చిన్నారుల కిడ్నాప్ ముఠా గుట్టురట్టు


జిన్నారం: అభం శుభం తెలియని చిన్నారులకు చాక్లెట్లను ఆశ చూపి కిడ్నాప్ చేస్తారు..సొంత బిడ్డల్లా చూసుకుంటూ పెంచి పెద్ద చేస్తారు. వారు పెరిగి పెద్దయ్యాక దొంగతనాలు, వ్యభిచారం, వెట్టిచాకిరీ చేయించి సొమ్ము చేసుకుంటారు. ఇలాంటి ఓ ముఠాను  జిన్నారం పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను నర్సాపూర్ సీఐ సైదిరెడ్డి జిన్నారం పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈనెల 13న జిన్నారం మండలంలోని బొంతపల్లి గ్రామానికి చెందిన నవీన్‌కుమార్ (12), జోగినాథ్ (8), నాగరాజుగౌడ్ (9) తప్పిపోగా, తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నవీన్‌కుమార్‌ను కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారని తెలుసుకుని కిడ్నాప్ చేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించి చిన్నారుల కోసం తీవ్రంగా గాలించారు. ఈ క్రమంలోనే నవీన్‌కుమార్‌ను హైదరాబాద్‌లోని కాచిగూడలో, జోగినాథ్, నాగరాజ్‌గౌడ్‌లను కామారెడ్డిలో పోలీసులు గుర్తించారు.

 

 వారి ద్వారా కిడ్నాపర్లవివరాలను సేకరించారు. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డికి చెందిన చింతల వెంకటేశ్, అతని భార్య చింతల వీరమణి, కుమారుడు చింతల కృష్ణ, అనంతపురానికి చెందిన వీరి బంధువు గజ్జెర్ల సాయికుమార్‌లు నిందితులుగా గుర్తించి వారిని అదుపులోనికి తీసుకున్నారు.

 

 పెంచి పెద్దచేసిమరీ...

 నిందితులను అదుపులోనికి తీసుకున్న పోలీసులు తమదైనశైలిలో ప్రశ్నించి వివరాలు రాబట్టారు. నిందితులు చెబుతున్న విషయాలు విని పోలీసులే నివ్వెరపోయారు. తాము 15 సంవత్సరాలుగా చిన్నారులను కిడ్నాప్ చేస్తున్నామని, కిడ్నాప్ చేసిన చిన్నారులను పెంచి పెద్దచేసి వారి చేత రైల్వేస్టేషన్‌లు, బస్టాండ్‌లలో చోరీలు, పిక్‌పాకెటింగ్ చేయిస్తామని, బాలికలయితే వ్యభిచారం చేయిమని విచారణలో నిందితులు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.

 

 15ఏళ్ల తర్వాత

 తల్లిదండ్రుల చెంతకు..

 సంగాారెడ్డికి చెందిన రాంరెడ్డి, పార్వతమ్మల కుమారుడు భాస్కర్ 15 సంవత్సరాల క్రితం కిడ్నాపర్లు అపహరించుకుపోయారు. అప్పుడు భాస్కర్ వయస్సు రెండున్నర సంవత్సరాలు. ప్రస్తుతం నిందితులు అదుపులోనికి తీసుకున్న పోలీసులు వారి ద్వారా వివరాలు సేకరించి భాస్కర్‌తో సహా నలుగురు బాలురను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. అదే విధంగా కిడ్నాప్‌కు పాల్పడిన వెంకటేశ్, వీరమణి, కృష్ణ, సాయికుమార్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

 

 వీరి వద్ద నుంచి ఓ టీవీఎస్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సైదిరెడ్డి వెల్లడించారు. సంగారెడ్డి, రామచంద్రాపురం, నాచారం, లింగంపల్లి, రంగారెడ్డి, శంషాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 10 మంది బాలురు, బాలికలు కిడ్నాపర్‌ల చెరలో ఉన్నట్టు తెలిపారు. మరో ఇద్దరు కిడ్నాపర్లు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలోనే వారిని పట్టుకుంటామని సీఐ వివరించారు. పరారీలో ఉన్న వారి వద్దే మిగతా బాలురు, బాలికల సమాచారం ఉందన్నారు. ఈ కేసును ఛేదించేందుకు కృషి చేసిన జిన్నారం ఎస్‌ఐ పాలవెల్లిని సీఐ సైదిరెడ్డి అభినందించారు. అంతేకాకుండా ఎస్‌ఐ పాలవెల్లితో సహా ఏఎస్‌ఐ నారాయణరెడ్డి, సిబ్బంది కృష్ణ, సుధాకర్, రామచంద్రం, సంతోష్, తిరుపతి, అంజోద్‌లకు జిల్లా ఎస్పీ నుంచి రివార్డులను అందిస్తామని సీఐ సైదిరెడ్డి ప్రకటించారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top