మీ మైండ్‌సెట్‌ మారదా?

CM KCR Fires On Congress Leaders In Assembly - Sakshi

శాసనసభలో విపక్షాలపై నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్‌

గుడ్డిగా వ్యతిరేకించొద్దు..మంచిని, చెడును గుర్తించడం నేర్చుకోండి

వైఎస్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని నేను సమర్థించలేదా? 

వ్యతిరేకంగా మాట్లాడమే పని అనుకుంటే మీ ఇష్టం 

సంక్షేమ కార్యక్రమాలు, ప్రాజెక్టులపై కేసులు వేసింది మీరు కాదా? 

సాక్షి, హైదరాబాద్‌ : ‘దేనికైనా వ్యతిరేకంగా మాట్లాడడమే పనిగా పెట్టుకోవడం దుర్మార్గం. ఏం వ్యతిరేకించాలో.. దేన్ని సమర్థించాలో తెలుసుకోవాలి. అడ్డగోలుగా మాట్లాడితే బాగుండదు. మీరు చెప్పింది వినడానికి రాలేదు. ఎవరు చెప్పింది కరెక్టో ప్రజలు తీర్పు చెప్పారు. ఇంకా నాలుగున్నరేళ్లు ప్రభుత్వంలో ఉంటాం’అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ విపక్షాలపై ధ్వజమెత్తారు. శుక్రవారం శాసనసభలో పురపాలక బిల్లుపై వివరణ ఇస్తూ.. కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రాజెక్టులపై కేసులు వేసిందీ.. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, సింగరేణిలో కారుణ్య నియామకాలు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను అడ్డుకుంది మీరు కాదా? అని ప్రశ్నించారు.

‘ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై 200 కేసులు వేశారు. పర్యావరణ అనుమతి లేదని ఒకసారి, అనుమతి ఇస్తే ఎలా ఇస్తారని మరోసారి కేసులు వేసిన దిక్కుమాలిన చరిత్ర మీదికాదా? నిరుద్యోగులు గాంధీభవన్‌ ఎదుట ధర్నా చేసింది నిజం కాదా?’అని సీఎం నిలదీశారు. కాంగ్రెస్‌ ధోరణి చూస్తే మేమేమీ చేయలేదు. మీరూ అలాగే ఉండండి అన్నట్లుందన్నారు. అవినీతిరహిత, జవాబుదారీతనం, ప్రతి ఒక్కరి భాగస్వామ్యం పెంపొందించే లక్ష్యంతో మున్సిపల్‌ చట్టం తెస్తే.. దానిని గుడ్డిగా వ్యతిరేకించడం ఎంతవరకు సబబని సీఎం ప్రశ్నించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి తెచ్చిన ఆరోగ్యశ్రీ బాగుందని, కొనసాగిస్తామని సభాసాక్షిగా ప్రకటించామని, ఆ స్ఫూర్తి కాంగ్రెస్‌ నేతల్లో లేకపోవడం దౌర్భాగ్యమని వ్యాఖ్యానించారు. 

పని జరగాలంటే రెండే మార్గాలు
పని జరగాలంటే మనముందు రెండే మార్గాలున్నాయి. ఒకటి భక్తి, మరొకటి భయం. రెండోదానితోనే పురపాలన గాడిలో పడుతుందని విశ్వసిస్తున్నాం అని సీఎం స్పష్టం చేశారు. మున్సిపాలిటీల్లో లంచాల వ్యవస్థ కొనసాగుతోంది. అరాచకాలతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. వీటినుంచి విముక్తి కలిగించేందుకు పారదర్శక, సుపరిపాలన అందనుందని అన్నారు. పాలకవర్గాల అధికారాలను హరించేందుకు కలెక్టర్లకు అధికారాలివ్వలేదని, ప్రాధాన్యతలను క్రమపద్ధతిలో నిర్ధారించి మార్గనిర్దేశం చేస్తారని అన్నారు. పరిపాలనలో విశేషానుభవం ఉన్నందున కలెక్టర్లకు ఈ నియంత్రణాధికారాలు కట్టబెట్టినట్లు చెప్పారు.

ప్రజాప్రతినిధుల హక్కులకు ఏలాంటి భంగం కలగదని, ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం కల్పించేలా పురపాలక చట్టాన్ని తీసుకొచ్చామని కేసీఆర్‌ చెప్పారు. ‘చట్టసభల్లో బీసీలకు 34% రిజర్వేషన్‌ కల్పించాలని భావిస్తే.. సుప్రీంకోర్టు కొట్టేసింది. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న దీనిపై చర్చించి సాధిస్తాం’అని సీఎం స్పష్టంచేశారు. జీహెచ్‌ఎంసీలో నెలకొన్న సమస్యలపై చర్చించేందుకు త్వరలోనే గ్రేటర్‌ పరిధిలోని ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. అలాగే ఆస్తిపన్నుపై వడ్డిస్తున్న పెనాల్టీలను మాఫీ చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశిస్తున్నట్లు చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top