బోనమెత్తిన భాగ్యనగరం..

బోనమెత్తిన భాగ్యనగరం..


- వైభవంగా లాల్‌దర్వాజా మహంకాళి బోనాలు

హైదరాబాద్‌:
తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ఆషాఢ బోనాలతో మహానగరం భక్తజన సంద్రంగా మారింది. పోతరాజుల విన్యాసాలు... అమ్మవారి ఫలహార బండ్ల ఊరే గింపులు... తీన్‌మార్‌ స్టెప్పులతో హోరెత్తు తుంటే... మరోవైపు సంప్రదాయ దుస్తుల్లో తెలుగింటి మగువలు లాల్‌దర్వాజా సింహ వాహిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. ఆదివారం తెల్లవారు జాము నుంచే భక్తులు అమ్మవారి దర్శనం కోసం పోటెత్తారు. బలిగంప ఊరేగింపు అనంతరం అర్చకులు దేవికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారికి బోనాల సమర్పణ ప్రారంభమైంది.ఈ ఏడాది  వర్షాలు విస్తారంగా కురవాలని, అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నాని నిజామాబాద్‌ ఎంపీ  కల్వకుంట్ల కవిత అన్నారు. రెండు నెలల ముందు నుంచే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామనిహోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, తెలిపారు. బోనాల ఉత్సవా లకు రాష్ట్రం ఆవిర్భవించిన తొలినాళ్లలో రూ.5 కోట్లు ఇచ్చామని దీన్ని ఈ ఏడాది రూ.10 కోట్లకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ఈటల తెలిపారు. ఇదిలా ఉండగా బ్యాడ్మింటన్‌లో వరల్డ్‌  నంబర్‌వన్‌ కావాలని అమ్మవారిని కోరుకున్నానని క్రీడాకారిణి పి.వి.సింధు, తెలిపారు.బంగారు బోనం సమర్పించిన కవిత

నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, సినీమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు, శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్యేలు జి.కిషన్‌రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్, కాంగ్రెస్‌ నాయకులు డీకే అరుణ, గీతారెడ్డి, అంజన్‌కుమార్‌యాదవ్, సర్వే సత్యనారాయణ, వి.హన్మంతరావు, దానం నాగేందర్‌ అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించారు. జోగిని శ్యామల నాట్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Back to Top