోవిడ్‌ కలకలం నేపథ్యంలో ట్రెండ్‌ మార్చారు. ఈ పరిణామంతో నగరంలోని ముఖ్యప్రాంతాల్లో నెలకొన్న సుమారు 100 మాల్స్‌ జనం తాకిడి లేక బోసిపోయాయి. వీటిల్లో పక్షం రోజులుగా వంద కోట్ల మేర అమ్మకాలు తగ్గినట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామంతో ఆన్‌లైన్‌ సేల్స్‌ క్రమంగా ఊపందుకుంటున్నాయి. నచ్చిన వస్తువును ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడంలో గ్రేటర్‌ సిటీజన్లు ముందుంటున్నారు. స్మార్ట్‌ జనరేషన్‌గా మారుతున్న కుర్రకారు ఈ విషయంలో అగ్రభాగాన నిలుస్తుండటం విశేషం. ప్రధానంగా 18–45 వయోగ్రూపుల మధ్యనున్న యువతరం, మధ్య వయస్కుల్లో సుమారు 90 శాతం ఆన్‌లైన్‌ కొనుగోళ్లకే మక్కువ చూపుతున్నట్లు ఆసోచామ్‌ తాజా అధ్యయనంలోనూ వెల్లడైంది. ఇక స్మార్ట్‌ఫోన్‌ వినియోగంతో ఆన్‌లైన్‌లో వస్తువులు కొనేవారి సంఖ్య ఏటేటా పెరుగుతూ వస్తోందని అసోచామ్‌ పేర్కొంది. ఆన్‌లైన్‌ మాధ్యమం ద్వారా పలువురు నెటిజన్ల అభిప్రాయాలను సేకరించి అధ్యయన వివరాలను వెల్లడించింది. పదిహేను రోజులుగా సుమారు 15 మెట్రో నగరాల్లో ఆన్‌లైన్‌ ఈ కామర్స్‌ డీల్స్‌ సుమారు 30 వేల కోట్ల మేర జరిగినట్లు అంచనా వేయడం విశేషం. ఇక ఆన్‌లైన్‌ కొనుగోళ్లు పెరగడానికి అందరికీ హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ అందుబాటులోకి రావడమే కారణమని అసోచామ్‌ పేర్కొంది. దేశంలో పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్‌ వినియోగం ఈ కామర్స్‌ ఇండస్ట్రీకి ఊతమిచ్చిందని ఈ సర్వే పేర్కొంది. 

ఐమ్యాక్స్‌కు తాకిన కరోనా సెగ..
ప్రసాద్‌ ఐమ్యాక్స్‌ నిత్యం కిటకిటలాడుతుండేది. ఓ వైపు ఇంటర్‌ పరీక్షలు, మరోవైపు కరోనా ఎఫెక్ట్‌ కారణంగా సందర్శకుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ప్రసాద్‌ ఐమ్యాక్స్‌లో ఉన్న ఆరు స్క్రీన్‌లు, బిగ్‌ స్క్రీన్‌పై సినిమాలను వీక్షేందుకు వచ్చే వారి సంఖ్య సోమవారం నుంచి శుక్రవారం వరకు 8వేల నుంచి 10వేలు. శని, ఆదివారాల్లో 10వేల నుంచి 12వేలు. కరోనా, ఇంటర్‌ పరీక్షల కారణంగా 5వేల నుంచి 6వేల మంది, శని, ఆదివారాల్లో 6వేల నుంచి 8వేల మంది వస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. 

వినోదం హుష్‌..
సిటీలో ప్రతిరోజూ సినిమా చూసే వారి సంఖ్యలో లక్షల్లో ఉంటుంది. ఎక్కడైతే ఎక్కువ మంది ఉంటారో.. ఆ ప్రాంతంలో దగ్గు, జలుబు, తుమ్ములు లాంటివి వ్యాపిస్తే దాని కారణంగా కరోనా వైరస్‌ వ్యాపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈక్రమంలో ప్రేక్షకుడు తనకు నచ్చిన సినిమాను చూసేందుకు వెనకడుగు వేస్తున్నాడు. సినిమాకు చిరునామాగా మారిన ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో దేవి, సుదర్శన్, సంధ్య–70, సంధ్య–35 థియేటర్లు వినోదానికి నోచుకోవడం లేదు. శని, ఆదివారాల్లో సినిమా చూసేందుకు వేలల్లో వస్తుండేవారు. పది రోజులుగా ఈ థియేటర్లలో ప్రేక్షకులు వందలకే పరిమితం అయ్యారు. 

సినిమాపై కరోనా ఎఫెక్ట్‌..  
సోమవారం నుంచి శుక్రవారం వరకు యావరేజ్‌గా నడిచే థియేటర్లు ఇప్పుడు 20శాతానికి పడిపోయాయి. శని, ఆదివారాల్లో ఓ పది శాతం మాత్రం పెరుగుతున్నారు. కరోనా ఎఫెక్ట్‌ సినిమాలపై బాగా పడింది. క్లాస్‌ పీపుల్‌ ఎవరూ సినిమాకు రావడం లేదు. థియేటర్‌ లోని క్యాంటిన్లు మామూలు రోజుల్లో వారానికి రూ.6 వేల నుంచి రూ.7 వేలు సంపాదించుకునేవారు ఇప్పుడు రూ.1,000 రావడం కష్టంగా ఉంది.
– ఎల్‌.మధుసూదనరావు, సంధ్య–35 మేనేజర్,ఆర్టీసీ క్రాస్‌రోడ్డు

సందడిలేని శిల్పారామం
శిల్పారామానికి కరోనా ఎఫెక్ట్‌ తప్పడం లేదు. జన సంచారం ఉన్న చోట ఉండటం ఆరోగ్యానికి మంచిది కాదనే ప్రచారం జరగడంతో శిల్పారామానికి సందర్శకుల తాకిడి తగ్గింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు సగటున రెండు వేల మంది సందర్శకులు వచ్చేవారు. వారి సంఖ్య వెయ్యికి పడిపోయింది. వీకెండ్‌లో దాదాపు 5 వేల మంది వస్తుండగా కేవలం 3 వేల మంది మాత్రమే వస్తున్నారు. సందర్శకుల
సంఖ్య తగ్గడంతో చేతివృత్తి కళాకారులు వ్యాపారం తగ్గిందని అంటున్నారు.

లుంబిని పార్కు బోసిపోయె..
ట్యాంక్‌బండ్‌ లుంబిని పార్క్‌కి దేశంలో మంచి క్రేజ్‌ ఉంది. అటువంటి క్రేజ్‌ ఉన్న లుంబిని పార్కు కరోనా దెబ్బకు వెలవెలబోతోంది. సందర్శకుల తాకిడి లేక అగమ్యగోచరంగా ఉంది. పార్కుని చూసేందుకు సోమవారం నుంచి శుక్రవారం వరకు వచ్చే వారి సంఖ్య 4వేల నుంచి 5వేల మధ్యలో ఉండేది. శని, ఆదివారాల్లో 7వేల నుంచి 8వేల మంది వస్తుండేవారు. పది రోజులుగా కరోనా దెబ్బకు రోజు వారి సంఖ్య 2వేలకు పరిమితమైంది. బుద్దుడిని చూసేందుకు బోటు ఎక్కే సందర్శకుల సంఖ్య సైతం తగ్గుముఖం పట్టింది.

ఆన్‌లైన్‌లోఏం కొంటున్నారంటే..
మొన్నటి వరకు మొబైల్స్, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, దుస్తులు, బ్రాండెడ్‌ షూజ్, ఆభరణాలు, పెర్‌ఫ్యూమ్స్, గృహోపకరణాలు తదితరాలను ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిన సిటీజన్లు ఇప్పుడు నిత్యావసరాలను సైతం ఆన్‌లైన్‌లోనే ఒక్క క్లిక్‌తో ఆర్డర్‌ వేస్తుండటం గమనార్హం. ప్రధానంగా మొబైల్స్, ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్లను 78 శాతం మేర కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం.

మటన్‌ మస్త్‌ జోష్‌
చికెన్‌ బిర్యానీ అమ్మకాలు, తినే వారి సంఖ్య పడిపోవడంతో.. అందరూ మటన్‌కు ప్రిఫర్‌ చేస్తున్నారు. రెస్టారెంట్‌కు వెళ్లి చికెన్‌ బిర్యాని బదులు మటన్‌ బిర్యానీ తింటున్నారు. మునుపెన్నడూ మటన్‌ బిర్యానీ తినని వారు సైతం చికెన్‌ బిర్యానీ ఇష్టం లేక మటన్‌ బిర్యానీని ఆస్వాదిస్తున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు బావర్చి, ఆస్టోరియా రెస్టారెంట్‌లలో 6వేల నుంచి 8వేల మంది తినేవారు. ఆదివారం ఒక్కరోజు 8వేల నుంచి 11వేల మంది వరకు ఉండటం గమనార్హం. చికెన్‌ కుదేల్‌ కావడంతో మటన్‌కు జై కొడుతున్నారు ఫుడ్డీస్‌.!

ఐటీ కారిడార్‌ పరిధిలో..
మైండ్‌స్పేస్‌లో కరోనా అనుమానితురాలు ఉందనే విషయం బయటకు రావడంతో ఐటీ కారిడార్‌లో కరోనా ఎఫెక్ట్‌ కనిపిస్తోందని పలువురు పేర్కొంటున్నారు. కరోనా నేపథ్యంలో కొత్తగూడలోని శరత్‌సిటీ క్యాపిటల్‌ మాల్, మాదాపూర్‌లోని శిల్పారామంలో ‘సాక్షి’ స్పెషల్‌ విజిట్‌ నిర్వహించింది. విజటర్స్‌ సంఖ్య గణనీయంగా తగ్గిడంతో వ్యాపారం 30 శాతం తగ్గిందని పలువురు వ్యాపారులు పేర్కొంటున్నారు. 

ప్రధాన నగరంలో ఇలా..
పంజగుట్ట, బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.1లోని షాపింగ్‌ మాల్స్‌ మార్కెట్‌ సగానికి సగం పడిపోయింది. ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 10.30గంటల వరకు జనసందోహంతో కళకళలాడిపోయే హైదరాబాద్‌ సెంట్రల్‌ మాల్, జీవీకే వన్, సిటీ సెంట్రల్‌ మాల్స్‌ బోసిపోతున్నాయి. గతంలో వేల సంఖ్యలో వచ్చే కస్టమర్లు ఇప్పడు పదుల సంఖ్యలో వస్తున్నారు. సిటీ సెంట్రల్‌. జీవీకే వన్‌ మాల్స్‌లలో కూడా పరిస్థితి దారుణంగా తయారైంది. కరోనా వ్యాధి దగ్గు నుంచి ఇతరులకు సోకుతుందనే కారణంగా నగరవాసులు షాపింగ్‌ మాల్స్, థియేటర్లు, రెస్టారెంట్లకు దూరంగా ఉంటున్నారు. సెంట్రల్‌ మాల్‌లోని పీవీఆర్‌ థియేటర్ల ముఖం చూడలేదని అక్కడి సిబ్బంది పేర్కొనడం గమనార్హం. జీవీకే వన్‌లో కూడా ఇదే పరిస్థితి ఉందని ఉద్యోగులు చెబుతున్నారు. 

చైనీస్‌ స్టోర్లా.. నో.. నో..
నగరంలో గృహ అవసరాలకు వినియోగించే పలు ప్లాస్టిక్‌ వస్తువులను విక్రయించే చైనాబజార్లు, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు, విడిభాగాలు విక్రయించే స్టోర్లకు వెళ్లేందుకు సైతం గ్రేటర్‌ సిటీజన్లు జంకుతున్నారు. నగరంలోని కూకట్‌పల్లి, అబిడ్స్, కోఠి తదితర ప్రాంతాల్లోని చైనీస్‌ స్టోర్లకు గిరాకీ పక్షం రోజులుగా గణనీయంగా పడిపోయినట్లు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. తమ వ్యాపారం 65 శాతానికి పైగా పడిపోయిందని వారు వాపోతున్నారు.

చికెన్‌ బిర్యానీ ఢమాల్‌..!
చికెన్‌ తింటే కరోనా వ్యాపిస్తుందని సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వార్తలకు నెటిజన్లు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో బిర్యానీకి ఫేమస్‌ అయిన ‘బావర్చి’, న్యూ ఆస్టోరియాలో చికెన్‌ బిర్యానీ తినేవారి సంఖ్య 40శాతానికి పడిపోయింది. బావర్చి రెస్టారెంట్‌లో సోమవారం నుంచి శుక్రవారం వరకు చికెన్‌ బిర్యానీ తినే వారి సంఖ్య 4వేల నుంచి 5వేల మధ్యలో ఉండేది. శని, ఆదివారాల్లో 6వేల నుంచి 7వేల మంది తినేవారు. కరోనా దెబ్బకు ఈ నెల మొదటి వారం నుంచి చికెన్‌ లవర్స్‌ చికెన్‌ను హేట్‌ చేస్తున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు చికెన్‌ తినే వారి సంఖ్య 2వేల నుంచి 3వేలల్లో ఉంది. 

ప్రభావం ఉంది..
కరోనా వల్ల ఏదో అయిపోతుందని చికెన్‌ బిర్యాని తినేందుకు నిరాకరిస్తున్నారు. దీనిపై తాము ఏమీ కాదని చెప్పినా పట్టించుకోవట్లేదు. ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ సైతం తగ్గుముఖం పట్టాయి. రెగ్యులర్‌గా వచ్చే వారు 40శాతానికి పడిపోయారు.– అలీ, బావర్చి హోటల్‌. ఆర్టీసీ క్రాస్‌రోడ్డు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top