‘గోదావరి’లో ఒడిశా చిచ్చు!

Collab project on indravati river - Sakshi

ఉపనది ఇంద్రావతిపై మిడిల్‌ కొలాబ్‌ ప్రాజెక్టు

సుమారు 75–100 టీఎంసీలు ఎగువనే వాడుకునేలా ఎత్తుగడ

ప్రాజెక్టుకు అనుమతివ్వాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి

నిర్మాణం జరిగితే దేవాదుల, తుపాకులగూడెం, సీతారామ ప్రాజెక్టులకు నీటి కొరత  

సాక్షి, హైదరాబాద్‌: గోదావరి నదిలో రాష్ట్ర వాటా నీటికి గండికొట్టేలా ఒడిశా ప్రభుత్వం కొత్త ఎత్తు వేసింది. గోదావరి సబ్‌ బేసిన్‌లో ప్రధాన ఉపనదిగా ఉన్న ఇంద్రావతికి అడ్డుకట్ట వేసి భారీ స్థాయిలో నీటిని వినియోగించుకునేలా మిడిల్‌ కొలాబ్‌ బహు ళార్ధ సాధక ప్రాజెక్టును నిర్మించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు వల్ల దిగువనున్న తెలంగాణ ప్రాజెక్టుల నీటి అవసరాలకు తీవ్రంగా గండిపడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

అడ్డుకట్టేస్తే దిగువకు కష్టాలే..
భారీ విద్యుదుత్పత్తి లక్ష్యంగా ఒడిశా ప్రభుత్వం మిడిల్‌ కొలాబ్‌ ప్రాజెక్టును నిర్మించనుంది. ఎగువ నుంచి వచ్చే ఇంద్రావతి ఉపనది నీళ్లు, కొలాబ్‌ ఉపనదిలో కలిసే ప్రాంతంలో జార్నాలా వద్ద పవర్‌ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించింది. జార్నాల వద్ద బ్యారేజీ నిర్మించి ఆ నీటిని పక్కనే నిర్మించే డ్యామ్‌కు తరలించడం ద్వారా విద్యుదుత్పత్తి చేయా లను కుంటోంది. వాస్తవానికి ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య 1975లో కుదిరిన ఒప్పందం మేరకు ఇంద్రావతి, కొలాబ్‌ నది కలిసే ప్రాంతంలో 75 శాతం డిపెండబులిటీ లెక్కన ఒడిశా 8.5 టీఎంసీల మేర వాడుకునే వెసులుబాటు ఉంది.

కానీ ఒడిశా ప్రస్తుతం సుమారు 46.85 టీఎంసీల నీటిని తరలించుకునేలా ప్రణాళికలు వేస్తోంది. భవిష్యత్తులో మరో 75 టీఎంసీల నుంచి 100 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి వ్వాలంటూ కేంద్ర జలవనరులశాఖను కోరింది. అయితే ఈ ప్రాజెక్టు పూర్తిగా అంతర్రాష్ట్ర అంశాలతో ముడిపడి ఉండటంతో దీనిపై గోదావరి బోర్డు ద్వారా అభిప్రాయాలు తెలపాలని ఈ నెల 19న కేంద్ర జలవనరులశాఖ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు లేఖలు రాసింది. కేంద్రం రాసిన ఈ లేఖలతోనే ఇంద్రావతి నీటికి ఒడిశా అడ్డుకట్ట వేస్తోందన్న అంశం తెరపైకి వచ్చింది.

రాష్ట్ర ప్రాజెక్టులకు నీటి కటకటే...
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం మేడిగడ్డ వరకు గోదావరిలో కలిసే ప్రాణహిత నీటిపై ఆధారపడి లభ్యత నీటినంతా కాళేశ్వరం ప్రాజెక్టు అవసరాలకు తరలిస్తోంది. కానీ కాళేశ్వరం దిగువన చేపడుతున్న దేవాదుల, తుపాకులగూడెం, సీతారామ ఎత్తిపోతల పథకాలన్నీ గోదావరిలో వచ్చి చేరే ఇంద్రావతి నదీ నీటిపై ఆధారపడి ఉన్నాయి. దేవాదుల ద్వారా 60 టీఎంసీలు, తుపాకులగూడెం ద్వారా 100 టీఎంసీలు, సీతారామ ఎత్తిపోతల ద్వారా 55 టీఎంసీల మేర వాడుకునే వెసలుబాటు తెలంగా ణకు ఉంది.

ప్రస్తుతం ఇంద్రావతి నీటికి ఎగువనే అడ్డుకట్ట పడితే దిగువన నీటి లభ్యత తగ్గిపోతుం దని, అదే జరిగితే రాష్ట్ర ప్రాజెక్టులకు నీటి కొరత తప్పదని తెలంగాణ ప్రభుత్వం అనుమానిస్తోంది. నిజానికి గోదావరి ట్రిబ్యునల్‌ అవార్డు ప్రకారం ఒక సబ్‌ బేసిన్‌ పరిధిలో ఉండే రాష్ట్రాల అవసరాలు తీరాకే మరో సబ్‌ బేసిన్‌కు నీటిని తరలించాలి. కానీ ప్రస్తుతం దిగువ రాష్ట్రమైన తెలంగాణ అవసరాలను పణంగాపెట్టి ఇంద్రావతి నీటిని కొలాబ్‌ సబ్‌ బేసిన్‌కు తరలించేలా ఒడిశా ప్రభుత్వం ఎత్తుగడ వేస్తోంది. ఇది ట్రిబ్యునల్‌ అవార్డుకు పూర్తి భిన్నంగా ఉన్నదనేది తెలంగాణ నీటిపారుదలరంగ నిపుణుల మాట. దీనికితోడు ప్రస్తుతం గోదావరిలో ఇంద్రావతి కలిసే దిగువ ప్రాంతంలో అకినేపల్లి బ్యారేజీ ద్వారా 247 టీఎంసీలను కావేరికి తరలిస్తూ నదుల అనుసంధానం చేయాలని కేంద్రం భావిస్తోంది.

మంత్రి హరీశ్‌రావు సమీక్ష
గోదావరి–కావేరి నదుల అనుసం ధానం, మిడిల్‌ కొలాబ్‌ ప్రాజెక్టులపై శనివారం నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు జలసౌధలో అధికారులతో సమీక్షించారు. ఈ ప్రాజెక్టులతో తెలంగాణకు జరిగే నష్టంపై అన్ని కోణాల్లో విశ్లేషించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సూచించారు. సమావేశంలో ఈఎన్‌సీలు మురళీధర్, నాగేందర్‌రావు, అంత ర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ నరసింహా రావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top