మోసగాళ్లొస్తున్నారు..!

Cheaters Sainagar Service Consultancy in Bhadrachalam - Sakshi

ఏమాత్రం కష్టం లేకుండా.. 
చెమట చుక్క కార్చకుండా.. 
గదిలోంచి బయటకు రాకుండా.. 
కుర్చీలో నుంచి లేవకుండా.. 
డబ్బు సంపాదించొచ్చా..? 
ఒకడికి ఆలోచనొచ్చింది..! 

 
అందమైన బోర్డు పెట్టాడు.. 
అట్టహాసంగా ఆఫీసు తెరిచాడు.. 
అమాయకులతో గుంపును పోగేశాడు.. 
అదిగో ఉద్యోగాలంటూ ఊరించాడు.. 
అందాలంటే ఖర్చంటూ గాలమేసాడు..
మోసగాడిగా అవతారమెత్తాడు..!! 

 
ఉద్యోగమనగానే పరుగెత్తారు.. 
అడగ్గానే డబ్బులిచ్చేశారు.. 
ఊహాలోకాల్లో తిరిగారు.. 
అలిసిపోయి తిరిగొచ్చారు.. 
కన్నీరు కారుస్తున్నారు.. 
అమాయకపు నిరుద్యోగులు..!!! 

భద్రాచలం: మోసపోయేవాళ్లు ఉన్నంతకాలం.. మోసగించేవాళ్లు ఉంటారు. ఇది మరోమారు నిరూపితమైంది. 

ఇలా మొదలు... 
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) అనుబంధ కార్యాలయమని చెప్పుకుంటూ, ఖమ్మం రైల్వే స్టేషన్‌ సమీపంలో ‘సాయినగర్‌ సర్వీస్‌ కన్సల్టెన్సీ’ పేరుతో ఓ దుకాణాన్ని విజయవాడకు చెందిన ఆర్‌కే అలియాస్‌ రాధాకృష్ణ తెరిచాడు. డబ్ల్యూహెచ్‌ఓ తరఫున క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు ఫీల్డ్‌ సూపర్‌వైజర్, ఫీల్డ్‌ ఆఫీసర్, ఫీల్డ్‌ మేనేజర్, కంట్రోలర్‌ ఉద్యోగాలు పేరుతో కొందరిని నియమించుకున్నాడు. రకరకాల పేరుతో వారి నుంచి రెండున్నరవేల చొప్పున వసూలు చేశాడు. సర్వే పేరుతో వారిని ఊళ్లకు పంపించి పంపించాడు. వారి ద్వారా ఇంకొంతమందిని.. వీరి ద్వారా మరికొంతమందిని.. ఇలా అనేకమందికి ‘ఉద్యోగాలు’ ఇచ్చాడు. మూడు నెలలపాటు కాంట్రాక్ట్‌ పద్ధతిన పనిచేసిన తరువాత ఉద్యోగం పర్మనెంట్‌ అవుతుందన్నాడు. ‘ఉద్యోగం’లో చేరిన వారిలో ఏ ఒక్కరికీ ‘జీతం’ ఇవ్వలేదు. 

మొన్న ఖమ్మంలో.. 
ఈ ‘ఉద్యోగుల్లో’ కొందరికి అనుమానమొచ్చింది. ఖమ్మంలోని కార్యాలయానికి వారు సోమవారం వెళ్లి గొడవ చేయడంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేశారు. కార్యాలయ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. సూత్రధారుడు ఆర్‌కే ఎక్కడున్నాడో తెలియదు. 

నిన్న భద్రాచలంలో.. 
తమ సంస్థపై ఖమ్మంలో కేసు నమోదైందని తెలుసుకున్న భద్రాచలంతోపాటు పరిసర మండలాల్లోని వందలమంది ‘ఉద్యోగులు’ (బాధితులు) బయటకు వచ్చారు. ఈ సంస్థకు సూపర్‌వైజర్‌నని చెప్పుకుంటూ తామందరినీ నియమించిన భద్రాచలంలోని ఏఎస్‌ఆర్‌ కాలనీ గల కాటా పద్మావతి ఇంటికి మంగళవారం 57 మంది చేరుకున్నారు. తమ డబ్బు తిరిగివ్వాలని డిమాండ్‌ చేశారు. ఆమె పోలీసులను ఆశ్రయించింది. బాధితులు తమ జాబితాను పోలీసులకిచ్చారు. ఉద్యోగాలొస్తాయనే ఆశతో డబ్బు కట్టామంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ‘‘నేను కూడా డబ్బులు కడితేనే సూపర్‌వైజర్‌ ఉద్యోగమిచ్చారు. వసూలు చేసిన డబ్బులు రూ.2.40లక్షలను సంస్థ నిర్వాహకుల కు ఇచ్చాను’’ ఆని ఆమె చెప్పింది. ఫిర్యాదు చేస్తే విచారణ జరిపిస్తామని పోలీసులు చెప్పారు. 

వివరాలు సేకరిస్తున్నాం 
దీనిపై భద్రాచలం ఎస్సై కరుణాకర్‌ను ‘సాక్షి’ వివరణ కోరింది. ‘‘ఉద్యోగాల పేరుతో డబ్బులు కట్టించుకున్నట్టుగా కొంతమంది మా దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఖమ్మంలో కేసు నమోదైంది. ఇక్కడి పరిస్థితిని ఖమ్మం పోలీసులకు తెలిపాం. మరిన్ని వివరాలు సేకరిస్తున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణం గా తదుపరి చర్యలు తీసుకుంటాం’’ అన్నారు.

ఏమి తెలివి.. ఏమి తెలివి..! 
డబ్ల్యూహెచ్‌ఓ తరఫున గ్రామాల్లో సర్వేకు వస్తున్న తమ సిబ్బందికి సహకరించాలని కోరుతూ ‘ఎస్‌ఎస్‌ సర్వీస్‌’ నిర్వాహకులు ప్రభుత్వ అధికారులకు, సర్పంచులకు లేఖలు రాశారు. వీటిపై ‘ఎస్‌ఎస్‌ సర్వీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కేఆర్‌ కృష్ణ’ పేరు ఉంది. ఈ లేఖలపై ఏ ఒక్క అధికారికైనా అనుమానం వచ్చుంటే.. పోలీస్‌ ఉన్నతాధికారులకు సమాచారమిచ్చుంటే.. వందలమంది నిరుద్యోగులు మోసపోయేవారే కాదు. ఏదేదే పేరుతో దుకాణాలు తెరిచి, ఉద్యోగాల పేరుతో దండుకునే మోసగాళ్లకు.. మాయగాళ్లకు చెక్‌ పడేది. సర్పంచుల సంగతి వదిలేస్తే.. మన అధికారులకు ఇసుకమంతైనా అనుమానం రాకపోవడం వింతే కదూ! 
(ఏ ఒక్క అనధికార సంస్థ నుంచిగానీ, వ్యక్తుల నుంచిగానీ తనకు ఎటువంటి లేఖలు అందలేదని ‘సాక్షి’తో భద్రాచలం తహసీల్దార్‌ పీవీ రామకృష్ణ చెప్పారు) 

బూర్గంపాడు మండలంలో కూడా...
బూర్గంపాడు: బూర్గంపాడులో కూడా ఈ సంస్థ బాధితులు ఉన్నారు. భద్రాచలానికి చెందిన యువకుడు శ్రీనివాస్, హైదరాబాద్‌లో నివాసముంటున్నాడు. భద్రాచలంలో పట్టణానికి చెందిన ఓ యువకుడిని మధ్యవర్తిగా నియమించుకున్నాడు. అతని ద్వారా, ‘డబ్ల్యూహెచ్‌ఓ’ ఉద్యోగాల పేరుతో అనేకమంది నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడు. నెలలు గడుస్తున్నా ఉద్యోగాల ఊసే లేకపోవడంతోపాటు ఖమ్మంలో కేసు నమోదవడంతో డబ్బు చెల్లించిన వారంతా మధ్యవర్తిపై ఒత్తిడి పెంచారు. మధ్యవర్తి ఫోన్‌ చేసినా శ్రీనివాస్‌ నుంచి సరైన స్పందన లేదు. దీంతో అందరూ కలిసి పథకం వేశారు. మూడు రోజుల కిందట శ్రీనివాస్‌కు మ«ధ్యవర్తి ఫోన్‌ చేశాడు. ‘‘ఉద్యోగం కోసం ఒకాయన డబ్బులు ఇస్తానన్నాడు’’ అని చెప్పాడు. దీంతో, సోమవారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి కారులో సారపాకకు శ్రీనివాస్‌ వచ్చాడు. అప్పటికే సారపాక సెంటర్‌లో బాధితులు, మధ్యవర్తి మాటు వేశారు.

 శ్రీనివాస్‌ను పట్టుకునేందుకు సిద్ధమయ్యారు. దీనిని పసిగట్టిన శ్రీనివాస్, కారు దిగకుండానే వెనక్కు తిప్పుకుని పరారయ్యాడు. బాధితులు, మ«ధ్యవర్తి కలిసి మరో కారులో వెంబడించి పాల్వంచలో పట్టుకుని, అక్కడి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. కారు సహా శ్రీనివాస్‌ను బూర్గంపాడు పోలీస్‌స్టేషన్‌కు అక్కడి ఎస్సై పంపించారు. ఎస్‌ఐ అందుబాటులో లేకపోవటంతో కారును పోలీస్‌ స్టేషన్‌లోనే ఉంచి, మంగళవారం ఉదయం రావాలంటూ శ్రీనివాస్‌ను వదిలేశారు. అతడి ఫోన్‌ స్వచ్ఛాఫ్‌ ఉందని, మంగళవారం ఉదయం పోలీస్‌స్టేషన్‌కు కూడా రాలేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాల పేరుతో మోసపోయినట్టుగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెప్పారు. నిందితుడిగా భావిస్తున్న కారు తమ ఆధీనంలోనే ఉందన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top