డేంజర్‌ బెల్స్‌..!

Coronavirus Cases Rises in Suryapeta - Sakshi

తాజాగా మరొకరికి పాజిటివ్‌

మెరుగైన వైద్యసేవల నిమిత్తం హైదరాబాద్‌కు తరలింపు

పేటలో రెండుకు చేరిన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య

ఐసోలేషన్, క్వారంటైన్‌ కేంద్రాల్లో 120 మంది

కొత్త కేసుల నమోదుతో టెన్షన్‌.. టెన్షన్‌

రెడ్‌జోన్‌గా భగత్‌సింగ్‌నగర్‌

తాళ్లగడ్డ (సూర్యాపేట) : ‘పేట’ను కరోనా వైరస్‌ వణికిస్తోంది. కరోనా ప్రమాదం నుంచి బయట పడుతున్నామనుకునే లోపే కొత్త కేసులు నమోదై కలవరపెడుతున్నాయి. ఇప్పటివరకు ఢిల్లీ మర్కజ్‌లో జరిగిన సమావేశాలకు హాజరైన వారిలో కుడకుడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి పాజిటీవ్‌ అని తేలింది. అతని ద్వారా తాజాగా భగత్‌సింగ్‌నగర్‌లో నివాసముంటున్న మరో వ్యక్తికి వైరస్‌ సోకినట్లు తేలింది. జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం ఎదురుగా ఉన్న అపోలో మెడికల్‌ దుకాణంలో పనిచేసే వ్యక్తికి వైరస్‌ సోకింది. అయితే ఈ వ్యక్తి కరీంనగర్‌ నుంచి వచ్చిన బంధువులతో కలిసి ఓ ఫంక్షన్‌కు హాజరైనట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం 16మంది వ్యక్తుల రక్తనమూనాలు సేకరించి హైదరాబాద్‌కు తరలించారు. అయితే ఆదివారం వచ్చిన 16మంది వ్యక్తుల రిపోర్టుల్లో ఒకరికి కరోనా పాజిటీవ్‌ వచ్చినట్లు ప్రకటించారు. మిగతా 15మంది వ్యక్తులకు నెగెటివ్‌ వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో రెండో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు.

హైదరాబాద్‌కు తరలింపు
కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని జిల్లా వైద్య బృందం మెరుగైన వైద్య సేవల నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. ఆ ప్రాంతంలో కరోనా వైరస్‌ సోకిన వ్యక్తితో కలిసి తిరిగిన వారిని గుర్తించే పనిలో వైద్య సిబ్బంది నిమగ్నమయ్యారు. ఆదివారం వ్యక్తి కుటుంబ సభ్యులతో పాటు మరో 10మందికి పైగా గుర్తించి ప్రభుత్వ క్వారంటైన్‌లకు తరలించారు. వైరస్‌ సోకిన వ్యక్తి ఓ ఫంక్షన్‌కు కూడా హాజరైనట్లు సమాచారం ఉండడంతో అక్కడ ఎవరెవరిని కలిశారన్న దానిపై ఆరా తీస్తున్నారు.

హైపో క్లోరైడ్‌ ద్రావణం స్ప్రే
పట్టణంలోని భగత్‌సింగ్‌నగర్‌లో నివాసముంటున్న వ్యక్తికి కరోనా వైరస్‌ సోకడంతో ఆ ప్రాంతంలో హై పోక్లోరైడ్‌ ద్రావణాన్ని మున్సిపల్‌ కమిషనర్‌ పి. రామనుజులరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది స్ప్రే చేశారు. ఖమ్మం క్రాస్‌రోడ్డు నుంచి మొదలుకొని భగత్‌సింగ్‌నగర్‌లోని అన్ని కాలనీలు వీధుల్లో స్ప్రే చేయించారు.

120 మంది క్వారంటైన్‌లో..
సూర్యాపేట జిల్లా పరిధిలో కరోనా అనుమానితులను.. వివిధ విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు ఢిల్లీ మత ప్రార్థనలకు హాజరైన వారి సంబంధీకులు సుమారు 120 మందిని జిల్లా వైద్య బృంధం వివిధ రకాలుగా క్వారంటైన్‌ చేశారు. ఇమాంపేట గురుకుల పాఠశాల, చందన నర్సింగ్‌ కళాశాలలోని ప్రభుత్వ క్వారంటైన్‌తో పాటు ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డుల్లో , హోం క్వారంటైన్‌లో 140 మందికి పైగా ఉన్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. వీరికి వారం రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణ అనంతరం పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. కాగా ఢిల్లీ మర్కజ్‌ సమావేశాల నుంచి వచ్చిన 12మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని రక్త నమూనాలను హైదరాబాద్‌కు పంపించగా.. కుడకుడకు చెందిన ఓ వ్యక్తికి పాజిటీవ్‌ వచ్చింది. తాజాగా ఆ వ్యక్తిని ఫస్ట్‌ కాంటాక్టయిన అపోలో మెడికల్‌ దుకాణంలో పనిచేసే వ్యక్తికి వైరస్‌ సోకడం గమనార్హం. ఇంకా కొత్త కేసులు నమోదవుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది.

రెడ్‌జోన్‌లోకి భగత్‌సింగ్‌నగర్‌..
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కుడకుడలో ఓ వ్యక్తికి పాజిటీవ్‌ అనితేలడంతో రెడ్‌జోన్‌లోనే మూడంచెల పోలీసు భద్రత కొనసాగుతోంది. తాజాగా భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన వ్యక్తికి వైరస్‌ సోకడంతో పాజిటివ్‌ అని తేలడంతో ఆ ప్రాంతాన్ని  ఆదివారం సాయంత్రం సూర్యాపేట ఆర్డీఓ మోహన్‌రావు, సూర్యాపేట డీఎస్పీ మేకా నాగేశ్వరరావు, పట్టణ సీఐ శివశంకర్‌లు పరిశీలించారు. భగత్‌సింగ్‌నగర్‌ను రెడ్‌జోన్‌గా ప్రకటించినట్లు ఆర్డీఓ, డీఎస్పీ తెలిపారు. ఈ ప్రాంతంలో కూడా మూడంచెల పోలీసు భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రెడ్‌జోన్‌గా ప్రకటించడంతో ఆ ప్రాంతంలో పూర్తిస్థాయిలో వాహనాల రాకపోకలు నిలిపివేయనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. వీరి వెంట తహసిల్దార్‌ వెంకన్న, ఎస్‌ఐలు భిక్షపతి, పడిశాల శ్రీనివాస్, ఏడుకొండల్‌లు ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top