పాలమూరు ప్రాజెక్టులకు ఊపిరి

CM KCR Funded Irrigation Projects in Mahabubnagar - Sakshi

సీఎం ఆదేశాలతో తీరనున్న నిధుల కొరత 

సాక్షి, గద్వాల : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో చివరి దశలో ఉన్న ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్టులు, కొత్తగా చేపట్టనున్న వాటికి నిధులు కేటాయించాలని ఆర్థిక శాఖను సీఎం కేసీఆర్‌ ఆదేశించడంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు రేకెత్తించాయి. పెండింగ్‌ బకాయిలతో నత్తనడక ఉన్న పనుల్లో వేగం, నిధుల లేక ఆగిన వాటిలో కదలిక రానుంది. వీటన్నింటిని వచ్చే వేసవిలో పూర్తి చేసి 2020 ఖరీఫ్‌లో సాగునీటిని అందించాలని నిర్ణయించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు 15రోజుల క్రితమే పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ రూ.పది వేల కోట్లు మంజూరు చేసింది. గట్టు ఎత్తిపోతల పథకం తుది డీపీఆర్‌ను పూర్తి చేసి టెండర్ల ప్రక్రియను త్వరలోనే చేపట్టాలని సీఎం కేసీఆర్‌ ఇటీవల ఇంజనీర్లను ఆదేశించారు. అలాగే తుమ్మిళ్ల ఎత్తిపోతల రెండో దశ పనులకు నిధుల కొరత తీరనుంది. ఇలా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో చివరి దశలో ఉన్న నెట్టెంపాడు, కేఎల్‌ఐ, భీమా, కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల పథకాల పనులు ఇక వేగం పుంజుకోనున్నాయి. వచ్చే ఖరీఫ్‌లోనే ‘పాలమూరు’ మొదటి దశ నుంచి సాగునీరు అందించాలని సీఎం సూచించారు. దీంతో ఉమ్మడి జిల్లాలో సాగుకు పండుగ రాబోతుంది. కరవు జిల్లా సస్యశ్యామలంగా పాడిపంటలకు నెలవుగా మారనుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

రెండేళ్లుగా సాగని పనులు 
2018–19లో ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్టులకు బడ్జెట్‌లో రూ.990 కోట్లు కేటాయించారు. అయితే కేవలం రూ.580 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగారు. ఈ నాలుగు ప్రాజెక్టుల పనులు చేసిన కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు రూ. 403.74 కోట్లకు పెరిగింది. దీంతో పనులను జాప్యం చేస్తూ వచ్చారు. అలాగే ప్రాజెక్టుల పనులకు అడ్డంకిగా ఉన్న భూసేకరణ చెల్లింపులు సైతం నిలిచి పోడానికి కారణమయ్యాయి. దీంతో రెండేళ్లుగా ప్రాజెక్టుల పనులు ముందుకు సాగలేదు. తాజా గా నిధులు వెంటనే విడుదల చేయాలని సీఎం ఆదేశించడంతో ప్రాజెక్టులు పూర్తయ్యేం దుకు అవకాశం ఏర్పడింది. ఓటాన్‌ అకౌంట్‌లో ప్రాజెక్టులకు కేటాయించిన రూ.983 కోట్లతోపాటు మరో రూ.403 కోట్లు మంజూరు చేస్తే ఇవి పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. 

కొత్త ప్రాజెక్టులకు మోక్షం 
ఆర్డీఎస్‌ పరిధిలో 55 వేల ఎకరాలకు శాశ్వతంగా అందించే లక్ష్యంతో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం చేపట్టి మొదటి దశను పూర్తి చేశారు. రెండో దశలో మూడు జలాశయాలను నిర్మాణంతో పాటు కాల్వను ఆధునికీకరించాల్సి ఉంది. దీనికి రూ.440 కోట్లు అవసరమవుతాయి. త్వరలోనే నీటిపారుదల శాఖ టెండర్ల ప్రక్రియను చేపట్టనుంది. జలాశయాలు పూర్తి చేయడం, ఆర్డీఎస్‌ కాల్వను రూ.70 కోట్లతో ఆధునికీకరిస్తే అలంపూర్‌ నియోజకవర్గంలో ఆయకట్టు సాగు స్థిరీకరించవచ్చు. ప్రస్తుతం మోటార్ల నుంచి నేరుగా పాటుకాల్వలోకి నీటిని విడుదల చేస్తుండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

గట్టు ఎత్తిపోతల పథకానికి..
జూరాల ప్రాజెక్టు ద్వారా వేసవిలో తాగునీటి అవసరాలను తీర్చడానికి నాలుగేళ్లుగా కర్ణాటక రాష్ట్రంపై ఆధారపడాల్సి వస్తోంది. తాగునీటికి 2 టీంఎసీలలు విడుదల చేసినా 0.75 టీఎంసీలు మాత్రమే జూరాలకు చేరుతున్నాయి. కర్ణాటకను ఏటా నీటి కోసం వేడుకునే పరిస్థితి నుంచి శాశ్వతంగా పరిష్కరించాలని సీఎం నిర్ణయించారు. అందుకు గాను నెట్టెంపాడుకు నీరు అందించడానికి ఉపయోగపడేలా గట్టు ఎత్తిపోతలను 15 టీఎంసీల నీటినిల్వతో చేపట్టనున్నారు. జూరాల జలాశయం నుంచి నేరుగా గట్టు ఎత్తిపోతలకు నీటిని పంపింగ్‌ చేసేలా పథకం రూపొందించారు. ఈ ప్రాజెక్టు పనులు మరో నెల రోజుల్లో కార్యరూపంలోకి రానున్నాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top