సంక్షోభంలో కూరుకున్న దేశం

country is under crisis said chada venkat reddy - Sakshi

దనిక రాష్ట్రంలో రూ.లక్ష కోట్ల అప్పే మిగిలింది

ఎర్రజెండాలన్నీ ఏకం కావాలి  

టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా రాజకీయ పునరేకీకరణకు సీపీఐ కృషి

పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి  

ఖమ్మం (రూరల్‌) : దేశంలో ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అ«ధ్యక్షుడు అమిత్‌షాలు కుహనా రాజకీయాలకు పాల్పడుతున్నారని, ఫలితంగా దేశం అన్ని రంగాల్లో సంక్షోభంలో కూరుకుపోయి సామాన్యుడు జీవనం కొనపాగించే పరిస్థితి లేదని సీపీఐ రాష్ట్ర అధ్యక్షుడు చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని నాయుడుపేటలోని ఎల్లారెడ్డి ఫంక్షన్‌హాల్లో సీపీఐ 21వ జిల్లా మహాసభల సందర్భంగా జరిగిన ప్రతినిధుల సభలో చాడ ప్రారంభోపన్యాసం చేశారు. కమ్యూనిస్టు పార్టీ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిచిందని, అయితే సామ్రాజ్యవాద దేశాలు కమ్యూనిస్టు పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపారు. 2014 ఎన్నికల అనంతరం కేంద్రంలో మోదీ అధికారం చేపట్టిన తర్వాత ప్రజలకిచ్చిన హామీల్లో ఏఒక్కటీ నెరవేర్చలేదని, అందులో భాగంగా 100 రోజుల్లో విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తెస్తానన్న మోదీ 1500 రోజులైనా నయాపైసా తేలేదని విమర్శించారు.

పెద్దనోట్ల రద్దుతో సామాన్యులు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావని ఇప్పటికీ బ్యాంక్‌ల్లో నగదు కొరతతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా మోదీకి ఏమాత్రం పట్టడంలేదని విమర్శించారు. త్రిపురలో వామపక్ష కూటమికి ఉన్న ప్రజాదరణను చూసి తట్టుకోలేక కేంద్రంలోని బీజేపీ పక్షం మంత్రులు డబ్బు అధికార బలంతో వామపక్షాల ఓటమికి సర్వశక్తులు ఒడ్డుతోందని తెలిపారు. కానీ, ప్రజాభిమానం ముందు బీజేపీ గాలికి కొట్టుకుపోవడం ఖాయమన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వ విధానాలతో పండిన పంటలకు గిట్టుబాటు ధర లేక ఇప్పటికే 75 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఇక రాష్ట్రంలో కేసీఆర్‌ నియంతృత్వ పోకడలతో, ప్రజాకంటక పాలన సాగిస్తున్నారని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ కనీసం టీఆర్‌ఎస్‌ మంత్రులు ప్రజాసమస్యల గురించి మాట్లాడే స్వేచ్ఛ లేకుండా పోయిందని విమర్శించారు. ఈజీఎస్‌లో పనిచేసిన కూలీలకు సుమారు రూ.1,000 కోట్లు బకాయిలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉన్నా అవి ఇవ్వలేని దయనీయ పరిస్థితి నెలకొందని, ఇదేనా బంగారు తెలంగాణ? అని విమర్శించారు.

ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయలేని పరిస్థితి ఒక్క తెలంగాణలోని ఉందని ధనిక రాష్ట్రం అంటున్న తెలంగాణాకు రూ.లక్ష కోట్ల అప్పు ఎలా అయిందని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు రూ.22 వేల కోట్లు, మిషన్‌ భగీరథ పేరిట రూ.32 వేల కోట్లు అప్పులు తెచ్చిన ప్రభుత్వం ఈ నిధులతో ప్రజలకు వచ్చిన లాభం ఏంటో వివరించాలని నిలదీశారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారి గొంతు నొక్కేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఉద్యమాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో కనీసం ప్రజలు తమ బాధలు చెప్పుకోవడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని సీపీఐ శ్రేణులకు పిలుపునిచ్చారు. భవిష్యత్‌లో కమ్యూనిస్టు, ఎర్రజెండా పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని సూచించారు.

రాబోయే కాలంలో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ జరగాలని అందుకోసం సీపీఐ మిగతా వామపక్షాలను కలుపుకుని ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు. సభలో సీపీఐ సీనియర్‌ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు, రాష్ట్ర సహా య కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు ప్రసంగించారు. సీపీఐ నాయకులు ఎండీ మౌలానా, సలాం, డాక్టర్‌ గోర్కి, పాలేరు నియోజకవర్గ కార్యదర్శి దండి సురేశ్, మండల కార్యదర్శి పుచ్చకాయల సుధాకర్, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి సిద్ధినేని కర్ణకుమార్, మహిళా విభాగం నాయకురాలు పోటు కళావతి, ఎంపీపీ ఎం.లలిత తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top