కాకినాడ అమ్మాయి.. హైదరాబాద్‌ అబ్బాయి..

Cops Came For Couple to Produce in Court - Sakshi

గత ఏప్రిల్‌లో కొత్తగూడెంలో పెళ్లి.. 

కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకెళ్లిన పోలీసులు   

సింగరేణి(కొత్తగూడెం): కాకినాడకు చెందిన అమ్మాయి.. హైదరాబాద్‌కు చెందిన అబ్బాయి.. వారిద్దరికీ ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి వివాహం చేసుకునేందుకు దారి తీసింది. కొత్తగూడెంలో పెళ్లి చేసుకుని, ఇక్కడే పెళ్లి రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఆ పెళ్లి ఇష్టంలేని అమ్మాయి తండ్రి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. దీంతో కోర్టు కానిస్టేబుళ్లు ఈ జంటను తీసుకెళ్లేందుకు కొత్తగూడేనికి వచ్చారు. వివరాలిలా ఉన్నాయి.. కాకినాడకు చెందిన విత్తనాల వెంకటలక్ష్మీపూజితకు హైదరాబాద్‌కు చెందిన తంగెళ్ల హిమేశ్‌తో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. వారిద్దరి పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. పెద్దలు అంగీకరించరని తెలిసిన వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చుంచుపల్లి మండలం వెంకటేశ్‌ఖనిలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్‌ 12వ తేదీన వివాహం చేసుకున్నారు. అనంతరం ఏప్రిల్‌ 18వ తేదీన కొత్తగూడెంలోని రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వివాహాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించారు.

కాగా, కాకినాడ ఎంపీడీఓ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పూజిత తండ్రి వెంకటశ్రీనివాస్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి తన కూతురు కన్పించడంలేదని పిటిషన్‌ దాఖలు చేశాడు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన పోలీసులు హిమేశ్, పూజిత కొత్తగూడెంలో వివాహం రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు గుర్తించి ఇక్కడకు వచ్చారు. అనంతరం వన్‌టౌన్‌ పోలీసుల సహకారంతో వారిద్దరినీ రప్పించి కోర్టుకు అప్పగించేందుకు ఆంధ్రా నుంచి వచ్చిన ఎస్సై బి.శంకర్, కానిస్టేబుల్‌ రమేశ్‌తోపాటు మరో మహిళా కానిస్టేబుల్‌కు అప్పగించారు. కాగా, ఈ ప్రేమ, పెళ్లి వ్యవహారంపై కొత్తగూడెం వన్‌టౌన్‌ సీఐ కుమారస్వామిని వివరణ కోరగా కోర్టు ఆదేశాల మేరకు హిమేశ్, పూజితను అమరావతి నుంచి వచ్చిన పోలీసులకు అప్పగించామని, మంగళవారం కోర్టు సమయం ముగియడంతో బుధవారం వారిని కోర్టులో హాజరుపర్చే అవకాశముందని వెల్లడించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top