కారు దగ్ధం

Car Burnt in Fire Accident With Engine Problem Hyderabad - Sakshi

ఇంజిన్‌లోంచి  ఒక్కసారిగా  పొగ, మంటలు

సాక్షి,, సిటీబ్యూరో: తరచు అగ్ని ప్రమాదాలకు గురవుతున్న కార్లు  వాహనదారుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఎప్పుడు, ఎక్కడ ఎలాంటి  ఉపద్రవం ముంచుకొస్తుందో  తెలియని స్థితిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని  ప్రయాణం చేయవలసి వస్తోందని  వాహనదారులు  ఆందోళన  వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం తిలక్‌నగర్‌ చౌరస్తాలో చోటుచేసుకున్న ఉదంతంలో  అందులో ప్రయాణిస్తున్న వారు తృటిలో  ప్రమాదం నుంచి బయట పడ్డారు. హిమాయత్‌నగర్‌ నుంచి దిల్‌సుఖ్‌నగర్‌కు వెళ్తున్న  హ్యూండాయ్‌ ఎక్సెంట్‌ 1.2 సీడీఆర్‌ఐ కారు ఈ నెల  12న రాత్రి 9.30 గంటల సమయంలో  తిలక్‌నగర్‌ చౌరస్తాకు చేరుకుంది. అప్పటికే  రెడ్‌ సిగ్నల్‌ పడడంతో  కారును  ఆపారు.

సరిగ్గా అదే సమయంలో కారు ఇంజిన్‌ నుంచి పొగ రావడాన్ని గుర్తించి అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వెంటనే  బయటకు వచ్చేశారు. క్షణాల్లోనే పెద్ద ఎత్తున మంటలు అంటుకోవడంతో కారు పూర్తిగా కాలిపోయింది. వాహనం తయారీలోనే లోపం ఉన్నట్లు  వాహన యజమాని   ఆరోపించారు. ఈ మేరకు మరుసటి రోజు కాలిపోయిన కారు స్థానంలో కొత్త కారును రీప్లేస్‌ చేయాల్సిందిగా  హిమాయత్‌నగరలోని  షోరూమ్‌లో  విజ్ఞప్తి చేశారు. అయితే  మ్యానుఫాక్చర్‌ లోపాల కారణంగా కాలిపోయిన కారు స్థానంలో కొత్తకారు తిరిగి ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని వాహన యజమాని విజయలక్ష్మి పేర్కొన్నారు. వాహనం తయారీలోనే లోపాలు ఉన్నప్పుడు  ఇన్సూ్యరెన్స్‌కు ఎలా వెళ్తామని ఆమె  ప్రశ్నించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top