పొత్తుతో చిత్తే

Is Congress And TDP Are Combining In Telangana - Sakshi

టీడీపీతో పొత్తు కుదిరితే తమ ఖేల్‌ఖతం అంటున్న కాంగ్రెస్‌ నేతలు

పొత్తు ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పార్టీలోని ఓ వర్గం 

బలమైన ఓ సామాజిక వర్గం దూరమవుతుందని ఆందోళన 

దళితుల్లోనూ వ్యతిరేకత వస్తుందని వ్యాఖ్యలు 

రాష్ట్రంలో తెలుగుదేశానికి నాయకులు, కేడరే లేదని వెల్లడి 

జట్టు కడితే పరోక్షంగా టీఆర్‌ఎస్‌కే లాభమని విశ్లేషణలు 

సెటిలర్లపైనా ప్రభావం చూపుతుందంటున్న రాజకీయ పరిశీలకులు 

ఇవేమీ పట్టించుకోకుండానే పొత్తుపై ప్రచారం చేస్తున్న మరికొందరు నేతలు

సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్‌ : తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రతిపాదన తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. అంతో ఇంతో అక్కడో ఇక్కడో మిగిలిపోయిన టీడీపీ ఓటు బ్యాంకుతో గట్టెక్కుతామని కొందరు కాంగ్రెస్‌ నాయకులు ఆశపడుతుంటే.. ఆ పార్టీతో పొత్తు అసలుకే చేటు తెస్తుందేమోనని మరికొందరు నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇందుకు బలమైన కారణాలు కూడా చూపుతున్నారు. టీడీపీతో పొత్తుతో దశాబ్దాలుగా తెలంగాణలో కాంగ్రెస్‌కు మద్దతిస్తున్న ఓ బలమైన సామాజిక వర్గం దూరమయ్యే ప్రమాదముందని వారంటున్నారు. దీంతోపాటు తమ మధ్య చిచ్చుపెట్టిన టీడీపీతో కాంగ్రెస్‌ కలిస్తే సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న దళితులు కూడా జీర్ణించుకోలేరని వాదిస్తున్నారు. అయితే ఈ పొత్తు విషయంలో స్పష్టత వచ్చేదాకా తమ అభిప్రాయాలు వెల్లడించకూడదని వారు భావిస్తున్నారు. ఒకవేళ పొత్తుకు పార్టీ అధిష్టానవర్గం సుముఖంగా ఉంటే తమ వాదనలను ఇటు టీపీసీసీ, అటు అధిష్టానం వద్ద బలంగా వినిపించడానికి అవసరమైన నివేదికలు సిద్ధం చేసుకుంటున్నారు. 

పొత్తుతో మొదటికే మోసం 
టీడీపీతో పొత్తు ప్రతిపాదన పట్ల మొదట్లో టీపీసీసీ ముఖ్య నేతల మధ్య చర్చ జరిగింది. ముందస్తు ఎన్నికలు వస్తాయనే అంచనాతోపాటు సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నందున కిందిస్థాయి నేతల్లో కూడా ఇది చర్చనీయాంశమైంది. గ్రామాల్లో టీడీపీ నేతలు, కేడర్‌ ఇప్పటికే టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారని, ఇప్పుడు టీడీపీతో పొత్తు అంటే సీట్ల కోసం కొత్తగా నాయకులు బయల్దేరతారని, ఇది మొదటికే మోసం తెచ్చిపెడుతుందని క్షేత్రస్థాయిలో హస్తం పార్టీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. కాంగ్రెస్‌ను మొదట్నుంచి నమ్ముకుని ఉన్న బలమైన సామాజికవర్గానికి వ్యతిరేకంగా నాయకులు పుట్టుకొస్తారని, ఇలాంటి పొత్తులను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదని కాంగ్రెస్‌ నేతలే ప్రైవేటు సంభాషణల్లో చెబుతున్నారు.

టీడీపీతో పొత్తు కారణంగా కాంగ్రెస్‌కు జరిగే లాభనష్టాలపై ఆయా స్థాయిల్లో పార్టీ నేతలు ఎవరికి వారు అంచనాలు వేస్తూ చర్చోపచర్చలు చేస్తున్నారు. ఈ చర్చల్లో భాగంగానే టీడీపీతో పొత్తును వ్యతిరేకిస్తున్న నేతల స్వరం కూడా వినిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్‌కు వెన్నుదన్నుగా ఉన్న సామాజిక వర్గం టీడీపీతో పొత్తు పట్ల విముఖంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోందని వారంటున్నారు. టీడీపీ అవిర్భావానికి ముందు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల్లో బలంగా ఉన్న ఆ సామాజిక వర్గం ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీని సొంతం చేసుకుంది. 2009 ఎన్నికల్లో టీడీపీ, టీఆర్‌ఎస్, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మహాకూటమిగా పోటీ చేసినప్పుడు కూడా అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ తెలంగాణలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. ‘‘ఇప్పుడు టీడీపీతో పొత్తు అంటే ఆ సామాజికవర్గం జీర్ణించుకోలేకపోతోంది. ఇది కచ్చితంగా మాకు నష్టం తెస్తుందన్న ఆందోళన మాలో ఉంది’’అని కాంగ్రెస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. 

అధికారంలోకి రావాలంటే పొత్తు ముఖ్యం కాదు 
వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొని అధికారంలోకి రావడానికి టీడీపీతో పొత్తు అవసరమన్న భావన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి వర్గీయుల్లో ఉంది. టీడీపీతో పొత్తు దాదాపుగా ఖరారైనట్టేనని వారు టీవీ చర్చల్లో చెబుతున్నారు. ఓ అడుగు ముందుకేసి టీడీపీని సమర్థించడం మొదలుపెట్టారు. దీంతో ఉత్తమ్‌ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న బలమైన సామాజికవర్గం నేతలు దీన్ని ఓ అంశంగా తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. టీవీ చర్చల్లో టీడీపీని సమర్థించడం కాంగ్రెస్‌కు అండగా ఉన్న వర్గాలకు మింగుడు పడటం లేదని, గ్రామాలకు వెళ్లినప్పుడు వారు తమను నిలదీస్తున్నారని సీనియర్‌ నేత ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పట్నుంచే తెలుగుదేశం పట్ల వ్యతిరేక భావన ఏర్పాటు చేసుకున్న సామాజిక వర్గం ఓట్లు.. టీడీపీతో పొత్తు కుదిరితే దూరమయ్యే ప్రమాదం కచ్చితంగా ఉంటుందని వారు బల్లగుద్ది చెబుతున్నారు.

తెలంగాణ ఇచ్చిన క్రెడిట్‌ ఉండి కూడా 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ 20 సీట్లకే పరిమితం కావడానికి వైఎస్‌ జగన్‌పై కాంగ్రెస్‌ పెట్టిన తప్పుడు కేసులే కారణమని రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు. మొదట్నుంచి కాంగ్రెస్‌కు వెన్నుదన్నుగా ఉన్న ఈ సామాజికవర్గం 2014లో దూరమైనా, ఇప్పుడిప్పుడే మళ్లీ కాంగ్రెస్‌ వైపు చూస్తోంది. అయితే టీడీపీతో పొత్తు అనగానే ఆ సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత రావచ్చేమోనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకుని వైఎస్‌ జగన్‌కు వ్యతిరేకంగా కూటమి కడితే దాని ప్రభావం తెలంగాణపై ఉంటుందని వారంటున్నారు. తెలంగాణలో నిర్వీర్యమైన టీడీపీతో పొత్తు పెట్టుకోవడం కంటే వామపక్షాలు ఇతర భావసారూప్య పార్టీలను కలుపుకుని పోతేనే విజయావకాశాలు ఉంటాయని మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒకరు అభిప్రాయపడ్డారు. టీడీపీతో పొత్తు కచ్చితంగా పార్టీకి నష్టమేనని ఆయన పేర్కొన్నారు. 

దళితుల్లోనూ వ్యతిరేకత 
కాంగ్రెస్‌కు సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న దళితులు టీడీపీతో పొత్తును వ్యతిరేకిస్తున్నారు. తమ మధ్య చిచ్చు పెట్టిన పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఏంటని వారంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీతో పొత్తు దళిత ఓటు బ్యాంకుపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని, పార్టీకి ఆయువుపట్టు లాంటి ఈ రెండు సామాజికవర్గాల వాదనలను పట్టించుకోకుండా జట్టు కడితే అది అసలుకే ఎసరు తెస్తుందని వారంటున్నారు. 

అసలు ఆ పార్టీ ఎక్కడుంది? 
కొందరు కాంగ్రెస్‌ నేతలు అసలు టీడీపీ ఉనికినే ప్రశ్నిస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో కొందరు నేతలు, కొంత కేడర్‌ మినహా తెలంగాణలో ఆ పార్టీ ఎక్కడుందని వారంటున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఆ పార్టీకి గతంలో కొంత పట్టు ఉండేదని, ఇప్పుడు ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ప్రత్యేక హోదా నినాదం నేపథ్యంలో ఆ పట్టు సడలిపోయిందని చెబుతున్నారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు వైఖరిని జీర్ణించుకోలేని సెటిలర్లు ఇక్కడ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే అంగీకరించే పరిస్థితి లేదని, అది టీఆర్‌ఎస్‌కే మేలు చేకూరుస్తుందని కాంగ్రెస్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

ఏపీలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా ఓట్లు రావనే సందేహాన్ని ఆయన వ్యక్తం చేయడం గమనార్హం. అయితే టీడీపీతో పొత్తు ఉండాల్సిందేననే ఆలోచనతో ఉన్న కాంగ్రెస్‌ నేతలు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండానే పొత్తు విషయాన్ని ఊరూవాడా ప్రచారం చేస్తున్నారు. అక్కడో, ఇక్కడో టీడీపీ జెండా పట్టుకుని తిరిగే నేతలను తమవైపు తిప్పుకోవాలనే ఆలోచనతో చేస్తున్న ఈ ప్రచారం మొదటికే మోసం తెస్తుందని, పొత్తు ప్రతిపాదనను లోతుగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందనే అభిప్రాయం కాంగ్రెస్‌ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.  
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top