ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం చేద్దాం?

Congress party is debating what to do in the legislative council election - Sakshi

కాంగ్రెస్‌లో తర్జనభర్జన

గ్రాడ్యుయేట్స్‌ బరిలో దిగేందుకు సిద్ధమవుతున్న జీవన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: శాసనమండలి ఎన్నికల్లో ఏం చేయాలన్న దానిపై కాంగ్రెస్‌ పార్టీ తర్జనభర్జన పడుతోంది. ఎమ్మెల్యే కోటాతోపాటు త్వరలోనే నోటిఫికేషన్‌ వస్తుందని భావిస్తున్న గ్రాడ్యుయేట్స్, ఉపాధ్యాయ నియోజకవర్గాలు, స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ కసరత్తు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం లేదనే అంచనాల నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతలెవరూ పోటీకి ముందుకు రావడంలేదు .మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌ గ్రాడ్యుయేట్‌ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ పదవీకాలం మార్చిలో ముగియనుండటంతో ఆ లోపు ఎన్నికలు జరగనున్నాయి.

ఇక్కడి నుంచి తాను పోటీచేస్తానని మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి టీపీసీసీ నాయకత్వానికి విన్నవించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను బరిలో దింపేందుకు ఆ పార్టీ సిద్ధమవుతోంది. కాంగ్రెస్‌ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను బట్టి ఎమ్మెల్యే కోటాలో ఆ పార్టీకి ఒక స్థానం రానుంది. ఈ కోటా నుంచి పోటీకి ఎమ్మెల్సీలు షబ్బీర్‌ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి రేసులో ఉన్నారు. అయితే, వీరికి మళ్లీ అవకాశం ఇస్తారా, లేదా అనే చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో టికెట్లు ఆశించి భంగపడిన పార్టీ నేతల పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. ఈ జాబితాలో మాజీమంత్రి మర్రి శశిధర్‌రెడ్డి ముందువరుసలో ఉన్నారు.

మహిళాకాంగ్రెస్‌ అధ్యక్షురాలు నేరెళ్ల శారద, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్రావుల పేర్లను కూడా పరిశీలించే అవకాశాలున్నాయని గాంధీభవన్‌ వర్గాలంటున్నాయి. పార్టీ అనుబంధ సంఘాల కోటాలో వీరికి అసెంబ్లీ టికెట్‌ దక్కాల్సి ఉన్నప్పటికీ అనేక సమీకరణల్లో చుక్కెదురైంది. దీంతో వీరిద్దరి పేర్లను ఎమ్మెల్సీ కోటాలో పరిశీలిస్తారనే చర్చ కాంగ్రెస్‌ వర్గాల్లో జరుగుతోంది. సీనియర్‌ నాయకుడు, ఖమ్మం జిల్లాకు చెందిన మాజీమంత్రి సంభాని చంద్రశేఖర్‌ కూడా ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఆయన పేరును కూడా పార్టీ సీరియస్‌గానే పరిశీలిస్తుందని పార్టీ వర్గాలంటున్నాయి. 

ఆ ఐదు స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో...
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో పోటీకి ఎవరిని పెట్టాలన్న దానిపై రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు సమాలోచనలు చేస్తున్నారు. దీనిపై ఇటీవ ల టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై కసరత్తు చేస్తున్నామని, ఎవరు పోటీ చేయాలనే దానిపై ఇప్పటికే నేతలకు సంకేతాలు పంపామన్నారు. స్థానిక సంస్థల నుంచి ఎన్నికలు జరగనున్న రంగారెడ్డి, వరంగల్, నిజామాబాద్‌ నియోజకవర్గాల నుంచి గతంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే గెలిచారు. వరంగల్, నిజామాబాద్‌ల నుంచి గతంలో గెలి చిన కొండా మురళి, భూపతిరెడ్డి మళ్లీ పోటీకి సిద్ధపడతారా, లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

హైదరాబాద్‌లో ప్రస్తుత బలం ప్రకారం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి స్పష్టమైన మెజార్టీతో గెలిచే అవకాశాలున్నాయి. నల్లగొండలో గతంలో గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నం దున ఆయన కుటుంబ సభ్యులెవరైనా బరిలో ఉం టారా అనే చర్చ జరుగుతోంది. రాజగోపాల్‌రెడ్డి సోదరుడు వెంకటరెడ్డి నల్లగొండ లోక్‌సభ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. దీంతో అక్కడి నుంచి పోటీ చేసి గెలవగలిగిన సమర్థ నేత కోసం టీపీసీసీ నేతలు వెతుకుతున్నట్టు తెలుస్తోంది.

ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానం కోసం టీపీసీసీ అధికార ప్రతినిధి, పీఆర్టీయూ మాజీ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి పోటీలో ఉన్నారు. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌ ఉపాధ్యాయ స్థానం నుంచి ఆయనకు మద్దతిచ్చే యోచనలో కాంగ్రెస్‌ ముఖ్యనేతలున్నారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఎవరికి మద్దతివ్వాలన్న దానిపై కాంగ్రెస్‌లో స్పష్టత రాలేదని సమాచారం.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top