రోజూ 30 మందికి  కరోనా పరీక్షలు

Corona Virus Test In Hyderabad - Sakshi

గాంధీలో నేటి నుంచి పూర్తిస్థాయిలో..

10 గంటల్లోనే వ్యాధి నిర్ధారణ నివేదిక

19 మంది ఆస్పత్రుల్లో చేరిక..11 మందికి నెగిటివ్‌

వీరిలో ఇద్దరికి స్వైన్‌ఫ్లూ నిర్ధారణ..

రావాల్సి ఉన్న మరో ముగ్గురి అనుమానితుల రిపోర్టు

సాక్షి, హైదరాబాద్‌: ప్రాణాంతకమైన కరోనా వైరస్‌పై వైద్య ఆరోగ్యశాఖ మరింత అప్రమత్తమైంది. ఇప్పటికే గాంధీ, ఫీవర్, ఛాతీ, సరోజినిదేవి కంటి ఆస్పత్రుల్లో తాత్కాలికంగా 100 పడకలను ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్యశాఖ.. ఇకపై వ్యాధి నిర్ధారణ పరీక్షలను పూర్తిగా గాంధీ ఆస్పత్రి వైరాలజీ ల్యాబ్‌లోనే చేయనుంది. ట్రయల్‌రన్‌లో భాగంగా ఇప్పటికే పలు నమూనాలను పరీక్షించి పుణే వైరాలజీ ల్యా బ్‌ ఇచ్చిన తుది నివేదికతో పోల్చి చూశారు. రెండు ల్యాబుల్లోనూ ఒకే రకమైన రిపోర్టులు రావడం

తో పరీక్షలు గాంధీలోనే చేయా లని నిర్ణయించారు. సోమవారం నుంచి పూర్తి స్థాయి పరీక్షలు చేయనున్నారు. రోజుకు 30 మందికి పరీక్షలు చేసే సామర్థ్యం ఇక్కడ ఉంది. అంతే కాదు 10 గంటల్లోనే రిపోర్టులు రానుండటంతో రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి.

గాంధీ నుంచి మియాపూర్‌ వారి డిశ్చార్జ్‌.. 
చైనా నుంచి ఇటీవల నగరానికి చేరుకుని, కరోనా వైరస్‌ సోకిందేమోనన్న అనుమానంతో వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం గత నెల 28 నుంచి నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రిలో 18 మంది చేరారు. వీరిలో గోదావరిఖనికి చెందిన తండ్రి, కూతుళ్లకు స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. మొత్తం 10 మందికి నెగిటివ్‌ రిపోర్టు వచ్చింది. మరో 8 మంది బాధితులకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది.

ప్రస్తుతం వీరిని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్సలు అందిస్తున్నారు. 3 రోజుల క్రితం గాంధీలో చేరిన మియాపూర్‌కు చెందిన వ్యక్తి(39)కి సంబంధించిన వ్యాధి నిర్ధారణ పరీక్ష నెగిటివ్‌ రిపోర్టు రావడంతో వైద్యులు ఆయన్ను ఆదివారం డిశ్చార్జ్‌ చేశారు.

ఎన్‌–90 మాస్కులు ధరించాలి.. 
వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుని, రిపోర్టులో నెగిటివ్‌ అని తేలడంతో ఊపిరి పీల్చుకుని ఆయా ఆస్పత్రుల నుంచి ఇంటికి వెళ్లిపోయిన బాధితులకు వైద్యులు కీలక సూచనలు చేశారు. బాధితులు 20 రోజుల పాటు ఇంట్లో నుంచి బయటికి రావొద్దని సూచించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అనుమానిత బాధితులతోపాటు వారి కుటుంబ సభ్యులంతా ఎన్‌–90 మాస్కులు ధరించాల్సిందిగా సూచించారు.

ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, ఆలింగనాలను, షేక్‌హ్యాండ్‌లకు దూరంగా ఉండటం, సాధ్యమైనంత వరకు జన సమూహాల్లోకి వెళ్లకపోవడం, తుమ్మినా, దగ్గినా ముక్కుకు అడ్డుగా మాస్కులు పెట్టుకోవడం వల్ల వైరస్‌ల భారీన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

రెండో కేసు నమోదు.. 
ఉన్నత చదువులు, ఉపాధి అవకాశాల రీత్యా తెలుగు రాష్ట్రాల నుంచి చైనాకు వెళ్లిన వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. వారందరినీ స్వస్థలాలకు తిరిగి రావాల్సిందిగా బంధువులు, కుటుంబ సభ్యులు ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నారు. చైనాలో ఇప్పటికే 15వేల మంది ఈ వైరస్‌కు ప్రభావితం కాగా, 305 మంది చనిపోయారు. తాజాగా మన దేశంలోని కేరళలోనూ రెండో కరోనా వైరస్‌ కేసు నిర్ధారణ అయింది. దీంతో తెలుగు ప్రజల్లో మరింత ఆందోళన మొదలైంది. ప్రజల్లో నెలకొన్న ఈ భయాన్ని తొలగించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. వ్యాధి లక్షణాలు, వైరస్‌ వ్యాప్తికి కారణాలు, నియంత్రణ చర్యలపై విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top