కరోనా: ఉలిక్కిపడిన చేగూరు

Corona: 17 Cases Registered In Rangareddy District - Sakshi

కరోనాతో మహిళ మృతి.. స్థానికుల్లో ఆందోళన

ప్రతి ఇల్లు సర్వే చేయనున్న అధికారులు 

జిల్లాలో 17కు చేరిన  కరోనా పాజిటివ్‌ కేసులు

పెండింగ్‌లో 76 మంది నమూనాల ఫలితాలు 

సాక్షి, రంగారెడ్డి : కరోనా వైరస్‌తో ఓ మహిళ మృతిచెందడంతో నందిగామ మండల ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ మండలంలోని చేగూరుకు చెందిన ఓ మహిళ (55) కరోనా వైరస్‌తో మృతిచెందినట్లు తెలియడంతో ప్రజలంతా కలవరానికి గురయ్యారు. ఇప్పటికే మత ప్రార్థనలకు వెళ్లొచి్చన వారిలో ఇదే మండలంలో కొందరు ఉండగా.. తాజాగా ఇక్కడే వైరస్‌తో ఒకరు మృతిచెందడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రెండు రోజుల క్రితం ఆమె మరణించినా.. శుక్రవారం వెల్లడైన రిపోర్ట్‌లో కరోనా పాజిటివ్‌ రావడంతో చర్చనీయాంశమైంది. జిల్లాలో వైరస్‌తో తొలి మరణం ఇదే కావడం గమనార్హం. ముఖ్యంగా కొంతకాలంగా ఆమెతో సన్నిహితంగా మెలిగిన వారిలో ఆందోళన మరింత తీవ్రమైంది. కేవలం అనారోగ్యానికి గురైందని భావించగా.. తీరా ఇది మహమ్మారి కరోనా అని తేలడంతో ఒక్కసారిగా కుదుపునకు లోనయ్యారు. కొంతకాలంగా ఆమెతో సన్నిహితంగా ఎంతమంది మెలిగారన్న విషయంపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆమె భర్త వయసు పైబడటంతో ముందుజాగ్రత్త చర్యగా నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అలాగే ఆమె అంత్యక్రియల్లో దగ్గరగా పాల్గొన్న 15 మందితోపాటు, మృతురాలి ఇంట్లో అద్దెకున్న నలుగురు, ఆమె కుటుంబ సభ్యులైన మరో నలుగురిని రాజేంద్రనగర్‌లోని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు.  

గ్రామంలో సర్వే.. 
గ్రామాన్ని జల్లెడపట్టేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. మృతురాలి నివాసానికి కిలో మీటర్‌ రేడియస్‌ పరిధిలో ఉన్న కుటుంబాల వివరాలను సేకరించేందుకు సర్వే చేపట్టనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వీరి ఆరోగ్య పరిస్థితిపై క్షుణ్ణంగా ఆరాతీయనున్నారు. అలాగే స్థానికంగా ఉన్న కన్హా శాంతివనాన్ని కూడా సర్వే చేయాలని అధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది. 

17కు చేరిన కేసులు.. 
జిల్లాలో రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గురువారం నాటికి 15 పాజిటివ్‌ కేసులు ఉండగా.. శుక్రవారం మరో రెండు కేసులు తోడయ్యాయి. వీటిలో ఒకటి చేగూరు చెందిన మృతురాలుకాగా.. మరొకరు జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వెళ్లే జిల్లావాసి. ఇతను మతప్రార్థనలకు ఢిల్లీ వెళ్లొచి్చన జాబితాలో ఉన్నాడని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఢిల్లీకి వెళ్లొచి్చన మరో 45 నమూనా ఫలితాలు వెల్లడికావాల్సి ఉంది. వీరి ప్రైమరీ కాంటాక్ట్‌గా ఉన్న 25 మంది ఫలితాలు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. వీటి ఫలితాలు శనివారం వెల్లడయ్యే అవకాశం ఉందని సమాచారం. అంతేగాక కొత్తగా ప్రైమరీ కాంటాక్ట్‌గా ఉన్నవారిని మరో ఏడుగురిని గుర్తించి నమూనాలు సేకరించారు. 

ఆ లక్షణాలను గుర్తిస్తే తెలియజేయాలి
తమ దగ్గరకు వచ్చే రోగుల్లో జలుబు, దగ్గు, హై ఫీవర్‌ తదితర లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలని ఆర్‌ఎంపీలు, పీఎంపీలకు జిల్లా యంత్రాంగం ఆదేశించింది. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి శుక్రవారం రాత్రి సర్క్యులర్‌ జారీచేశారు. లేకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. చేగూరుకు చెందిన మహిళ అనారోగ్యం కారణంగా చికిత్స కోసం.. తొలుత స్థానిక, ఆ తర్వాత షాద్‌నగర్‌లోని ఆర్‌ఎంపీల వద్దకు వెళ్లారు. అయినా వారు అధికారుల దృష్టికి తీసుకెళ్లలేదు. వీరి బాధ్యతారాహిత్యంపై అధికారులు సీరియస్‌ అయినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆర్‌ఎంపీలు, పీఎంపీలు, ప్రథమ చికిత్స అందించే వారికి సర్క్యులర్‌ జారీచేశారు.
 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top