‘కరోనా’ తగ్గాకే  పంపిస్తాం!

Corona Effect China Restrictions To Telangana Medical Students - Sakshi

భారత్‌కు చెందిన వైద్య విద్యార్థులపై చైనాలో ఆంక్షలు

వైరస్‌ పూర్తి నియంత్రణలోకి వచ్చాకే ఇండియా వెళ్లేందుకు అనుమతి

విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దన్న అధికారులు

కరోనా వైరస్‌ నియంత్రణ చర్యలపై కేంద్ర బృందం సంతృప్తి 

ఫీవర్‌ ఆస్పత్రి సహా విమానాశ్రయంలో ఏర్పాట్ల పరిశీలన

నేడు గాంధీ ఆస్పత్రి సందర్శన.. మంత్రి ఈటల ఉన్నతస్థాయి సమీక్ష  

సాక్షి, హైదరాబాద్‌ :  చైనాలో వైద్య విద్య అభ్యసిస్తున్న తెలంగాణ విద్యార్థులు ఇప్పటికిప్పుడు ఇండియా వెళ్లడానికి ఆ దేశం అంగీకరించడం లేదు. కరోనా వైరస్‌ నియంత్రణలోకి వచ్చాకే వెళ్లాలని ఆ దేశం ఆంక్షలు విధించింది. దీంతో భారత్‌లోని ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వైరస్‌ ఇతర దేశాలు, ప్రాంతాలకు వ్యాపిం చకుండా ఆ దేశం ఇటువంటి ఆంక్షలు విధించిందని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. అందువల్ల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చాయి. చైనాలో వేలాది మంది తెలంగాణకు చెందిన వైద్య విద్యార్థులు ఎంబీబీఎస్‌ చదువుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అందులో కొందరు ఆ దేశంలోని వుహాన్‌ నగరంలోనూ ఉన్నట్లు భావిస్తున్నారు. మొదటి సంవత్సరంలో చేరేందుకు గతేడాది ఆగస్ట్, సెప్టెంబర్‌ నెలల్లో వీరంతా అక్కడకు వెళ్లారు. వచ్చే నెల నుంచి వారికి నెలన్నరపాటు సెలవులు ఉంటాయి. ప్రస్తుతం కరోనా వైరస్‌ విజృంభించడంతో వారిలో చాలామంది ఇప్పుడే ఇండియాకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అక్కడి ప్రభుత్వం ఇప్పుడు పంపడానికి అంగీకరించడంలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలకు సమాచారం అందింది.

కేంద్ర బృందం సంతృప్తి..: రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాపించకుండా వైద్య ఆరోగ్యశాఖ చేపట్టిన చర్యలపై కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా వైరస్‌ నియంత్రణకు చేపట్టిన చర్యలను పరిశీలించేందుకు, అవసరమైన సలహాలు సూచనలు ఇచ్చేందుకు డాక్టర్‌ అనితా వర్మ, డాక్టర్‌ అజయ్‌ చౌహాన్, మైక్రోబయాలజిస్టు శుభాఘర్గ్‌లతో కూడిన ముగ్గురు సభ్యుల కేంద్ర బృందం మంగళవారం నగరంలోని ఫీవర్‌ ఆస్పత్రిని సందర్శించింది. ఆ తర్వాత విమానాశ్రయంలో ఉన్న స్క్రీనింగ్‌ ప్రక్రియను పరిశీలించింది. కరోనా వైరస్‌ నియంత్రణకు చేపట్టిన చర్యలు ప్రొటోకాల్‌ ప్రకారం సమగ్రంగానే ఉన్నాయని కేంద్ర బృందం భావించినట్లు వైద్య ఆరోగ్య వర్గాలు తెలిపాయి. నోడల్‌ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డులోని వైద్య సిబ్బందికి ఏ విధంగా శిక్షణ ఇచ్చారో అడిగి తెలుసుకుంది. అంతకుముందు కేంద్ర బృందం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సహా ఇతర అధికారులతో సమావేశమైంది. ఈ సందర్భంగా కేంద్ర బృందం కొన్ని సూచనలు ఇచ్చినట్లు తెలిసింది. ‘తాము కేవలం రాష్ట్ర సర్కారు చేపట్టిన చర్యలను పరిశీలించడానికే వచ్చాం.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన చెక్‌లిస్ట్‌ ప్రకారం ఏర్పాట్లు చేశారా లేదా పరిశీలించి కేంద్రానికి నివేదిస్తాం’అని వారు పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఫీవర్‌లో ఏర్పాట్లు బాగున్నాయని, అయినా కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో మరిన్ని వసతులు కల్పించాలని ఎయిర్‌పోర్టు రీజినల్‌ డైరెక్టర్‌ అనురాధ అన్నారు. కరోనా లక్షణాలున్న బాధితుల పరిస్థితి విషమంగా ఉంటే గాంధీకి తరలించాలని ఫీవర్‌ వైద్యులకు సూచించినట్లు తెలిపారు. కరోనా లక్షణాల కేసులు తాకిడి అధికంగా ఉంటే వైరస్‌ నిర్ధారణ పరీక్షలను హైదరాబాద్‌లోనే నిర్వహిస్తామని కేంద్ర బృందం తెలిపిందని ఫీవర్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.శంకర్‌ పేర్కొన్నారు. చైనా నుంచి వచ్చిన వారిలో ఎవరికైనా అనుమానంగా ఉంటే నేరుగా ఫీవర్‌ ఆస్పత్రికి వచ్చి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర బృందంతోపాటు ఆస్పత్రి సీఎస్‌ ఆర్‌ఎంవో డాక్టర్‌ పద్మజ, డిప్యూటీ ఆర్‌ఎంవో డాక్టర్‌ రేణుకా రాణి తదితరులు పాల్గొన్నారు.

మరో 3 అనుమానిత కేసులు
కరోనా వైరస్‌ నియంత్రణకు ఎటువంటి వైద్యం చేయాలన్న దానిపై అటు కేంద్ర బృందానికి గానీ, ఇటు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు గానీ స్పష్టత లేదని సమాచారం. అయితే స్వైన్‌ఫ్లూ వైరస్‌ కంటే ఇదేమీ పెద్దది కాదని ప్రజారోగ్య అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు. మంగళవారం తాజాగా చైనా నుంచి నగరానికి వచ్చిన ఓ వ్యక్తితోపాటు ఓ కుటుంబంలోని మరో ముగ్గురికి(భార్య(26), భర్త(31) కుమార్తె(4)) ఎయిర్‌పోర్టులో స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించగా కరోనా వైరస్‌ లేదని తేలింది. అయినా అనుమానంతో వారు ఫీవర్‌ చేరారు. వారిని కూడా ఐసోలేషన్‌ వార్డులో అబ్జర్వేషన్‌లో ఉంచాం. 

నేడు మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష..
కేంద్ర బృందం బుధవారం గాంధీ ఆస్పత్రిని సందర్శించి అక్కడ చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించనుంది. అనంతరం వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశమై తమ పరిశీలనలోకి వచ్చిన వివరాలను తెలియజేయనుంది. ఇక బుధవారం కరోనా వైరస్‌పై ప్రభుత్వం తీసుకుంటున్న ఏర్పాట్లపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. కరోనా వైరస్‌ తెలంగాణలో ఉన్నట్టు ఇంకా ఎలాంటి నిర్ధారణ కాలేదని మంత్రి ఈటల మంగళవారం ఓ ప్రకటనలో స్పష్టంచేశారు. వదంతులు నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ దీనిపై అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటోందన్నారు.

జాగ్రత్తలపై సర్కారు కరపత్రం..
కరోనా వైరస్‌ వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేరుతో ఒక కరపత్రాన్ని ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. అందులోని జాగ్రత్తలు ఏంటంటే..
– దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చేతి రుమాలు లేదా టవల్‌ను ముక్కు, నోటికి అడ్డంగా పెట్టుకోవాలి లేకుంటే మాస్క్‌ కట్టుకోవాలి. 
– తరచుగా చేతులను సబ్బుతో శుభ్రపరచుకోవాలి. జన సమూహం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వీలైనంత వరకు వెళ్లకూడదు. 
– గర్భిణీలు, బాలింతలు, పిల్లలు, వృద్ధులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు చలి ప్రదేశాల్లో తిరగకూడదు. 
– ఇతరులకు, అపరిచితులకు దూరంగా ఉండాలి. 
– వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలి. 
– సాధ్యమైనంత వరకు దూరప్రాంతాల ప్రయాణం వాయిదా వేసుకోవాలి. 
– పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి. 
– జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతిలో నొప్పి మొదలైన లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని వైద్యులను సంప్రదించాలి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top