‘ముక్క’ మస్త్‌గా...

Chicken Distribution in Telanagana Elections - Sakshi

ఎన్నికల సీజన్‌లో రికార్డు స్థాయిలో చికెన్‌ విక్రయాలు  

గ్రేటర్‌లో ప్రచారం చివరి మూడు రోజుల్లో కోటి 50లక్షల కిలోలు

సాక్షి, సిటీబ్యూరో: నవంబర్‌ రెండో వారంలో కార్తీకమాసం ప్రారంభమైంది. అంతేకాకుండా అయ్యప్ప భక్తులు మాలధారణలో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఈ సీజన్‌ను ప్రతిఏటా చికెన్‌ వ్యాపారులు ‘వెజిటేరియన్‌ సీజన్‌’గా భావిస్తారు. కానీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీన్‌ మారిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రేటర్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు జరిగాయి. అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ మొదలు ప్రచారం ముగిసే వరకు చికెన్‌ తెగ తినేశారు. వాస్తవానికి ఈ సీజన్‌లో తగ్గాల్సిన ధరలు... అమాంతంగా పెరిగాయి. ఎన్నికల సందడితో కిలో చికెన్‌ ధర రూ.200 పలికింది.  

రోజుకు 50లక్షల కిలోలు...   
గ్రేటర్‌లో ప్రచారం చివరి మూడు రోజుల్లో చికెన్‌ విక్రయాలు భారీగా జరిగాయి. గ్రేటర్‌లో సాధారణ రోజుల్లో రోజుకు 20లక్షల కిలోల విక్రయాలు జరుగుతాయి. ఇక వారాంతాల్లో (శని, ఆది)50లక్షల కిలోలు జరుగుతుండగా... ప్రచారం చివరి మూడు రోజుల్లోనూ రోజుకు 50లక్షల చొప్పున కోటి 50లక్షల కిలోల చికెన్‌ విక్రయాలు జరిగాయని వ్యాపారులు పేర్కొన్నారు. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో రోజుకు 35–40లక్షల కిలోల చికెన్‌ విక్రయాలు జరగ్గా.. ఈ ఎన్నికల్లో అది మరింత పెరిగింది. ఈసారి పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చాయని హోల్‌సేల్‌ వ్యాపారులు పేర్కొన్నారు.   

ప్రచారం.. పసందు  
నవంబర్‌ 12న ఎన్నికల నోటిఫికేషన్‌ మొదలు ప్రచారం ముగిసే వరకూ వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు చికెన్‌ తెగ తినేశారు. చివరి వారం రోజుల్లో అయితే విక్రయాలు మరింత పెరిగాయి. అభ్యర్థులు ప్రచారంలో భాగంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పాదయాత్రలు, ఇంటింటి ప్రచారం, బహిరంగ సభలు, రోడ్‌ షోలతో బిజీబిజీగా గడిపారు. వీరితో పాటు నాయకులు, కార్యకర్తలు భారీగా కదిలి వెళ్లారు. వీరందరూ ఉదయం టిఫిన్‌తో సరిపెట్టుకోగా... మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్‌లో చికెన్‌నే తిన్నారు. దీంతో సాధారణంగా ఈ సీజన్‌లో కిలో రూ.160 ఉండాల్సిన చికెన్‌... రూ.210 వరకు పలికింది.

కోళ్లు మిగల్లేవ్‌...   
ఎన్నికల హడావుడి ప్రారంభమైనప్పటి నుంచి చికెన్‌ విక్రయాలు పెరిగాయి. మటన్‌ ధరలు ఎక్కువగా ఉండడంతో నాయకులందరూ చికెన్‌ వడ్డించేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో గత వారం రోజులుగా కోళ్లు మిగలకుండా విక్రయాలు జరుగుతున్నాయి. కార్తీకమాసం అయినా ఎన్నికల సీజన్‌ రావడంతో చికెన్‌ ధరలు పెరిగాయి. హోల్‌సెల్‌ లైవ్‌ కోడి కిలో ధర రూ.120 వరకు ఉంది. ఇక స్కిన్‌లెస్‌ చికెన్‌ కిలో రూ.210 వరకు ఉంది.     – అబ్దుల్‌ సత్తార్, చికెన్‌ వ్యాపారి, ముషీరాబాద్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top