కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపికకు అధిష్టానంకసరత్తు

Congress MLA Candidates Intensifies Mahabubnagar - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌:  ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన నేపథ్యంలో మరోవైపు ప్రచారానికి శ్రీకారం చుట్టిన కాంగ్రెస్‌ పార్టీ.. బరిలోకి దింపనున్న అభ్యర్థుల ఎంపికకు ముమ్మర కసరత్తు చేపడుతోంది. వారం రోజుల్లోగా అభ్యర్థులను ఖరారు చేసేందుకు గాను కాంగ్రెస్‌ ఎన్నికల స్క్రీనింగ్‌ కమిటీ నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది. దీంతో ఆశావహులందరూ తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అయితే రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ.. అందుకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపికకు అవలంభిస్తున్న విధానాలు ఉత్కంఠతకు దారితీస్తున్నాయి.

గెలుపు గుర్రాలనే ఎంపిక చేసేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం ముఖ్యంగా మూడు పద్ధతులను అవలంభించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. వరుసగా మూడు సార్లు ఓటమి పాలైన, గత ఎన్నికల్లో 30వేల ఓట్ల తేడాతో ఓటమి చెందిన లేదా డిపాజిట్లే దక్కని వారికి ఈసారి టికెట్లు కేటాయించొద్దని మార్గదర్శకాలను సిద్ధం చేసింది. దీంతో ఎవరికి వారు తమకు టికెట్‌ లభిస్తుందా, లేదా అనే అంశంపై లెక్కలు వేసుకుంటూ పార్టీ ముఖ్యుల వద్ద ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.

ఐదు చోట్ల నో ప్రాబ్లం 
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్‌ అభ్యర్థులకు సంబంధించి ఐదు నియోజకవర్గాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఐదు చోట్ల విజయం సాధించారు. గద్వాలలో డీకే.అరుణ,అలంపూర్‌లో సంపత్‌కుమార్, వనపర్తిలో చిన్నారెడ్డి, మక్తల్‌లో చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, కల్వకుర్తిలో చల్లా వంశీచంద్‌రెడ్డి గెలుపొందారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మక్తల్‌లో కాంగ్రెస్‌ తరఫున గెలిచిన చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు.

దీంతో కాంగ్రెస్‌ తరఫున నలుగురు మాత్రమే మిగిలారు. అయితే తదనంతర పరిణామాల నేపథ్యంలో కొడంగల్‌లో టీడీపీ తరఫున గెలిచిన రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఫలితంగా కాంగ్రెస్‌ తరఫున ప్రాతినిధ్యం వహించే వారి సంఖ్య మళ్లీ ఐదుకు చేరింది. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఈ ఐదు చోట్ల కాంగ్రెస్‌ తాజా మాజీ ఎమ్మెల్యేలు ఉండడంతో మరో సారి వారే బరిలో నిలిచే అవకాశం ఉంది. టికెట్‌ కోసం దరఖాస్తుల విషయంలో కూడా ఐదు చోట్ల తాజా మాజీ తప్ప ఇతరులెవరూ పోటీకి రాలేదు. ఈ నేపథ్యంలో గద్వాల, అలంపూర్, వనపర్తి, కొడంగల్, కల్వకుర్తిల్లో తాజా మాజీలే బరిలో నిలవడం దాదాపు ఖాయమని చెబుతున్నారు.

నిబంధనలు అనుకూలిస్తాయా? 
రానున్న ఎన్నికల్లో గెలుపు గుర్రాలే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్‌ పార్టీ పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. బరిలో నిలిచే అభ్యర్థులకు సంబంధించి గత ఎన్నికల్లో వారి చరిత్రను పరిశీలిస్తోంది. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాలకు గాను ఐదు చోట్ల కాంగ్రెస్‌ గెలిచింది. తొమ్మిది చోట్ల ఓటమి పాలైంది. ఆయా నియోజకవర్గాల్లో ఓడిపోయిన అభ్యర్థులే ఇప్పటికీ ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈసారి అభ్యర్థులకు సంబంధించి కాంగ్రెస్‌ అధిష్ఠానం కొన్ని కఠినమైన మార్గదర్శకాలను రూపొందించింది. గత ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోవడం, 30వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన పరిస్థితులు ఒక్క మహబూబ్‌నగర్‌ నియోజకవర్గం మినహా మరెక్కడా లేవు.

మహబూబ్‌నగర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఒబేదు ల్లా కొత్వాల్‌ నాలుగో స్థానంలో నిలవడమే కాకుం డా కేవలం 22,744 ఓట్లు మాత్రమే సాధించగలిగారు. దీంతో ఆయన డిపాజిట్‌ దక్కకపోవడంతో ప్రస్తుత మార్గదర్శకాలకు లోబడి టికెట్‌ దక్కే అవకాశాలు సన్నగిల్లినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే నారాయణపేట నియోజకవర్గంలో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన సరాఫ్‌ కృష్ణకు కూడా కేవలం 29వేల ఓట్లు సాధించి మూడో స్థానంలో ని లిచారు.

అయితే కాంగ్రెస్‌ మార్గదర్శకాల మేరకు పేటలో సరాఫ్‌కృష్ణ డిపాజిట్‌ దక్కించుకున్నా... ఇక్కడ టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ పడి రెండో స్థానం లో నిలిచి 37,837 ఓట్లు సాధించిన కుంభం శివకుమార్‌ ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. ఇక దేవరకద్ర లో రెండో స్థానంలో నిలిచిన పవన్‌కుమార్‌ 48, 556 ఓట్లతో గట్టి పోటీ ఇచ్చారు. పార్టీ మార్గదర్శకాలకు అనుగుణంగా నాలుగేళ్లుగా నియోజకవరా ్గన్ని అంటిపెట్టుకోవడంతో ఈసారి బరిలో నిలి చి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పవన్‌కుమా ర్‌ కసరత్తు చేస్తున్నారు. మక్తల్‌ నియోజకవర్గంలో పార్టీ తరఫున గెలుపొందిన చిట్టెం రామ్మోహన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరిన నేపథ్యంలో ఇక్కడ ఎవరికి అవకాశం దక్కుతుందనేది అంతుచిక్కడం లేదు.

 నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ పరిధిలో ఓకే.. 

కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల విషయంలో నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ పరిధిలోని నియోజకవర్గాలలో ఎలాంటి ఇబ్బందులు లేనట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్లమెంట్‌ పరిధిలో నాలుగు అసెంబ్లీ స్థానాలైన కల్వకుర్తి, వనపర్తి, అలంపూర్, గద్వాలలో తాజా మాజీలే ఉండడంతో వారికే మరోసారి అవకాశం దక్కుతుంది. ఇక అచ్చంపేట నియోజకవర్గంలో ప్రస్తుత ఇన్‌చార్జి డాక్టర్‌ వంశీకృష్ణకు లైన్‌ క్లియర్‌గానే ఉంది. కాంగ్రెస్‌ మార్గదర్శకాల మేరకు గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ డిపాజిట్‌ తెచ్చుకున్నారు. వరుసగా రెండు పర్యాయాలు ఓడిపోయినప్పటికీ నియోజకవర్గంలో తనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, పోటీలో మరెవరూ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

అలాగే కొల్లాపూర్‌ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పోటీ చేసిన ఓడిపోయిన హర్షవర్దన్‌రెడ్డి కూడా నాలుగేళ్లుగా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఉన్నారు. అంతేకాదు కాంగ్రెస్‌ మార్గదర్శకాల మేరకు 62,264 ఓట్లతో గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా టికెట్‌ దక్కించుకొని మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. 
ఇక నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి పార్టీ మారారు. అయితే ఇక్కడ సీనియర్‌ నేత నాగం జనార్దన్‌రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. నాగర్‌కర్నూల్‌ నుంచి ఐదు పర్యాయాలు గెలుపొందిన చరిత్ర ఉండడంతో నాగంకు టికెట్టు దాదాపు ఖరారైనట్లేనని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top