మల్టీ‘ఫుల్‌’ చీటింగ్‌

Commissioner VC Sajjanr Says E-Bizz Company Of Noida Incorporates 17 Lakh Members Multiple Marketing Across The Country - Sakshi

17 లక్షల మంది సభ్యులతో ఐదువేల కోట్ల మోసం చేసిన ఈ–బిజ్‌.కాం సంస్థ 

ఈ–లెర్నింగ్, ఫ్యాషన్‌ దుస్తులు, హాలిడే పేర్లతో చైన్‌లింక్‌ వ్యాపారం 

నోయిడా కేంద్రంగా ఈ–బిజ్‌.కాం పేరుతో వ్యాపార సామ్రాజ్యం 

కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌తో పాటు అతని కుమారుడు అరెస్టు 

సాక్షి, హైదరాబాద్‌ : మల్టీపుల్‌ మార్కెటింగ్‌ పేరుతో దేశవ్యాప్తంగా 17 లక్షల మంది సభ్యుల్ని చేర్చుకుని వారికి ఏకంగా రూ.ఐదువేల కోట్లు శఠగోపం పెట్టేశారు ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన ఈ బిజ్‌ కంపెనీ నిర్వాహకులు. మాయమాటలతో కేవలం విద్యార్థులు, నిరుద్యోగులనే లక్ష్యంగా చేసుకుని తమ వ్యాపారాన్ని విస్తరించుకుని వీరిని మాత్రం రోడ్డున పడేశారు. ఈ ‘మాయా వలయం’లో మోసపోయామని గ్రహించిన కొందరు పోలీసు ఫిర్యాదు చేయగా...విచారణ చేపట్టిన సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగం (ఎకనామిక్‌ ఆఫెన్స్‌ వింగ్‌) ఈ కేసును సవాలుగా తీసుకుని ఈ బిజ్‌ నిర్వాహకుల్ని అరెస్టు చేసి రాష్ట్రానికి తీసుకొచ్చింది. ఈ కేసు వివరాలను సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ మంగళవారం మీడియాకు వివరించారు.  

18 ఏళ్లుగా సాగుతున్న మల్టీలెవల్‌ మోసం 
ఈ–బిజ్‌.కాం ప్రైవేట్‌ లిమిటెడ్‌తో 2001లో ప్రారంభించిన ఈ కంపెనీని న్యూఢిల్లీలోని ఆర్వోసీతో రిజిష్టర్‌ చేశారు. ఈ కంపెనీ డైరెక్టర్‌గా పవన్‌ మల్హన్‌ భార్య అనితా మల్హన్‌ ఉన్నారు. అయితే, ఈ కంపెనీ వ్యవహారాలను వారి కుమారుడు హితిక్‌ మల్హన్‌ పర్యవేక్షిస్తున్నారు. ఈ కంపెనీ సుమారు 17 లక్షల మందిని సభ్యులుగా చేర్చుకుని రూ.ఐదువేల కోట్ల వరకు మోసం చేసిందని సైబరాబాద్‌ పోలీసులు చెబుతున్నారు. ఈ కంపెనీ వ్యవహారాలపై సైబరాబాద్‌ కమిషనరేట్‌లోని మాదాపూర్, కేపీహెచ్‌బీ ఠాణాల్లో ఫిర్యాదు రావడంతో ఈ–బిజ్‌.కాం ప్రైవేట్‌ లిమిటెడ్‌పై కేసు నమోదుచేసి సైబరాబాద్‌ ఎకనామిక్‌ ఆఫెన్స్‌ వింగ్‌కు మార్చిలోనే బదిలీ చేశారు. దీన్ని విచారణ చేపట్టిన పోలీసులు నోయిడాకు వెళ్లి ఎండీ పవన్‌ మల్హన్, కుమారుడు హితిక్‌ మల్హన్‌ను తీసుకొచ్చి కంపెనీకి సంబంధించిన వ్యవహారాలు తెలపాలంటూ నోటీసులు జారీ చేశారు.

అప్పటి నుంచి నోటీసులకు వారు సమాధానం ఇవ్వకపోవడంతో పాటు పరారీలో ఉండటంతో సైబరాబాద్‌ ఎకనామిక్‌ ఆఫెన్స్‌ వింగ్‌సీ కేసును సీరియస్‌గా తీసుకుంది. ఎట్టకేలకు తండ్రీకొడుకులు పవన్‌ మల్హన్, హితిక్‌ మల్హన్‌లపై నిఘా ఉంచి యూపీలో అరెస్టు చేశారు. మిగిలిన నిందితుల కోసం కూడా గాలిస్తున్నారు. ‘‘ఈ కంపెనీ హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, చెన్నై, జమ్మూ, కాశ్మీర్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గోవాతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ విద్యార్థులను కంపెనీ సభ్యులు నమోదు చేసుకుంది. వీరందరి దగ్గర్నుంచి సుమారు రూ.ఐదువేల కోట్లను మోసం చేసింద’’ని సైబరాబాద్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ తెలిపారు. ఈ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి బాధితులకు సత్వర  న్యాయం చేకూరుస్తామని చెప్పారు.   

విద్యార్థులు, నిరుద్యోగులే లక్ష్యంగా.. 
‘మీకు ఆన్‌లైన్‌ కోర్సులు నేర్పుతాం..మీరు రూ.16,821లు చెల్లిస్తే చాలు... ఆన్‌లైన్‌లో మంచి పట్టు సాధించొచ్చు. ఆ తర్వాత మరో ముగ్గురిని ఇదే కోర్సులో చేర్పిస్తే ఒక్కొక్కరికి రూ.2,700ల చొప్పున కమీషన్‌ ఇస్తాం...ఇది కాకుంటే మంచి ఫ్యాషన్‌ డ్రెస్సులు ఉన్నాయి...మీరు చెల్లించిన డబ్బులకు అవి ఇచ్చేస్తాం...ఇదీ నచ్చకపోతే హాలీడే ట్రిప్స్‌కు తీసుకెళతాం...ఆ తర్వాత మీరు చేయాల్సిందల్లా మరో ముగ్గురు సభ్యులను చేర్పిస్తే చాలు... ఒక్కొక్కరిపై తొమ్మిది శాతం కమీషన్‌ వస్తుంది. దీంతో మీరు తల్లిదండ్రులపై ఆధారపడకుండా ఎంజాయ్‌ చేయవచ్చం’టూ కాలేజీ విద్యార్థులనే లక్ష్యంగా చేసుకుని మాయమాటలతో వ్యాపారం కొనసాగిస్తున్నారు ఈ–బిజ్‌ సంస్థ నిర్వాహకులు. ఇలా దేశవ్యాప్తంగా ప్రజలనుంచి డిపాజిట్లు సేకరించి రూ.ఐదువేల కోట్ల వరకు మోసం చేశారన్న అభియోగాలపై ఈ–బిజ్‌.కాం ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పవన్‌ మల్హన్, అతని కుమారుడు హితిక్‌ మల్హన్‌లను సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగం (ఎకనామిక్‌ ఆఫెన్స్‌ వింగ్‌) పోలీసులు యూపీ నోయిడాలో అరెస్టు చేసి సిటీకి తీసుకొచ్చి చర్లపల్లి జైలుకు తరలించారు. దీంతోపాటుగా ఆయా కంపెనీ బ్యాంక్‌ ఖాతాల్లోని రూ.389 కోట్లను ఫ్రీజ్‌ చేశారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top