అడ్డగింతలు.. అరెస్టులు

సాక్షి, రంగారెడ్డి జిల్లా:  రైతు సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమం జిల్లాలో వేడి రగిలించింది. అసెంబ్లీ ముట్టడికి వెళ్లేందుకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించడం.. చివరకు వారిని పోలీసులు అరెస్టులు చేయడం వంటి దృశ్యాలు జిల్లాలో అడుగడుగునా కనిపించాయి. గురువారం రాత్రి నుంచే కీలక నాయకులు, క్రీయాశీలక కార్యర్తలపై నిఘా పెట్టిన పోలీసులు.. అర్ధరాత్రి నుంచే అదుపులోకి తీసుకోవడం మొదలుపెట్టారు. మరికొందరిని గృహనిర్భంధం చేశారు. అరెస్టయిన నాయకులు పోలీస్‌స్టేషన్లలోనూ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినదించి నిరసన తెలిపారు. 

అసెంబ్లీ ముట్టడికి అనుమతి లేదన్న కారణంగా నాయకుల కదలికలపై ఉక్కుపాదం మోపారు. వనస్థలిపురంలో డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్‌ను పోలీసులు గృహనిర్భంధం చేశారు. అలాగే మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు, కాంగ్రెస్‌ నాయకుడు కార్తీక్‌ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. జెడ్పీటీసీ సభ్యుడు ఏనుగు జంగారెడ్డిని అరెస్టు చేసి హైదరాబాద్‌ గోషామహల్‌ పోలీస్‌స్టేషనకు తీసుకెళ్లారు. అలాగే చేవెళ్లలో డీసీసీ మాజీ అధ్యక్షుడు పి.వెంకటస్వామిని అరెస్ట్‌ చేశారు. శుక్రవారం తెల్లవారుజామున పార్టీ ముఖ్య నాయకులు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు.

 హైదరాబాద్‌ తరలే ముందు ఆయా మండలాల్లో చేపట్టిన ర్యాలీలను భగ్నం చేయడంతోపాటు వారిని అదుపులోకి తీసుకుని సాయంత్రం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. నగరం వైపు బస్సుల్లో బయలు దేరిన వారిని పొలిమేరల్లోనే నిలిపివేసి కార్యకర్తలను పోలీస్‌స్టేషన్లకు తరలించారు. హైదరాబాద్‌ దిశగా వచ్చే అన్ని వాహనాలపై నజర్‌ పెట్టిన పోలీసులు.. అనుమానం వచ్చిన వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేసి పంపించారు. అరెస్టులపై కాంగ్రెస్‌ నాయకులు భగ్గుమన్నారు. రాష్ట్రంలో రైతుల సమస్యల పరిష్కారంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు. ఒక వైపు తీవ్ర వర్షాలతో పంటలు నాశనంకాగా.. కనీసం చేతికి వచ్చిన పంటలకూ గిట్టుబాటు ధర కల్పించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు.  

జాతీయ రహదారిపై బైఠాయింపు 
పోలీసులకు చిక్కకుండా ఉన్న నేతలు శుక్రారం మధ్యాహ్నం శంషాబాద్‌లోని బెంగళూరు జాతీయ రహదారిపై ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించారు. సర్కారు దిష్టిబొమ్మను కాల్చేందుకు యత్నిస్తున్న సమయంలో ఆర్‌జీఐఏ పోలీసులు వారిని నిలువరించారు. దీంతో కాంగ్రెస్‌ నేతలు అక్కడే కొద్ది సేపు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చివరకు పోలీసులు వారిని లాక్కెళ్లి తమ వాహనం ఎక్కించిన పోలీసులు.. ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top