రాష్ట్ర కేబినెట్‌లో మార్పులు?

Changes in state cabinet - Sakshi

అనారోగ్యంతో బాధపడుతున్న మంత్రి చందూలాల్‌ స్థానంలో ఒకరికి చాన్స్‌!

పరిశీలనలో ఆదిలాబాద్‌కు చెందిన కోవ లక్ష్మి పేరు

మంత్రివర్గంలో మహిళలేని లోటును పూడ్చే వ్యూహం

విస్తరణ కోసం ఎదురు చూస్తున్న ఆశావహులకు నిరాశే?  

సాక్షి, హైదరాబాద్‌ :  అధికార టీఆర్‌ఎస్‌లో దాదాపు ఏడాదిగా ఊరిస్తున్న మంత్రివర్గ విస్తరణకు తెర లేవనుందా? పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ మేరకు నిర్ణయానికి వచ్చారా? పార్టీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం, విశ్వసనీయ వర్గాలు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. ఈ నెలలోనే మంత్రివర్గంలో మార్పుచేర్పులకు అవకాశం ఉందని తెలుస్తోంది. ఇద్దరు, ముగ్గురు మంత్రులకు ఉద్వాసన తప్పదన్న ప్రచారం జరుగుతున్నా కనీసం ఒక మార్పు అయితే అనివార్యమంటున్నారు.

గిరిజన సంక్షేమ, టూరిజం శాఖల మంత్రి చందూలాల్‌ అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆయనకు విశ్రాంతి ఇవ్వాలని సీఎం భావిస్తున్నారని చెబుతున్నారు. అనారోగ్య కారణాల వల్లే చందూలాల్‌ గత నెలలో జరిగిన శాసన సభ సమావేశాలకు ఒక్క రోజూ హాజరు కాలేదు. దాదాపు ఏడాదిగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. దీంతో త్వరలోనే ఆయన్ను మంత్రివర్గం నుంచి తప్పించి మరొకరికి అవకాశం కల్పిస్తారన్న చర్చ పార్టీలో జోరందుకుంది. ఆయన స్థానంలో గిరిజన వర్గానికే చెందిన వారికి అవకాశం కల్పించనున్నారు. అయితే సీఎం పరిశీలనలో ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పేరు ముందు వరుసలో ఉందని సమాచారం.

వాస్తవానికి ఆమెకు పార్లమెంటు కార్యదర్శిగా (సహాయ మంత్రి) అవకాశం కల్పించారు. కానీ కోర్టు నిర్ణయానికి లోబడి ఆ పదవులను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆమె అప్పటి నుంచి మరో అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. చందూలాల్‌ను తప్పిస్తే మంత్రివర్గంలో అవకాశం కోసం గిరిజన కోటాలో కోవ లక్ష్మితో పాటు ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖా నాయక్, కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన డోర్నకల్‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ ఆశపెట్టుకున్నారని చెబుతున్నారు. అయితే ఆదివాసీ తెగకు చెందిన కోవ లక్ష్మికి అవకాశం కల్పించి మంత్రివర్గంలోకి తీసుకునే వీలుందని సమాచారం.

ఆశావహులకు నిరాశేనా?
మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని, మంత్రి పదవుల నుంచి ఉద్వాసన పలికే వారి పేర్లు, వారి స్థానాల్లో కొత్తగా తీసుకునే వారి పేర్లు దాదాపు ఏడాదిన్నర నుంచి విస్తృతంగానే ప్రచారం అయ్యాయి. గత నెల కూడా ముగ్గురి నుంచి నలుగురు మంత్రులను మార్చి కొత్త వారికి అవకాశం కల్పిస్తారని ప్రచారం జరిగింది. హైదరాబాద్‌ నగరానికి చెందిన మంత్రులు పద్మారావుగౌడ్, నాయిని నర్సింహారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన డాక్టర్‌ లక్ష్మారెడ్డి, వరంగల్‌కు చెందిన చందూలాల్‌లను మారుస్తారని వార్తలు వచ్చాయి.

వారి స్థానంలో మండలి చైర్మన్‌ స్వామిగౌడ్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్లు తెరపైకి వచ్చాయి. అలాగే మంత్రివర్గంలో కీలక పాత్ర పోషిస్తున్న మరో మంత్రికి పార్టీ బాధ్యతలు అప్పజెప్పి ఆయన స్థానంలో పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుకు అవకాశం ఇస్తారని కూడా ప్రచారం జరిగింది. అయితే కేవలం ఒకే ఒక మార్పుకే అవకాశం ఉందన్న సమాచారంతో ఆశావహులకు నిరాశే మిగులనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ మార్పుతోపాటు కొందరు మంత్రులశాఖల మార్పు కూడా ఉండే అవకాశం ఉందంటున్నారు. అయితే ఈ మార్పుచేర్పులకు ముహూర్తమే కుదరాల్సి ఉంది.  

రెండు కోటాల భర్తీయే వ్యూహం...
ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి మంత్రివర్గంలో మహిళకు స్థానం కల్పించలేదనే అపవాదును టీఆర్‌ఎస్‌ మోస్తూ వస్తోంది. విపక్షాలు ప్రతిసారీ ఈ అంశాన్ని వేలెత్తి చూపుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన జీఈఎస్‌ సదస్సు నేపథ్యంలోనూ ఇదే అంశంపై విపక్షాలు టీఆర్‌ఎస్‌ లక్ష్యంగా విమర్శలు చేశాయి. మహిళల కోటా నుంచి మాజీ మంత్రి కొండా సురేఖ కూడా ప్రయత్నాలు చేశారు. చందూలాల్‌ స్థానంలో కోవ లక్ష్మికి అవకాశం కల్పిస్తే అటు మహిళా కోటా, ఇటు ఆదివాసీ కోటా పూర్తి చేసినట్లు అవుతుందన్న చర్చ కూడా జరిగిందని అంటున్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకునే మార్పు అనివార్యమని, అదెప్పుడన్నదీ ఎదురు చూస్తున్నామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top