భంగపాటు నేతలపై కన్ను?

Congress Candidate Join In BJP Nizamabad - Sakshi

కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిత్వాలు ఆశించి భంగపడిన నేతలపై కమలదళం కన్నేసిందా..? స్పష్టత ఉన్న మూడు చోట్ల అభ్యర్థిత్వాలను ప్రకటించిన ఆ పార్టీ మిగిలిన ఆరుచోట్ల పోటీ చేయనున్న అభ్యర్థుల విషయంలో ఆచితూచివ్యవహరిస్తోందా.. అవుననే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: ఉమ్మడి జిల్లా పరిధిలో ఐదు స్థానాలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిత్వాలు తేలేవరకూ వేచి చూడాలనే యోచనలో అధినాయకత్వం ఉన్నట్లు సమాచారం. బాన్సువాడ, జుక్కల్‌ స్థానాల్లో కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి భంగపడిన నేతలు బీజేపీలో చేరే అవకాశాలున్నాయి. ఈ భంగపాటు నేతలకు బీజేపీ టికెట్‌ దక్కే అవకాశాలపై బీజేపీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఎస్సీ రిజర్వుడు స్థానం జుక్కల్‌ టికెట్‌ రేసులో ఇటీవల బీజేపీలో చేరిన నాయుడు ప్రకాశ్‌తో పాటు, ఓ ఐఆర్‌ఎస్‌ అధికారి కూడా బీజేపీ అభ్యర్థిత్వం కోసం ప్రయత్నాలు చేశారు.

మరోవైపు కాంగ్రెస్‌ టికెట్‌ కోసం పోటీ పడుతున్న ఇద్దరు నేతల్లో ఒకరిపై కమలదళం కన్నేసింది. అలాగే బాన్సువాడ నియోజకవర్గంలో బీజేపీ టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్న వారిలో చెప్పుకోదగిన నేతలెవరూ లేరు. దీంతో ఇక్కడ కూడా కాంగ్రెస్‌ అభ్యర్థి తేలాకే బీజేపీ అభ్యర్థిని ప్రకటించనుంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తెరపైకి కొత్త పేర్లు వస్తుండటం గమనార్హం. బాల్కొండ, బోధన్‌ స్థానాల్లో కూడా బీజేపీ అభ్యర్థుల విషయంలో ఇప్పటికీ ఓ స్పష్టత రావడం లేదు. ఈ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో ఉత్కంఠ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశాలున్నాయని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

అర్బన్‌ స్థానానికి అత్యధిక పోటీ..  
ఉమ్మడి జిల్లాలోని ఆయా నియోజకవర్గాలకు భిన్నంగా నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిత్వాల కోసం అత్యధిక పోటీ నెలకొంది. రాష్ట్రంలో బలమైన పోటీ ఉన్న నియోజకవర్గాల్లో నిజామాబాద్‌ అర్బన్‌ ఒకటి. ఇక్కడ బీజేపీకి గట్టి పట్టుండటంతో ఈ స్థానం కోసం ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. 2009 ఎన్నికలు, 2010 ఉప ఎన్నికల్లో ఈ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. అలాగే 2014 ఎన్నికల్లో కూడా ఈ పార్టీ గట్టి పోటీని ఇచ్చింది. గెలుపొందిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బిగాల గణేష్‌గుప్తకు పోలైన ఓట్లలో 31 శాతం ఓట్లు రాగా, మూడో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి ధన్‌పాల్‌ సూర్యనారాయణగుప్తకు 21 శాతం వచ్చాయి.

దీంతో ఈసారి ఈ టికెట్‌ కోసం నేతలు ఎవరికి వారే గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. హైదరాబాద్, ఢిల్లీ వెళ్లి ఆ పార్టీ జాతీయ నేతలను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో ఈ స్థానానికి అభ్యర్థిత్వం ఎవరికి కేటాయించాలనే అంశంపై చివరి రోజు వరకూ వేచి చూడాలనే యోచనలో పార్టీ అధినాయకత్వం భావిస్తున్నట్లు సమచారం. జిల్లాలో గెలుపునకు పూర్తి స్థాయిలో అవకాశం ఉన్న స్థానం కావడంతో బీజేపీ ఈ స్థానంపై ఆచితూచి వ్యవహరిస్తోంది.

స్పష్టత ఉన్న స్థానాల్లో మాత్రమే ప్రకటన.. 
రాష్ట్రంలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థిత్వాలపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఇటీవల ప్రకటించిన 38 మందితో కూడిన తొలిజాబితాలో ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు అభ్యర్థులకు చోటు దక్కిన విషయం విదితమే. ఆ పార్టీ అభ్యర్థిత్వాల కోసం పోటీ లేని, పూర్తి స్థాయిలో స్పష్టత ఉన్న స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో నిజామాబాద్‌ రూరల్‌ అభ్యర్థిగా గడ్డం ఆనంద్‌రెడ్డిని ప్రకటించింది. ఇటీవల పార్టీలో చేరిన పొద్దుటూరి వినయ్‌కుమార్‌రెడ్డికి ఆర్మూర్‌ టికెట్‌ను ఖరారు చేసింది. అలాగే కామారెడ్డి స్థానానికి జెడ్పీ మాజీ చైర్మన్‌ కాటిపల్లి వెంకటరమణారెడ్డికి అభ్యర్థిత్వం దక్కింది. మిగిలిన ఆరు నియోజకవర్గాల నుంచి ఎవరు బరిలోకి దిగుతారనే అంశంపై ఆసక్తి నెలకొంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top