ఫిరాయింపులపై ఇప్పుడు మాట్లాడను

chandrababu about party jumpers - Sakshi

టీటీడీపీ విస్తృత స్థాయి భేటీలో బాబు

పార్టీని తెలంగాణ ప్రజలే కాపాడుకోవాలి

రాజకీయాల్లో ఏం చేస్తామో ముందే చెప్పొద్దు

నాకొదిలేయండి.. నేనే దిశానిర్దేశం చేస్తా

తెలంగాణలో టీడీపీ జెండా ఎగరాలి

సాక్షి, హైదరాబాద్‌: ‘‘తెలంగాణ అభివృద్ధికి, ఈ ప్రాంత ప్రజల సంక్షేమానికి టీడీపీ ఎంతో కృషి చేసింది. పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలతో పాటు తెలంగాణ ప్రజలపైనా ఉంది’’ అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ‘‘గత ఎన్నికల్లో 15 సీట్లలో గెలిచాం. కొందరు కొన్ని కారణాలతో పార్టీ మారారు. ఆ ఫిరాయింపులపై నేనిప్పుడు మాట్లాడను’’అని చెప్పారు. గురువారం హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో తెలంగాణ టీడీపీ విస్తృతస్థాయి భేటీలో ఆయన ప్రసంగించారు.

‘‘తెలంగాణ కార్యకర్తలను దిక్కులేని వారిగా వదిలేయొద్దనే, వారిలో చైతన్యం నింపాలనే వచ్చాను. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలి. ఇక్కడ పార్టీ అభివృద్ధికి సమయం కేటాయిస్తా. నెల నెలా సమీక్ష నిర్వహిస్తా. వీలైనన్ని ఎక్కువ రోజులు ఇక్కడ ఉండేందుకు ప్రయత్నిస్తా’’అని చెప్పారు. ఏ ఎన్నికలొచ్చినా సిద్ధంగా ఉండాలని సూచించారు. పనిచేసే నాయకులకే పదవులిద్దామన్నారు.

నిరంతరం ప్రజల్లో ఉంటే ప్రజలు మీ వెంట ఉంటారని నేతలనుద్దేశించి అన్నారు. ‘‘వచ్చే ఎన్నికల్లో ఏం జరుగుతుందో అని ఇప్పుడే ఆలోచిస్తే ముందుకు సాగలేం. గత ఎన్నికలప్పుడు టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఇప్పుడు కొంత సందిగ్ధత ఉంది. రాజకీయాల్లో ఏం చేస్తామో చెప్పకూడదు. ఆ విషయం నాకు వదిలేయండి. ఏం చేయాలో నేను దిశానిర్దేశం చేస్తా’’అని చెప్పారు.

సమరం వద్దు.. పోరాటం చాలు!
టీడీపీ నేతలు సమరం చేయాల్సిన పని లేదని, సమస్యలపై పోరాడితే చాలని బాబు వ్యాఖ్యానించారు. పార్టీ కమిటీలన్నింటినీ త్వరలో భర్తీ చేస్తానని చెప్పారు. తెలంగాణలో టీడీపీ జెండా రెపరెపలాడాలని ఆకాంక్షించారు. ‘‘తెలంగాణలో పార్టీకి జనం బ్రహ్మరథం పడతారు. పార్టీని తిరుగులేని శక్తిగా మార్చండి. తెలంగాణలో అంతటా మనం విద్యాసంస్థలు ఏర్పాటు చేశాం. జంటనగరాలకు తోడు ఆధునిక నగరంగా సైబరాబాద్‌ను నిర్మించింది టీడీపీయే.

హైదరాబాద్‌ను విశ్వనగరంగా, నాలెడ్జ్‌సెంటర్‌గా మార్చాం. నగరంలో మత సామరస్యాన్ని కాపాడగలిగాం. తెలుగు జాతి ఉన్నంతవరకు టీడీపీ ఉంటుంది. సంక్షేమ కార్యక్రమాలన్నీ టీడీపీతోనే మొదలయ్యాయి. బడుగు బలహీనవర్గాల అభివృద్ధే మన ధ్యేయం. వారే పార్టీకి వెన్నెముక’’అన్నారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ అధ్యక్షతన జరిగిన భేటీలో ఎంపీ గరికపాటి మోహన్‌రావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, పార్టీ నేతలు రావుల చంద్రశేఖర్‌ రెడ్డి, అరవింద్‌ కుమార్‌ గౌడ్, వంటేరు ప్రతాప్‌రెడ్డి, కొత్తకోట దయాకర్‌రెడ్డి, నన్నూరి నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top