వీడని సస్పెన్స్‌..!

Congress Announced  First List Of 65 Members On Monday - Sakshi

కాంగ్రెస్‌ తొలివిడతలో  సిరిసిల్లకు దక్కని చోటు

నిరాశలో కాంగ్రెస్‌ శ్రేణులు

వేములవాడ టికెట్‌ ప్రకటించని బీజేపీ

ఆందోళనలో ‘ప్రతాప’ వర్గీయులు

సమీపిస్తున్న పోలింగ్‌ గడువు

సాక్షి, సిరిసిల్ల: ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత ఎట్టకేలకు కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. సోమవారం అర్ధరాత్రి 65 మంది అభ్యర్థులతో తొలివిడత జాబితా ప్రకటించగా అందులో వేములవాడ నియోజకవర్గానికి ఆది శ్రీనివాస్‌కు చోటు దక్కింది. కానీ, సిరిసిల్ల నియోజకవర్గానికి చోటుదక్కలేదు. దీంతో కొద్ది రోజులుగా ఆ స్థానంపై కొననసాగుతున్న ఉత్కంఠ వీడలేదు. సిరిసిల్ల కాంగ్రెస్‌ అభ్యర్థిగా కేకే మహేందర్‌రెడ్డి పేరు ఖరారైనట్లు ప్రచారం సాగుతున్నా.. జాబితాలో పేరు ప్రకటించకుండా సస్పెన్స్‌లో ఉంచటంపై కాంగ్రెస్‌ శ్రేణులు అయోమయంలో ఉన్నారు. పోలింగ్‌ తేదీ సమీపిస్తుండటం, ప్రచారానికి పాతిక రోజులే మిగిలి ఉండటంతో ఆ పార్టీ కేడర్‌ ఆందోళన చెందుతోంది. నామినేషన్లకు సమయం ఆసన్నమయినా అభ్యర్థి పేరును ప్రకటించకపోవడంపై అధిష్టానంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

తొలగని ఉత్కంఠ..
టీఆర్‌ఎస్‌ నెలన్నర క్రితమే తమ అభ్యర్థులను ప్రకటించగా ఆ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ అభ్యర్థి కేటీఆర్, వేములవాడ అభ్యర్థి రమేశ్‌బాబు దూకుడుగా ప్రచారం సాగిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల్లో మండలాల వారీగా, వర్గాల వారీగా ప్రత్యేక సభలు, గ్రామాల్లో ప్రచార ర్యాలీలు, ఇంటింటి ప్రచారం, బహిరంగ సభలతో ప్రచారాన్ని హోరెత్తించారు. మున్ముందు కూడా నియోజకవర్గం అంతటా నిత్యం సభలతో ప్రచారానికి ప్రణాళిక రూపొందించారు. అయితే తమ అభ్యర్థుల ప్రకటన కోసం నెలన్నర రోజులుగా  వేచిచూస్తున్న కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు.. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత కూడా అభ్యర్థిని ప్రకటించకపోవడంపై ఆందోళనలో ఉన్నారు.

తమ నాయకుని పేరు ప్రకటించకుండా కాలయాపన చేస్తున్న అధిష్టానం తీరుపై కేకే మహేందర్‌రెడ్డి అభిమానులు గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్‌ తొలి జాబితాలో సిరిసిల్ల అభ్యర్థిగా కేకే మహేందర్‌రెడ్డి పేరు ప్రకటించకపోవడంతో ఆస్థానం కోసం కటకం మృత్యుంజయం అధిష్టానం వద్ద గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. సిరిసిల్ల స్థానాన్ని తొలి విడతలో ఖరారు కాకుండా పంతులు చక్రం తిప్పినట్లు వినిపిస్తోంది. ఏదేమైనా తన పేరు ఇప్పటికే ఖరారైందని, త్వరలోనే ప్రకటన వస్తుందని కాంగ్రెస్‌ నాయకుడు కేకే మహేందర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈలోపు తనపనిగా తాను ప్రచారంలో నిమగ్నమై క్షేత్రస్థాయిలో కేడర్‌తో కలుపుకొనిపోతున్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో ఇప్పటికే ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, బీజేపీలు తమ అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్‌ తొలిజాబితాలో ఆ పార్టీ జిల్లా కేడర్‌కు నిరాశే మిగిలింది.
 
వేములవాడ బీజేపీలో వీడని ఉత్కంఠ..
వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆది శ్రీనివాస్‌ను ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా చెన్నమనేని రమేశ్‌బాబును ఆ పార్టీ నెలన్నర కిందటే ప్రకటించింది. మరో ప్రధాన పార్టీ బీజేపీ మాత్రం తమ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణకు వేములవాడ స్థానాన్ని కేటాయిస్తారని ఆశిస్తున్నా.. ఇప్పటికే బీజేపీ అధిష్టానం నుంచి రెండు విడుతలుగా వెలువడిన జాబితాల్లోనూ వేములవాడను ప్రస్తావించలేదు. దీంతో ప్రతాపతో పాటు ఆయన అనుచరగణం ఆ పార్టీ అధిష్టానం తీరుపై విసుగు చెందుతున్నారు. మొత్తానికి జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌.. సిరిసిల్ల నియోజకవర్గంలో, బీజేపీ వేములవాడలో తమ అభ్యర్థుల ప్రకటనలో ఉత్కంఠకు తెరతీశాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top