‘నడిగడ్డ’లో కలకలం..!

Corona Cases Rising in Jogulamba Gadwal District - Sakshi

జోగుళాంబ గద్వాల జిల్లాలో కోరలు చాస్తున్న కరోనా  

ఒక్క రోజే తొమ్మిది మందికి పాజిటివ్, ఒకరి మృతి

మృతుడికి లోకల్‌ ట్రాన్స్‌మిషన్‌ ద్వారా సోకిన వైరస్‌

మహబూబ్‌నగర్‌ జిల్లాకేంద్రంలో మరో ముగ్గురికి పాజిటివ్‌

కరోనా బాధితుల్లో పాలమూరుకు చెందిన 23 రోజుల పసికందు

ఉమ్మడి జిల్లాలో 32కు చేరిన కరోనా బాధితులు

అప్రమత్తమైన ఆయా జిల్లాల యంత్రాంగం

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఉమ్మడి పాలమూరు పరిధిలోని జోగుళాంబ గద్వాల జిల్లాలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. ఇప్పటి వరకు 20 మందికి సోకిన ఈ వైరస్‌.. ఇద్దరి ప్రాణాలను బలిగొంది. వీరిలో మంగళవారం ఒక్క రోజే తొమ్మిది మందికి పాజిటివ్‌ రావడం.. వీరిలో ఒకరు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం కలకలం రేపింది. ఇటు మహబూబ్‌నగర్‌ జిల్లాలోనూ మంగళవారం కొత్తగా మూడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పదికి చేరింది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఐదు రోజుల నుంచి ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇప్పటి వరకు రెండు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 32కు చేరింది. రోజురోజుకూ పెరుగుతోన్న కరోనా పాజిటివ్‌ కేసులతో ఆయా జిల్లాల ప్రజల్లో ఆందోళన పెరిగింది. కరోనాతో చనిపోయిన ఇద్దరితో పాటు పాజిటివ్‌ కేసులు వచ్చిన 30 మందిలో 27మంది గత నెలలో ఢిల్లీలో జరిగిన ధార్మిక స¿దస్సుకు వెళ్లి వచ్చిన వారు, వారితో సన్నిహితంగా మెలిగిన వారున్నారు. మరోవైపు ఇప్పటి వరకు ఢిల్లీకి వెళ్లి వచ్చిన మొత్తం 127 మందిని గుర్తించిన అధికారులు వారిని, వారి కుటుంబసభ్యులను క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉంచి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం గద్వాల జిల్లా నుంచి 31, మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి 34 మంది శాంపిల్స్‌ను కారోనా నిర్ధారణ కేంద్రాలైన హైదరాబాద్‌లోని సీసీఎంబీ, ఐపీఎంలకు పంపారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 153 మందికి సంబంధించిన రిపోర్ట్స్‌ రావాల్సి ఉంది. 

గద్వాలలో హై అలర్ట్‌..
పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులతో గద్వాల జిల్లాలో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఇప్పటి వరకు పాజిటివ్‌ వచ్చిన గద్వాల పట్టణం, అయిజ, శాంతినగర్, రాజోళి ప్రాంతాలపై దృష్టి సారించారు. జిల్లాకేంద్రంలోని రాధాకృష్ణకాలనీ, వేదనగర్‌ ప్రాంతాలకు రెండు కిలోమీటర్ల దూరం వరకు దారులన్నీ అధికారులు మూసేశారు. తాజాగా మంగళవారం మోమిన్‌మహళ్లలో ముగ్గురికి, భీంనగర్‌లో, రాఘవేంద్రకాలనీ, కుంటవీధి, శేరిల్లివీధి ఒక్కొక్కరి చొప్పున రాజోలి మండలంలో ఇద్దరికి మొత్తం తొమ్మిది కేసులు నమోదయ్యాయి. ఇందులో 55 ఏళ్ల వయస్సు ఉన్న ఓ వ్యక్తి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు. స్థానికంగా చిరు వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఇతను ఇటీవల Éìఢిల్లీకి వెళ్లి వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్నట్లు తేలింది. దగ్గు, జలుబుతో సదరు వ్యక్తి ఐదు రోజుల క్రితమే గద్వాలలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చూపించుకున్నాడు. అతన్ని పరీక్షించిన వైద్యుడు ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్‌ చేశాడు. అక్కడ మరోసారి పరీక్షించిన ప్రభుత్వ వైద్యులు గాంధీకి తరలించారు. కరోనా నిర్ధారణ కావడంతో.. మూడు రోజులుగా గాంధీలో చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు. దీంతో గద్వాలలో 25 కాలనీలను కంటైన్‌మెంట్‌ జోన్లుగా మార్చి.. జనం ఇళ్ల నుంచి బయటికి రాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా కావాలంటే సంబంధిత వార్డు కౌన్సిలర్లకు ఫోన్‌ చేయాలని అధికారులు సూచించారు. ఆయా కౌన్సిలర్లు వలంటీర్ల ద్వారా ఆయా ఇళ్లకు వెళ్లి సహాయం చేస్తారని మున్సిపల్‌ కమిషనర్‌ నర్సింహ తెలిపారు.

మహబూబ్‌నగర్‌ పట్టణంలోనూ కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు నమోదైన పది కేసుల్లో ఎనిమిది పాజిటివ్‌ కేసులు జిల్లాకేంద్రంలోనే నమోదయ్యాయి. ముఖ్యంగా బీకే రెడ్డి కాలనీ, మర్లుతో పాటు వీరన్నపేట ప్రాంతాల్లో జనం ఇళ్ల నుంచి బయటికి వెళ్లకుండా చర్యలు చేపట్టారు. ప్రధాన రహదారులన్నీ మూసేసి.. ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా పట్టణంలో రసాయనాలను పిచికారీ చేయిస్తున్నట్లు కలెక్టర్‌ వెంకట్రావ్‌ తెలిపారు. బీకే రెడ్డి కాలనీ, మర్లు ప్రాంతాల్లో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌ను గుర్తించి.. వారందరినీ ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు ముఖ్యంగా ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. మరోవైపు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విధులు నిర్వహించేందుకు డిప్యూటేషన్‌పై వెళ్లి కరోనా బారిన పడిన హెల్త్‌ అసిస్టెంట్‌ డిశ్చార్జ్‌  అయ్యారు.  

23 రోజుల పసికందుకు పాజిటివ్‌
మహబూబ్‌నగర్‌లోని బీకేరెడ్డి కాలనీకి చెందిన 23రోజుల పసికందుకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. మార్చిలో ఢిల్లీలో జరిగిన ధార్మిక సభలో పాల్గొన్న సదరు శిశువు తండ్రి అదే నెల 23న తిరిగి జిల్లాకు వచ్చాడు. అప్పట్నుంచీ కరోనా లక్షణాలతో బాధపడడంతో వైద్యులు అతన్ని మార్చి 28న గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఏప్రిల్‌ రెండో తేదీన అతనికి వైరస్‌ సోకినట్లు తేలింది. దీంతో స్థానిక అధికారులు వెంటనే అతని భార్యతో పాటు 23 రోజుల శిశువును క్వారంటైన్‌లో ఉంచారు. మూడ్రోజుల తర్వాత సదరు శిశువుకు దగ్గు మొదలైంది. వెంటనే వైద్యులు శిశువు గొంతు నుంచి నమూనాలు సేకరించి హైదరాబాద్‌లోని నిర్ధారణ కేంద్రానికి పంపారు. దీంతో మంగళవారం 23 రోజుల పసికందుకూ పాజిటివ్‌ రాగా.. పసికందు తల్లికి మాత్రం నెగిటివ్‌ వచ్చింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top